HYD: నగరంలో జోరుగా బెగ్గింగ్ మాఫియా.. గంజాయి, డ్రగ్స్​ ముఠాలతో బంధాలు!

by Disha Web Desk 2 |
HYD: నగరంలో జోరుగా బెగ్గింగ్ మాఫియా.. గంజాయి, డ్రగ్స్​ ముఠాలతో బంధాలు!
X

దిశ ప్రతినిది, హైదరాబాద్: సిగ్నల్​ లైట్లు పడిన వెంటనే ఆ పక్కనే ఉన్న కొందరు యాచకులు చేయి చాచడం అందరికీ అనుభవమే. నిజానికి వారిని ఆ పరిస్థితుల్లో చూసి బాధ అనిపించడం సహజం. కానీ, వారు బిజినెస్​ చేస్తున్నారని తెలుసా? వేలు, లక్షల్లో కాదు ఏకంగా వారి వ్యాపారం టర్నోవర్​ కోట్లలో ఉందంటే నమ్ముతారా? ఏటా దేశంలో యాచకులు ఆర్జించే డబ్బు రూ.260కోట్లకు పైగానే.. ఇక హైదరాబాద్​లో రూ.24కోట్లుపైనే అంటే నమ్మశక్యంగా లేదా? కానీ, ఇదే నిజం. అయితే, ఆ డబ్బంతా రోడ్లపై అడ్డుకుంటున్నవారి జేబుల్లోకి పోవడం లేదు.. వారి పనిలో పెట్టుకున్న బెగ్గింగ్​ మాఫియాకు సొంతం అవుతున్నది. నగరంలోని సిగ్నల్​ పాయింట్లు, ఆలయాలు ఇలా జనసమ్మర్థం అధికంగా ప్రాంతాలను బెగ్గింగ్​ మాఫియా అడ్డాగా చేసుకుంటుంది. ఇతర రాష్ట్రాలనుంచి తీసుకువచ్చిన పసిపిల్లలు, మహిళలతో భిక్షాటన చేయిస్తుంది. వారికి టార్గెట్లు ఇస్తుంది.. ఆ టార్గెట్​ చేరుకోకపోతే దాడులు చేస్తూ నరకయాతన చూపిస్తుంది. ఈ దురాగతమంతా కళ్లముందే జరుగుతున్నా పోలీసులు చర్యలు తీసుకోకపోవడం ఒకటైతే.. ప్రభుత్వం కూడా ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోకపోవడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారుతున్నది.

అడ్డుకోవడం ప్రొఫెషన్​

యాచకులు లేని నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దుతామని తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రకటనలు కేవలం ప్రకటనలుగానే మిగిలిపోయాయి. భాగ్యనగరంలో రద్దీగా ఉండే పలు కూడళ్లు, మార్కెట్లు, ఆలయాలు, పార్క్ లు, బస్లాండ్లు,రైల్వే స్టేషన్లు తదితర ప్రాంతాలలో అడుక్కునే వారు ఎక్కడ పడితే అక్కడ కనబడుతున్నారు. అనాథ మహిళలు, పేద కుటుంబాల పిల్లలే పెట్టుబడిగా యాచక మాఫియా నగరంలో పెట్రేగిపోతోంది. వీరి ఆర్ధిక ,సాంఘీక పరిస్థితులను ఆసరాగా తీసుకుని అందినకాడికి దండుకుంటున్నారు. అడుక్కోవడం చీప్ , కానీ ఈ చీప్ ట్రిక్ టర్నోవర్ కోట్లలో ఉంటుందనేది నమ్మలేని నిజం. అందుకే అడక్కోవడమనేది ఇప్పుడో ప్రొఫెషన్. పొట్ట కూటి కోసమని యాచిస్తున్నామని చెబుతున్నప్పటికీ సాఫ్ట్ వేర్ ఉద్యోగుల విలాసాలతో పోటీపడగల సత్తా వీరి సొంతం. అడుక్కోవడానికే నటిస్తారు. నిజ జీవితంలో సామాన్యుల కన్నా మిన్నగా జీవిస్తారు. బెగ్గింగ్ కి యాక్టింగ్ తో వాళ్లిచ్చే కోటింగ్ సంపాదనలో వాళ్లను కింగ్స్ ని చేస్తున్నది.

కోట్లలో టర్నోవర్​

నగరంలో కుప్పలు తెప్పలుగా జనాల మీద పడి ఇచ్చేంత వరకు వదలని బెగ్గర్స్ వెనుక ఇంత తతంగం నడుస్తోందా అని అందరికీ అనిపించడంలో అతియోశక్తి లేదు. హైదరాబాద్ లో బెగ్గర్స్ గురించి గతంలో నాటి మేయర్ బొంతు రామ్మోహన్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు అప్పట్లో హాట్ టాపిక్ గా మారాయి . బెగ్గింగ్‌ మాఫియా ద్వారా ఏడాదికి దేశవ్యాప్తంగా రూ.260 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయని చెప్పడం యాచక వ్యవస్థ సమాజంలో ఏ మేరకు వేళ్లూనుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. కొంతమంది సంఘ విద్రోహశక్తులు వారితో భిక్షాటన చేయిస్తూ రూ.కోట్లకు పడగలెత్తుతున్నారనేది నమ్మలేని నిజం.

అద్దెకు ఇతర రాష్ట్రాల పిల్లలు...

కొంతమంది దళారులు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఒడిశా, బిహార్, పశ్చిమబెంగాల్, జార్ఖండ్, అసోం రాష్ట్రాల గ్రామీణ ప్రాంతాల నిరుపేద కుటుంబాలనుండి పిల్లలను అద్దె ప్రాతిపదికన, కొనుగోలు చేసి నగరానికి తరలిస్తున్నారు . తల్లిదండ్రులకు నగరంలో ఉపాధి కల్పిస్తామని, చంటి పిల్లలకు అద్దె ఇస్తామని తీసుకువస్తున్నారు. వీరితో ట్రాఫిక్‌ రద్దీగా ఉండే, జనసందడి కలిగిన ప్రాంతాలు, జాతర, ఉత్సవాలు, పర్యాటక ప్రాంతాలు, ఆలయాలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, మెట్రో స్టేషన్లలో ఈ పిల్లలతో భిక్షాటన చేయిస్తున్నారు. 2021 సంవత్సరం జూన్ నెలలో గ్రేటర్ వ్యాప్తంగా ఆపరేషన్ ముస్కాన్​లో భాగంగా అధికారులు చేసిన దాడుల్లో అనేక వాస్తవాలు వెలుగు చూశాయి. అప్పట్లో అధికారులు చేసిన దాడుల్లో మాటలు కూడా రాని సుమారు 90 మంది పసిపిల్లలను పట్టుకుని స్టేట్ హోం కు తరలించారు. దీంతో అనేకమంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఉన్నారంటూ రావడంతో సుమారు రూ.20 లక్షలు ఖర్చు చేసి వారికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి కొంతమందిని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. మిగిలిన వారు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారని తేలడంతో వారిని అక్కడికి పంపించి తల్లిదండ్రుల చెంతకు చేర్చారు.

అప్పుగా ఇచ్చి..

పసి పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు కొంత సొమ్ము అప్పుగా ఇచ్చి వాటిని తీర్చేందుకు భిక్షాటన చేయిస్తున్నారు. రోజూ ఇంత వసూలు చేయాలంటూ టార్గెట్లు పెడుతూ వచ్చిన దాంట్లో ఎంతోకొంత చేతిలో పెట్టి మిగిలిన మొత్తాన్ని దోచేస్తున్నారు. టార్గెట్‌ మేరకు డబ్బులు తేకపోతే హింసించడం వంటివి చేస్తున్నారు. విశ్వ నగరంగా చెప్పుకునే హైదరాబాద్‌లో సుమారు 14 వేల మంది యాచకులున్నారని, అందులో 90 శాతం వరకు ఇలాంటి నకిలీ బెగ్గర్లేనని గతంలో 'ఫెడరేషన్‌ ఆఫ్‌ ఎన్జీవోస్‌ ఫర్‌ బెగ్గర్‌ఫ్రీ సొసైటీ'సర్వే లో వెల్లడించింది. సొసైటీకి చెందిన సుమారు 300 మంది ప్రతినిధులు చేసిన సర్వేలో అనేక విషయాలను గుర్తించారు. ఏ దిక్కూ లేక కుటుంబాన్ని పోషించుకునేందుకో అడుక్కునేవారు ఐదు వందల లోపే ఉంటారని గుర్తించింది. యాచకులుగా పని చేస్తున్నవారిని బెగ్గింగ్‌ మాఫియా అసాంఘిక కార్యకలాపాలకూ వినియోగిస్తున్నదని, సుపారీ దాడుల దగ్గరి నుంచి గంజాయి, డ్రగ్స్‌ విక్రయించడం దాకా చాలా పనులకు వినియోగిస్తున్నదని సర్వేలో తేలింది.

రెండు శాతం మందే అసలు..

భాగ్యనగరంలో బెగ్గర్స్ సంపాదన నెలకు 2 కోట్ల చొప్పున ఏడాదికి రూ 24 కోట్లు ఉంటుందని బల్దియా గతంలో గుర్తించింది. ఇందులో అసలైన బెగ్గర్స్ కేవలం రెండు శాతం మంది మాత్రమే కాగా సంపాదన కోసమే యాచక వృత్తిని ఎంచుకున్నవారు 98 శాతం మంది. ఒక్క హైదరాబాద్ పరిధిలోని బెగ్గింగ్ కి ఇంత టర్నోవర్ ఉంటే, ఇక ఇండియా మొత్తం కలిపితే మల్టీ నేషనల్ కంపెనీలకు సైతం బెగ్గింగ్ వ్యాపారం పోటీ ఇచ్చే పరిస్థితి ఉంది.

టోల్ ఫ్రీ నెంబర్ 1098

నగరంలో యాచకులను గుర్తిస్తే 1098 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఇలా ఫోన్ చేస్తే వారున్న దగ్గరికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకుని హోంకు తరలిస్తారు. చాలా సందర్భాలలో అధికారులు వచ్చేసరికి బెగ్గర్స్ ఒకచోటు నుంచి మరోచోటుకు పోతున్నారని, దీంతో వారిని పట్టుకోవడంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ప్రతి ఏటా జనవరిలో ఆపరేషన్ స్మైల్ , జూన్​లో ఆపరేషన్ ముస్కాన్ పేరిట హైదరాబాద్ నగరంలో అధికారులు దాడులు చేసి యాచకులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు . కొన్ని రోజులు కౌన్సెలింగ్​ ఇచ్చి వారిని బయటకు పంపడంతో.. షరా మామూలే అన్నట్లుగా తిరిగి రోడ్లపై తమ దందాను కొనసాగిస్తున్నారు. పిల్లలను, మహిళలను భిక్షాటన దందాలో వినియోగిస్తున్నట్లు తెలిస్తే బెగ్గింగ్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని అక్షయ తులసి ఫౌండేషన్ ప్రతినిధి డాక్టర్ తులసి అన్నారు.

గంజాయి మత్తులో..

నగరంలోని సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి తదితర రైల్వే స్టేషన్ల సమీపంలో యాచించే వారు నిరంతరం గంజాయి, వైట్​నర్ మత్తులో జోగుతూ చిన్న చిన్న విషయాలకే దాడులకు పాల్పడుతుంటారు. ఇలా గతంలో నగరంలోని చాలా ప్రాంతాల్లో యాచకుల మద్య చోటు చేసుకున్న గొడవలు హత్యలకు దారి తీశాయి . వారి మధ్య చోటు చేసుకున్న ఘర్షణలను వారించే ప్రయత్నం చేసిన వారిపై కూడా దాడులు చేయడానికి వెనుకాడరు. సికింద్రాబాద్ లోని ప్యారడైజ్​, ప్యాట్నీ, రాణిగంజ్, సంగీత్, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో యచకులు ఎక్కువగా కనిపిస్తున్నారు.

డూప్లి 'కేటుగాండ్లు'..

గ్రేటర్ వ్యాప్తంగా ట్రాన్స్ జెండర్ల మాఫియా రాజ్యమేలుతున్నది. నగర రోడ్లు, చౌరస్తాలు, పార్క్ లు, సినిమా హాళ్లు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు ఇలా ఒక్క చోట అనేది లేకుండా నగరవ్యాప్తంగా వీరు ప్రజలను పీడిస్తున్నారు. ముఖ్యంగా శుభ కార్యాలు జరిగే చోటుకు వెళ్లి వారు అడిగినంత ఇవ్వనిదే అక్కడి నుండి కదలరు. అలాగని వీరికి వందల్లో ఇస్తే ఊర్కోరు.. వేలల్లో సమర్పించాల్సిందే. సమీపంలోనే ట్రాఫిక్ పోలీసులు ఉన్నా పట్టించుకోకపోవడంతో వీరి ఆగడాలకు అంతేలేకుండా పోతున్నది. అయితే కొంతమంది పురుషులు ట్రాన్స్ జెండర్ల ముసుగులో అరాచకాలు, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. నగరంలోని పార్కులు, నిర్మానుష్య ప్రాంతాల్లో ట్రాన్స్ జెండర్లు కొంత మంది వ్యభిచార వృత్తిని కొనసాగిస్తున్నారు. వీరు ఎంచుకున్న ప్రాంతాల్లో నిలబడి విటులను ఆకర్షిస్తుంటారు. వీరికి పాతబస్తీ, సికింద్రాబాద్, పబ్లిక్ గార్డెన్స్ తదితర ప్రాంతాల్లో కార్యాలయాలు సైతం ఉన్నాయి. నగరవ్యాప్తంగా బస్టాపులలో నిలబడి సైగలు చేస్తుంటారు.

వివరాలు చెప్పేందుకు ముందుకు రాని యాచకులు..

నగరంలోని చాలా ప్రాంతాల్లో బెగ్గింగ్ మాఫియా గురించి వివరాలు సేకరించేందుకు హైదరాబాద్ 'దిశ' టీం ప్రయత్నం చేసింది. చాలా చోట్ల వివరాలు చెప్పేందుకు ముందుకు రాలేదు. ఎంజే మార్కెట్​లో చిన్న పిల్లలను ఎత్తుకుని యాచిస్తున్న వారి నుంచి వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తే.. వారు చెప్పేందుకు ముందుకు రాగా పోగా అక్కడి నుంచి పారిపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకుని నగరంలో వేళ్లూనుతున్న బెగ్గింగ్ మాఫియాకు చెక్ పెట్టాలనే అభిప్రాయాలు గ్రేటర్ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.


Next Story

Most Viewed