రాష్ట్ర వ్యాప్తంగా అంబరాన్నంటిన బతుకమ్మ సంబురాలు

by Disha Web |
రాష్ట్ర వ్యాప్తంగా అంబరాన్నంటిన బతుకమ్మ సంబురాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలతో ముడిపడి ఉన్న పండుగ బతుకమ్మ. రాష్ట్రంలో ఆదివారం బతుకమ్మ సంబురాలు ప్రారంభమయ్యాయి. భాద్రపద అమావాస్య రోజున ఎంగిలిపూల బతుకమ్మ పేరుతో మొదలయ్యే వేడుకలు.. దసరా మరుసటి రోజు వరకు అంగరంగ వైభవంగా జరుగుతాయి. సద్దుల పండుగ(అక్టోబర్ 3)తో ముగుస్తాయి. బతుకమ్మ వేడుకల్లో చిన్నారుల నుంచి మహిళలు.. యువతులు సందడి చేశారు. ఆటపాటలతో ఆడిపాడారు.

ప్రజా జీవనంలో భాగమైపోయిన బతుకమ్మ పండుగలో మహిళలు కొత్త బట్టలు.. కోలాటాలతో తొలి రోజు కనువిందు చేశారు. ఇక బతుకమ్మలో ప్రధాన ఆకర్షణగా నిలిచేవి తీరొక్క పూలు. బంతి, చామంతి, గునుగు, తంగేడు, గులాబీ.. ఒక్కటేంటి… ప్రకృతిలో లభించే పూలతో అందంగా అలంకరించి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. ఒక్కేసి పువ్వేసి చందమామ.. విరబూసిన చెట్టమ్మ.. ఉయ్యాల పాటలు పాడారు.

ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలను అధికారికంగా నిర్వహిస్తుంది. పట్టణాల్లో, మున్సిపాలిటీ, నగరాల్లోని ప్రధాన కూడళ్లలో బతుకమ్మ లోగోలను ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్లలో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ లోని జలవిహార్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సంబురాల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ పాల్గొన్నారు. అదే విధంగా మహబూబాబాద్ లో ఎంపీ మాలోత్ కవిత, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మంచిర్యాలలో ఎమ్మెల్యే దివాకర్, నిజామాబాద్ లో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి, పెద్దపల్లి జిల్లాలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఖమ్మంలో పువ్వాడ అజయ్ కుమార్, అన్ని జిల్లాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed