తెలంగాణను మోసం చేసే బడ్జెట్ ఇది : బండి సంజయ్

by Dishanational2 |
తెలంగాణను మోసం చేసే బడ్జెట్ ఇది : బండి సంజయ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్ అంతా డొల్ల అని కేవలం ఎలక్షన్ స్టంట్ ను తలపిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు చేశారు. శుష్క వాగ్ధానాలు-శూన్య హస్తాలు అన్నట్లుగా బడ్జెట్ ఉందన్నారు. కేంద్రాన్ని తిట్టడం, కేసీఆర్ ప్రభుత్వాన్ని పొగడటం తప్ప హరీశ్ రావు చెప్పిందేమీ లేదని సోమవారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ సహా అన్ని వర్గాలను పూర్తిగా వంచించేలా ఈ బడ్జెట్ ను రూపొందించారని ఆయన ధ్వజమెత్తారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో, వివిధ సందర్భాల్లో కేసీఆర్ ఇచ్చిన హామీలను ఈ ఏడాదైనా నెరవేరుస్తారేమో అనుకుంటే అది జరిగేలా లేదని మండిపడ్డారు.

బడ్జెట్ లో కేటాయించిన నిధులకు, ఆచరణలో ఖర్చు చేస్తున్న నిధులకు పొంతనే లేదని బండి విరుచుకుపడ్డారు. ప్రతిపాదిత బడ్జెట్ లో 50 శాతం నిధులను కూడా ఖర్చు చేయని కేసీఆర్ ప్రభుత్వ తీరును చూస్తుంటే.. మాటలు కోటలు దాటుతున్నాయని, చేతలు గడప కూడా దాటడం లేదని విమర్శలు చేశారు. రైతులకు రూ.లక్ష లోపు రుణమాఫీ చేయాలంటే రూ.19,700 కోట్లు నిధులు కావాలని, కానీ రూ.6,285 కోట్లు మాత్రమే కేటాయిస్తే ఎలా అని ఆయన ప్రశ్నించారు. దళిత బంధుకు రూ. 17,700 కోట్లు మాత్రమే కేటాయించారని, గతేడాదితో పోలిస్తే ఒక్క రూపాయి కూడా అదనంగా కేటాయించకపోవడంపై ధ్వజమెత్తారు. గతేడాది నిధులు కేటాయించినా దళితబంధుకు ఖర్చు చేసిందేమీ లేదన్నారు. ఈ లెక్క ప్రకారం రాష్ట్రంలోని దళితులందరికీ ఈ పథకాన్ని వర్తింపజేయాలంటే మరో శతాబ్దం కూడా సరిపోదని ఎద్దేవాచేశారు. గిరిజన బంధుకు నిధులు కేటాయించకుండా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

తెలంగాణలోని ప్రతి పేద, మధ్య తరగతి కుటుంబం తమ సంపాదనలో 50 శాతానికిపైగా విద్య, వైద్యానికి ఖర్చు చేస్తున్నారని బండి తెలిపారు. వారిపై మరింత భారం మోపేలా బడ్జెట్ కేటాయింపులు ఉండటం దారుణమని ఆవేదన వ్యక్తంచేశారు. సాగునీటి పారుదల శాఖకు కేటాయించిన నిధులు అప్పులు, వడ్డీలు, సిబ్బంది జీతాలకే సరిపోయేలా ఉందన్నారు. విద్యుత్ శాఖకు కేటాయించింది రూ.12 వేలకోట్లు మాత్రమేనని, ఇవి కనీసం ప్రభుత్వ శాఖల కరెంట్ బిల్లులు కట్టేందుకు కూడా సరిపోవని బండి విమర్శలు చేశారు. కరెంట్ బకాయిలే రూ.20 వేల కోట్లకు పైగా పెండింగ్ లో ఉన్నాయన్నారు. మొత్తంగా డిస్కంలు రూ.60 వేల కోట్ల నష్టాల్లో ఉన్నట్లుగా పేర్కరొన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లకు కేటాయించిన రూ.12 వేల కోట్లు ఏమూలకు సరిపోవని సంజయ్ ధ్వజమెత్తారు. అది కూడా పీఎం ఆవాస్ యోజన కింద ఒక్కో ఇంటి నిర్మాణానికి చెల్లిస్తున్న రూ.2.63 లక్షల సొమ్మును తన ఖాతాలో వేసుకోవడానికి బడ్జెట్ లో నిధులను చూపినట్లు అర్థమవుతోందని ఆరోపించారు. తెలంగాణలో ఇకపై కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ అనే పదమే ఉండదని, అందరినీ పర్మినెంట్ చేస్తానని హామీ ఇచ్చి 9 ఏండ్లుగా రెగ్యులరైజ్ చేయకపోగా.. ఉన్న ఉద్యోగాలను తొలగించిన ఘనత కేసీఆర్ కే దక్కిందని చురకలంటించారు. కాగా ఈ బడ్జెట్ లో మళ్లీ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేస్తామనడం పెద్ద జోక్ అంటూ ఎద్దేవాచేశారు. 9 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో దాదాపు 50 వేల జీవోలను బయటపెట్టకుండా దాచేసిన దొంగ కేసీఆర్ అని, సెక్రటేరియేట్ ను కూల్చేసి పాలనా వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన దుర్మార్గుడు, దేశంలోనే నంబర్ వన్ అవినీతి పరుడు కేసీఆర్ అని బండి విమర్శలు చేశారు. బడ్జెట్ పేరుతో చేస్తున్న అంకెల గారడీని చూసి జనం నవ్వుకుంటున్నారని మండిపడ్డారు. రూ.2,90,396 కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఆదాయం మాత్రం రూ.1.31 లక్షల కోట్లుగానే చూపించిందిన, మిగిలిన రూ.1.60 లక్షల కోట్లు ఎక్కడి నుంచి సమకూరుస్తారో చెప్పకపోవడం సిగ్గుచేటని బండి విమర్శలు చేశారు.


Next Story

Most Viewed