ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షలో 20 ప్రశ్నలు తప్పు: బండి సంజయ్

by Disha Web Desk 2 |
ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షలో 20 ప్రశ్నలు తప్పు: బండి సంజయ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని, ముఖ్యమంత్రి కేసీఆర్ వారిపై మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. డీజేపీ కార్యాలయ ముట్టడిలో భాగంగా గాయపడిన బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాశ్ లక్డీకాపూల్ గ్లోబల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. కాగా సోమవారం బండి సంజయ్ ఆయన్ను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యలపై తాము ఎప్పటినుంచో ఉద్యమాలు చేస్తున్నామని అన్నారు. ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యలను పరిష్కరించాలని డీజీపీ ఆఫీస్‌కు బీజేవైఎం నేతలు వెళ్తే కార్యకర్తలపై విచక్షణా రహితంగా పోలీసులు దాడి చేశారని బండి ఆరోపించారు.

బయటకు కనిపించకుండా గాయపరిచారని వెల్లడించారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల దాడులు చాలా ఎక్కువయ్యాయని ధ్వజమెత్తారు. దేశంలో ఆర్మీ రిక్రూట్ మెంట్ కంటే ఎక్కువ కండీషన్స్ ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపికలో ఉన్నాయని బండి అన్నారు. ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షలో 20 ప్రశ్నలు తప్పుగా వచ్చాయని వ్యాఖ్యానించారు. కేసీఆర్ చేసిన తప్పునకు 2 లక్షల మంది అభ్యర్థులు రోడ్డునపడ్డారని విమర్శలు చేశారు. సమస్యలు చెప్పుకుందామంటే ముఖ్యమంత్రి ఎవరికీ అపాయింట్ మెంట్ ఇవ్వడని, మంత్రులందరూ రబ్బరు స్టాంపులుగా మారారన్నారు. సీఎం నిజాం రాజులా ప్రవర్తిస్తున్నారని విమర్శలు చేశారు. ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల విషయంలో ముఖ్యమంత్రి స్పందించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ గురించి కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటివరకు డీపీఆర్ ఇవ్వలేదని, ఎక్కడ ఏర్పాటుచేయాలో కూడా చెప్పలేదని ధ్వజమెత్తారు.

కేసీఆర్‌కు దమ్ముంటే రాష్ట్ర అభివృద్ధిపై చర్చకు రావాలని బండి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో లక్ష 90 వేలు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని ఎందుకు భర్తీ చేయట్లేదో సమాధానం చెప్పాలని బండి సంజయ్ ప్రశ్నించారు. నిజామాబాద్ కలెక్టరేట్‌లో సర్పంచ్ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని, సర్పంచుల నిధులన్నీ కేసీఆర్ దోచుకున్నాడని బండి ఆరోపణలు చేశారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై లేనిపోని విమర్శలు చేస్తున్నారని సంజయ్ ఫైరయ్యారు. బీఆర్ఎస్ నేతల్లాగా తమ ఎంపీ అర్వింద్ లిక్కర్ దందాలకు పాల్పడలేదని, పత్తాలాట ఆడలేదని ఘాటు విమర్శలు చేశారు. బడ్జెట్ అనుమతికి ఇంకా సమయం ఉందని, అనుమతి ఇవ్వడంలేదని కావాలనే గవర్నర్‌పై లేనిపోని ఆరోపణలు బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారని ఆయన ఫైరయ్యారు. గవర్నర్ విషయంలో హైకోర్టు చెంప చెళ్లుమన్పించినా కేసీఆర్‌కు సిగ్గు రాలేదని బండి సంజమ విమర్శలు చేశారు.


Next Story

Most Viewed