నాందేడ్‌లో కేసీఆర్ బహిరంగ సభ ఫ్లాప్: బండి సంజయ్

by Disha Web Desk 2 |
నాందేడ్‌లో కేసీఆర్ బహిరంగ సభ ఫ్లాప్: బండి సంజయ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: మహారాష్ట్ర నాందేడ్‌లో బీఆర్ఎస్ నిర్వహించిన జాతీయ అట్టర్ ఫ్లాప్ అయిందని, అక్కడి జనం కేసీఆర్‌ను అసలు పట్టించుకోనేలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. 30 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులు, ఇద్దరు ఎంపీలు 25 రోజులుగా నాందేడ్‌లోనే మకాం వేసినా సభ తుస్సుమందని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ సరిహద్దు జిల్లాల నుంచి ఒక్కొక్కరికి రూ.500లు ఇచ్చి జనాన్ని పట్టుకెళ్లారని ఆరోపణలు చేశారు. పెద్ద పెద్ద నాయకులు ఎవరెవరో చేరతారని తొలుత ప్రచారం చేశారని, చివరకు చూస్తే చేరినవారంతా ఔట్ డేటెడ్ నేతలన్నారు. వారికి సొంత ఊరిలోనే 10 ఓట్లు కూడా పడవన్నారు. తెలంగాణ నుంచి వేల సంఖ్యలో బీఆర్ఎస్ కండువాలు తీసుకెళ్తే ఆ కండువాలు పట్టుకుని కేసీఆర్ నిలబడ్డా.. ఎవరూ రాక విసుక్కున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని బండి సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఏడాదిలోపే మహిళలకు చట్ట సభల్లో 33 శాతం ప్రాతినిధ్యం పెంచుతారని వ్యాఖ్యానించారని, ప్రతి అసెంబ్లీ, కౌన్సిల్, పార్లమెంట్‌లో 1/3 శాతం సీట్లు కేటాయిస్తానన్నారని హామీలిచ్చారని, మరి తెలంగాణలో ఎందుకు అమలు చేయలేదో కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. మహారాష్ట్రలోని రైతుల ఆత్మహత్యల గురించి కేసీఆర్ ప్రస్తావించడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని చురకలంటించారు. రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలోనే 4వ స్థానంలో ఉందని, గజ్వేల్‌లోనే రైతు ఆత్మహత్యలు కొనసాగుతున్నాయన్నారు.

రైతు బంధు మినహా అన్ని సబ్సిడీలు బంద్ చేసిన మూర్ఖుడు కేసీఆర్ అని బండి సంజయ్ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశమంతటా 24 గంటల కరెంట్ ఇస్తాననడం పెద్ద జోక్ అని బండి అన్నారు. తెలంగాణలో సింగిల్ ఫేజ్ విద్యుత్ ఇస్తున్నట్లు ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు స్టేట్ మెంట్ ఇచ్చారని, కేసీఆర్ సభ నిర్వహించిన ప్రాంతానికి కూత వేటు దూరంలోనే ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని రైతులంతా కనీసం 8 గంటల కరెంట్ అయినా సరఫరా చేయాలని సబ్ స్టేషన్లను ముట్టడించడమే కాకుండా రోడ్లపై ధర్నాలు చేస్తున్నది ప్రజలు చూస్తున్నారన్నారు. ఏసీడీ చార్జీలు పెంచినందుకు విద్యుత్ సిబ్బందిని బంధించిన సంగతి కేసీఆర్ తెలుసుకుని మాట్లాడితే బాగుండేదని ధ్వజమెత్తారు. అబద్ధాలుకు ఆస్కార్ అవార్డ్ ఇవ్వాల్సి వస్తే నాందేడ్ సభలో చెప్పిన అబద్ధాలకు ఆస్కార్ అవార్డ్ కచ్చితంగా దక్కేదన్నారు. నాందెడ్ పక్కనున్న ఆదిలాబాద్ జిల్లాలో మిషన్ భగీరథ అమలవ్వక బావులు, బోర్ల వద్దకు పోయి మంచి నీళ్లు తెచ్చుకుంటున్నారన్నారు. అలాంటిది బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశమంతా మంచి నీళ్లు ఇస్తానడం హాస్యాస్పదమని మండిపడ్డారు. మహారాష్ట్రలో పేదలకు అవాస్ యోజన కింద 15 లక్షల 32 వేల 36 ఇండ్లు కట్టించామని, తెలంగాణలో ఎన్ని ఇండ్లు కట్టించారో సీఎం సమాధానం చెప్పాలని బండి ప్రశ్నించారు.

తెలంగాణ నాలుగు విషయాల్లో నంబర్ వన్‌గా నిలిచిందని, లిక్కర్ ఆదాయంలో మహారాష్ట్రను మించిపోయిందని బండి చురకలంటించారు. 12 కోట్ల జనాభా ఉన్న మహారాష్ట్రలో మద్యం ద్వారా వచ్చే ఆదాయం కేవలం రూ.17 వేల కోట్లని, అదే 4 కోట్లున్న తెలంగాణలో రూ.40 వేల కోట్లు దాటిందన్నారు. నిత్యావసర వస్తువుల రేట్లు విపరీతంగా పెరిగాయని మండిపడ్డారు. దేశంలోనే అత్యధిక ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రం తెలంగాణ అని, దేశంలోనే అత్యధిక ధరకు పెట్రోల్, డీజిల్ అమ్ముతున్న రాష్ట్రంగా తెలంగాణ నంబర్ వన్ స్థానాల్లో నిలిచిందన్నారు. అమెరికా, రష్యా, చైనా పాట పాడుతున్న కేసీఆర్‌కు భారత ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడే అర్హత లేదని ధ్వజమెత్తారు. శివాజీ జన్మ స్థలం నుంచి బీఆర్ఎస్ యాత్రలు స్టార్ట్ చేస్తారనడం సిగ్గుచేటని బండి సంజయ్ విమర్శలు చేశారు. శివాజీ హిందూ సామ్రాజ్యం స్థాపిస్తే.. కేసీఆర్ రాష్ట్రాన్ని రజాకార్ల సమితికి తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు.

నిజాం సమాధి ముందు కేసీఆర్ మోకరిల్లారన్నారు. నిజాం మనవడు చనిపోతే ప్రజల సొమ్ముతో అంత్ర్యక్రియలు జరిపించారని ధ్వజమెత్తారు. లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ కేసీఆర్‌లా అవినీతిపరుడు కాదని, అందుకే ఆయన పిలుపుతో దేశమంతా కదిలిందని, కానీ కేసీఆర్ కూడా బీఆర్ఎస్‌తో దేశమంతా కదిలిందని చెప్పడం హాస్యాస్పదని ఎద్దేవాచేశారు. బీఆర్ఎస్ ఒక అవినీతి మిషన్ అని, ఫ్యామిలీ మిషన్, కమీషన్ల మిషన్ అని సెటైర్లు వేశారు. కేసీఆర్ కుటుంబమంతా అబద్దాలు, దగాకోరులేనని విమర్శులు చేశారు. ఇది తెలంగాణ ప్రజలకు అర్థమై తిరగబడుతున్నారన్నారు. అందుకే తట్టాబుట్టా సర్దుకుని కొత్త దుకాణం పేరుతో కేసీఆర్ దేశమంతా తిరుగుతున్నాడని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనే బీఆర్ఎస్ ను సమాధి చేయడం ఖాయమని బండి సంజయ్ హెచ్చరించారు.



Next Story

Most Viewed