సబ్ రిజిస్ట్రార్లకే తప్పొప్పుల బాధ్యతలు అప్పగింత.. ఉత్తర్వులు జారీ

by Disha Web Desk 1 |
సబ్ రిజిస్ట్రార్లకే తప్పొప్పుల బాధ్యతలు అప్పగింత.. ఉత్తర్వులు జారీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ధరణి పోర్టల్ రాక ముందు క్రయవిక్రయాల్లో చోటుచేసుకున్న తప్పొప్పుల సవరణకు చాలామంది ఇబ్బందులు పడ్డారు. పేరు, విస్తీర్ణం, సరిహద్దులు తప్పుగా పడినా మ్యుటేషన్‌కు సమస్య తలెత్తింది. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల బాధ్యతను తహసీల్దార్లకు అప్పగించారు. దీంతో సేల్‌డీడ్స్ పొరపాట్లను సరిదిద్దేందుకు ఎవరికీ అధికారం ఇప్పలేదు. తాజాగా, ఈ బాధ్యతలను సబ్ రిజిస్ట్రార్లకు కట్టబెట్టారు. టైటిల్ డీడ్స్ డిపాజిట్స్‌కు ముందు జరిగిన వాటి సవరణ బాధ్యతలను తిరిగి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకే అప్పగించారు.

ఈ మేరకు నిర్ణయాన్ని తీసుకున్నారు. మెమో నెం.G3/12055/2023 ద్వారా సబ్ రిజిస్ట్రార్లకు వివరించారు. దీని ఆధారంగా రిజిస్ట్రేషన్లలో ర్యాటిఫికేషన్, రెక్టిఫికేషన్, క్యాన్సిలేషన్ వంటివి చేసేందుకు అనుమతి ఇచ్చారు. గతంలో కార్డు ద్వారా చేసిన వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లలో తలెత్తిన వాటిని సరిదిద్దేందుకు అవకాశం కల్పించారు. సరిదిద్దిన డాక్యుమెంట్ల ఆధారంగా తిరిగి ధరణి పోర్టల్‌లో పెండింగ్ మ్యుటేషన్‌కి అప్లై చేసుకునే వెసులుబాటు లభించింది.

టెక్నికల్ వర్క్ పూర్తి..

వ్యవసాయ భూములకు సంబంధించి కార్డ్ సిస్టం ద్వారా ర్యాటిఫికేషన్, రెక్టిఫికేషన్, క్యాన్సిలేషన్ డీడ్స్ చేసేందుకు టెక్నికల్ వర్క్ పూర్తయ్యింది. అదేవిధంగా వ్యవసాయ భూముల డేటా కూడా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ దగ్గరే ఉంది. పాత రిజిస్ట్రేషన్ల డేటాను కూడా రెవెన్యూ శాఖ అందించింది. ఇప్పటి నుంచి ధరణికి ముందు వ్యవసాయ భూముల క్రయవిక్రయాల్లో చోటు చేసుకున్న తప్పొప్పుల సవరణకు సబ్ రిజిస్ట్రార్ దగ్గర స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఈ మేరకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు.







Next Story

Most Viewed