తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం..

by Disha Web Desk 13 |
తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం..
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. బుధవారం నుంచి ఫస్టియర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఫస్టియర్, సెకండియర్ కలిపి మొత్తం 9,47,699 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. కాగా ఇందులో ఫస్టియర్ విద్యార్థులు 4,82,677 మంది ఉన్నారు. సెకండియర్ లో 4,65,022 మంది స్టూడెంట్స్ ఉన్నారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడంపై ఇంటర్ బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు స్పష్టంచేశారు. విద్యార్థుల సంఖ్యకనుగుణంగా మొత్తం ౧,473 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో 614 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉండగా, 859 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి.

పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఎగ్జామ్ సెంటర్ కో చీఫ్ సూపరింటెండెంట్ చొప్పున ౧,473 మందిని అధికారులు నియమించారు. డిపార్ట్ మెంటల్ ఆఫీసర్లను సైతం 1473 మందికి బాధ్యతలు అప్పగించారు. మొత్తం 26,333 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వర్తించనున్నారు. మాస్ కాపీయింగ్ కు అవకాశం ఇవ్వకుండా ఉండేలా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు ఎగ్జామ్ సెంటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు. 75 మంది ఫ్లయింగ్ స్క్వాడ్లను, 200 మంది సిట్టింగ్ స్క్వాడ్లను నియమించారు.

మొత్తం 9,47,699 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. కాగా ఫస్టియర్ జనరల్ విభాగంలో మొత్తం 4,33,082 మంది ఉన్నారు. ఇందులో 2,15,633 మంది అబ్బాయిలు ఉంటే,2,17,449 మంది అమ్మాయిలున్నారు. ఫస్టియర్ వొకేషన్ విభాగంలో మొత్తం 49,595 మంది ఉంటే అందులో 25,374 మంది అబ్బాయిలు, 24,221 మంది అమ్మాయిలున్నారు. సెకండియర్ లో జనరల్ విభాగంలో 4,19,036 మంది ఉంటే అందులో అబ్బాయిల సంఖ్య 2,10,750 మంది, అమ్మాయిల సంఖ్య 2,08,286 గా ఉంది. వొకేషనల్ విభాగంలో మొత్తం 45,986 మంది ఉన్నారు. ఇందులో 24,513 మంది అబ్బాయిలు, 21,473 మంది అమ్మాయిలున్నారు.

పరీక్షల నిర్వహణలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు డిస్ట్రిక్ట్ లెవల్ హై పవర్ కమిటీని ఏర్పాటు చేశారు. కలెక్టర్ చైర్మన్ గా ఉంటారు. ఎస్పీ, ఆర్ జేడీఐఈ, డీఐఈవో, నోడల్ ఆఫీసర్, ఒక సీనియర్ ప్రిన్సిపాల్, ఒక సీనియర్ లెక్చరర్ సభ్యులుగా ఉంటారు. అంతేకాకుండా జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీని ఏర్పాటు చేశారు. డీఏఈవో లేదా నోడల్ ఆఫీసర్ దీనికి కన్వీనర్ గా ఉంటారు. ఒకరు లేదా ఇద్దరు సీనియర్ ప్రిన్సిపాల్స్, ఒక సీనియర్ లెక్చరర్ సభ్యులుగా ఉంటారు.

పరీక్ష కేంద్రాల్లో విద్యుత్ సరఫరా నిత్యం జరిగేలా, విద్యార్థులను సమయానికి పరీక్ష కేంద్రానికి చేర్చేలా ఆర్టీసీ అధికారులతో, హెల్త్ పరమైన ఇబ్బందులు రాకుండా మెడికల్, హెల్త్ అధికారులతో, పేపర్లను కట్టుదిట్టమైన భద్రతతో పాటు, బందోబస్తు కోసం పోలీస్ అధికారులతో ఏర్పాట్లపై అధికారులు సమన్వయం చేసుకుని సక్సెస్ చేయాలని అధికారులకు బోర్డు సూచించింది. సమన్వయ బాధ్యతలు ఆయా కమిటీలకు అప్పగించింది. సమస్యలను పరిష్కరించేందుకు స్టేట్ కంట్రోల్ రూమ్ ను బోర్డు ఏర్పాటు చేసింది. 040 24600110, 040 24655027 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.

9 గంటల తర్వాత అనుమతించం : నవీన్ మిట్టల్

విద్యార్థులు పరీక్ష కేంద్రానికి ముందుగానే చేరుకోవాలని ఇంటర్ బోర్డు కమిషనర్ నవీన్ మిట్టల్ స్పష్టంచేశారు. 8 గంటల నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా tsbie.cgg.gov.in అనే వెబ్ సైట్ లో హాల్ టికెట్లను అందుబాటులో ఉంచినట్లు స్పష్టంచేశారు. ఓఎంఆర్ షీట్ లో పేరు, సబ్జెక్ట్ కరెక్ట్ గా ఉన్నాయో లేవో సరిచూసుకోవాలని సూచించారు. బుక్ లెట్ లో పేపర్ల సంఖ్యను కూడా సరిచూసుకోవాలన్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రంలోకి ఫోన్లు, క్యాలిక్యులేటర్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తీసుకువెళ్లకూడదని సూచించారు. ప్రశాంతమైన వాతావరణంలో పరీక్ష జరిగేందుకు ప్రతీ ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.



Next Story

Most Viewed