టీఆర్ఎస్‌కు చెక్ పెట్టేలా బండి సంజయ్ మరో ప్లాన్!

by Disha Web |
టీఆర్ఎస్‌కు చెక్ పెట్టేలా బండి సంజయ్ మరో ప్లాన్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన పార్టీల మధ్య ఎన్నికల ఫీవర్ కొనసాగుతున్నది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. అధికార టీఆర్ఎస్‌ను ఈ సారి ఎలాగైనా గద్దె దింపి ముఖ్యమంత్రి పీఠంపై తాము కూర్చోవాలని భావిస్తున్న బీజేపీ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల ప్రజా సంగ్రామ యాత్ర నాలుగో విడతను బండి సంజయ్ సక్సెస్ ఫుల్‌గా ముంగించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఆయన పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన ప్రతిపాదన ఆసక్తిని రేపుతోంది. తాము అధికారంలోకి వస్తే ఇంబ్రహీంపట్నం పేరు మారుస్తామని సంజయ్ చేసిన కామెంట్స్ చర్చకు దారి తీశాయి.

ఆ జాబితాలోకి మరో పేరు:

దేశవ్యాప్తంగా ఆయా నగరాలు, ప్రాంతాలు, చారిత్రాత్మక కట్టడాల పేర్లను బీజేపీ మారుస్తూ వస్తున్నది. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న రాజ్ పథ్‌ను కర్తవ్యపథ్‌గా మార్చారు. వలస పాలన చిహ్నాలకు చరమగీతం పాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీజేపీ ప్రకటించింది. తాజాగా తెలంగాణలోని నగరాలు, పట్టణాల పేర్లపై బీజేపీ దృష్టి సారించడం హాట్ టాపిక్ అయింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల పేర్లపై బీజేపీ ఎప్పటి నుండో ప్రతిపాదనలు చేస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను భాగ్యనగరంగా మారుస్తామని చెబుతన్నది. ఇటీవల జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ అంశాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. అగ్రనేతలంతా హైదరాబాద్‌ను భాగ్యనగరంగానే సంబోధించడం చర్చకు దారి తీసింది. ఇక నిజామాబాద్, కరీంనగర్ పేర్లను సైతం మార్చుతామని బీజేపీ ఎప్పుటి నుండో చెబుతోంది. ఈ జాబితాలోకి తాజాగా ఇబ్రహీంపట్నం పేరు చేర్చింది. తాము అధికారంలోకి రాగానే ఇబ్రహీంపట్నం పేరును వీరపట్నంగా మారుస్తామని బండి సంజయ్ చెప్పడం వెనుక టీఆర్ఎస్‌‌ను ఇరుకున పెట్టే వ్యూహం ఉందనే చర్చ జరుగుతోంది. బీజేపీ వైఖరి చూస్తుంటే రాబోయే ఎన్నికల నాటికి నేమ్ పాలిటిక్స్‌పై అధికార పక్షాన్ని మరింత ఇరుకున పెట్టేలా ప్రణాళిక వేస్తోందా అనే అనుమాలను రాజకీయ పండితులు వ్యక్తం చేస్తున్నారు.

టీఆర్ఎస్‌ను దెబ్బ కొట్టేలా బీజేపీ సెంటిమెంట్:

పేర్లు మార్పు అంశంలో బీజేపీ మొదటి నుంచి సెంటిమెంట్ కోణంలోనే ఆలోచన చేస్తున్నదనే టాక్ ఉంది. ఇక టీఆర్ఎస్‌ను విషయంలోనూ ఇదే సూత్రం పాటించాలని రాజకీయ ఎత్తు వేసినట్లు చర్చ జరుగుతున్నది. బీజేపీ డిమాండ్ చేస్తున్న పేర్లన్నీ నిజాం కాలం నాటివని అవి ఓ సామాజిక వర్గానికి సూచిస్తున్నాయని వాదిస్తోంది. ఈ పేర్లను ఎత్తి చూపుతూ రజాకార్ల అరాచకాలను గుర్తు చేస్తున్నది బీజేపీ. రజాకార్లను తరిమికొట్టిన వీరపట్నం ప్రజల పోరాట పటిమను ఇబ్రహీంపట్నం విషయంలో గుర్తు చేయడం గమనార్హం. సెప్టెంబర్ 17 విషయంలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ మధ్య రాజుకున్న రాజకీయం అంతా ఇంత కాదు. పోటాపోటీగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్యక్రమాలను నిర్వహించాయి. ఓ వర్గాన్ని సంతోషపరచడానికే సీఎం కేసీఆర్ విమోచన దినోత్సవాన్ని విలీన వజ్రోత్సవాలుగా మార్చేశారనే విమర్శలు బీజేపీ చేసింది. ఈ క్రమంలో మరోసారి తెలంగాణలో బీజేపీ చేస్తున్న పేర్ల మార్పు ప్రతిపాదన హాట్ టాపిక్ అవుతున్నది.


Read latest Telugu news disha daily epaper

Next Story

Most Viewed