ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మరొకరు అరెస్ట్..

by Disha Web Desk 13 |
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మరొకరు అరెస్ట్..
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ అధికారులు ఐదో నిందితుడైన విజయ్ నాయర్‌ను అరెస్టు చేయగా, ఈడీ అధికారులు సమీర్ మహేంద్రు ను అరెస్టు చేశారు. వీరిద్దరినీ వేర్వేరు కోర్టుల్లో హాజరు పరిచిన రెండు దర్యాప్తు బృందాలు కస్టడీకి ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. విజయ్ నాయర్‌ను ఐదు రోజుల కస్టడీకి, సమీర్ మహేంద్రును తొమ్మిది రోజుల కస్టడీకి కోర్టులు అనుమతిచ్చాయి. విజయ్ నాయర్‌ను తిరిగి అక్టోబరు 3న కోర్టులో హాజరు పర్చాలని సీబీఐ కోర్టు జడ్జి నాగపాల్ స్పష్టం చేశారు. సమీర్ మహేంద్రు ను అక్టోబర్ 6వ తేదీ వరకు కస్టడీలో విచారించవచ్చని ఈడీ కోర్టు స్పష్టం చేసింది.

ఈ స్కామ్‌లో రెండు దర్యాప్తు సంస్థలు ఒక రోజు వ్యవధిలోనే అరెస్టు చేయడం గమనార్హం. కస్టడీకి సంబంధించి నిందితుల తరపు న్యాయవాదులకు, ప్రాసిక్యూషన్ న్యాయవాదులకు మధ్య తీవ్ర స్థాయిలో వాదనలు జరిగాయి.

ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి సీబీఐ అధికారులు ఓన్లీ మచ్ లౌడర్ కంపెనీకి గతంలో సీఈఓగా వ్యవహరించిన విజయ్ నాయర్‌ను మంగళవారం ఏడు గంటల పాటు ప్రశ్నించి అనంతరం అరెస్టు చేసింది. ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పనలో అవకతవకలు జరిగాయని, ఎక్సయిజ్ శాఖ అధికారులకు ముడుపులు ముట్టాయని, అందులో విజయ్ నాయర్ కీలక పాత్ర పోషించారని సీబీఐ పేర్కొన్నది. సీబీఐ కోర్టులో బుధవారం ఉదయం ప్రవేశపెట్టిన వెంటనే కస్టడీకి అనుమతించాల్సిందిగా విజ్ఞప్తి చేసింది.

ఇప్పటికే ఆరుసార్లు ప్రశ్నించినందున కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదని విజయ్ నాయర్ తరఫు న్యాయవాది వాదించారు. కుంభకోణంలో ఎవరెవరి ప్రమేయం ఉన్నదో వివరాలను రాబట్టడానికి మరింత లోతుగా ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నందున కస్టడీకి ఐదు రోజుల పాటు అనుమతి ఇవ్వాలని ప్రాసిక్యూషన్ కోరింది. దీంతో అక్టోబర్ 3వ తేదీ వరకు కోర్టు అనుమతి మంజూరు చేసింది.

మరోవైపు ఈడీ అధికారులు కూడా దూకుడుగా వ్యవహరించి బుధవారం ఉదయం ఇండో స్పిరిట్స్ అధినేత సమీర్ మహేంద్రు ను అరెస్టు చేశారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సన్నిహితంగా ఉండే విజయ్ నాయర్‌తో సమీర్‌కు సంబంధాలు ఉన్నాయని ఆరోపించిన ఈడీ 15 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాల్సిందిగా ఈడీ కోర్టును కోరారు. అన్ని రోజులు కస్టడీలోకి తీసుకుని ఏం చేస్తారంటూ జడ్జి ప్రశ్నించారు.

కేవలం ఢిల్లీ రాష్ట్రానికి మాత్రమే కాకుండా చాలా రాష్ట్రాల్లో ఈ కుంభకోణం మూలాలు ఉన్నాయని కోర్టుకు వివరించిన ఈడీ తరపు న్యాయవాదులు అక్కడకు కూడా తీసుకెళ్ళి విచారించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. చివరకు సంతృప్తి వ్యక్తం చేసిన కోర్టు అక్టోబర్ 6 వరకు కస్టడీకి అనుమతి ఇచ్చింది. తిరిగి అదే రోజున కోర్టులో హాజరు పర్చాల్సి ఉంటుంది. ఎంక్వయిరీ లో భాగంగా వీరిని హైదరాబాద్ తీసుకొస్తారా అనే చర్చ మొదలైంది.


Next Story