రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి.. డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం

by Disha Web Desk 13 |
రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి.. డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో సుమారు 6,200 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు క్యాపిటల్యాండ్ కంపెనీ ముందుకు వచ్చింది. పెట్టుబడి ప్రణాళికలను మంగళవారం ప్రకటించింది. డేటా సెంటర్ ఏర్పాటు చేయడంతో పాటు హైదరాబాద్ నగరంలో ఉన్న తన కార్యకలాపాలను మరింత విస్తరించనున్నట్లు తెలిపింది. మంత్రి కేటీఆర్ సమక్షంలో కంపెనీ ప్రతినిధులు డేటా సెంటర్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. 1,200 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్ మాదాపూర్‌లోని సిలింట్ ఇంటర్నేషనల్ టెక్ పార్క్ లో క్యాపిటల్యాండ్ ఇండియా ట్రస్ట్ ఈ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఐటీపీహెచ్ డేటా సెంటర్‌ను 5 ఏళ్లలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుంది.

ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న సుమారు 6 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ విస్తీర్ణాన్ని రెట్టింపు చేసేందుకు రానున్న 5 ఏళ్లలో మరో 5 వేల కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న డేటా సెంటర్ మార్కెట్‌లలో హైదరాబాద్ ఒకటన్నారు. మానవ భవిష్యత్తును మరింత మెరుగుపరచడంలో డేటానే కీలక పాత్ర పోషించబోతుందన్నారు. హైదరాబాద్ లో రోజురోజుకు డెవలప్ అవుతున్న ఐటీ పరిశ్రమ అవసరాలు ఈ డేటా సెంటర్ తో తీరుతాయన్నారు. ఇతర ఐటీ లేక ఐటీఈఎస్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల విషయంలోనూ క్యాపిటల్యాండ్ తో కలిసి తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సీఎల్ఐఎన్టీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సంజీవ్ దాస్‌గుప్తా, వాణిజ్య శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, అధికారులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed