పంజాబ్ రైతులను ఆదుకున్నారు.. మరి ఇక్కడ ఏమైంది?: ఏఐసీసీ

by Dishafeatures2 |
పంజాబ్ రైతులను ఆదుకున్నారు.. మరి ఇక్కడ ఏమైంది?: ఏఐసీసీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రజల సొమ్ము వందల కోట్లు పంజాబ్ రైతులకు ఇచ్చి ఆదుకుంటారు కానీ మరి ఇక్కడ రాష్ట్ర రైతులను ఆదుకోవడం విషయంలో ఏమైందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. శనివారం రాష్ట్ర రైతుల సమస్యలపై ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవడానికి కేసీఆర్‌కి మనుసు రావడం లేదన్నారు. సమస్యలపై ఎక్కడికక్కడ టీఆర్ఎస్ నేతలను నిలదీయాలన్నారు. వరి సేకరణ జాప్యం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖరీఫ్ సీజన్‌లో ఉత్పత్తులను సేకరించేందుకు ప్రభుత్వం వద్ద సరైన ప్రణాళిక లేదా తదుపరి పంట సీజన్‌ల కోసం ప్రణాళిక లేదన్నారు.

ప్రభుత్వం సన్నద్ధతలో లేనందున - సరిపడా గన్నీ సంచులు, టార్పాలిన్ కవర్లు అందించకపోవడం వంటి, అకాల వర్షాల కారణంగా రైతులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. యాసంగి సీజన్‌లో 92 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ఉత్పత్తి కాగా మే 25 నాటికి 31 లక్షల మెట్రిక్‌ టన్నుల వరిధాన్యం మాత్రమే కొనుగోలు చేశారని అన్నారు. రైతుల నుంచి సేకరించిన వరిలో పొట్టు 6-10 కిలోలకు మించి ఉంటుందని మిల్లర్లు చెప్పడంతో రైతులు మోసపోతున్నారని అన్నారు. ఈ రబీ సీజన్‌లో రాష్ట్రంలో 1.04 లక్షల ఎకరాల్లో కంది సాగు చేయగా 18 లక్షల క్వింటాళ్లు సాగు చేశారని అన్నారు.

అయితే దిగుబడిని కొనుగోలు చేసేందుకు ఇప్పటి వరకు ఏ కొనుగోలు కేంద్రం తెరవలేదన్నారు. వర్షానికి దిగుబడి తడిసిపోయి, తెగుళ్లు సోకే అవకాశం ఉందని రైతులు భయపడుతున్నారని అన్నారు. ఎంఎస్‌పీ జాబితాలోని అన్ని పంటలను ప్రభుత్వం సేకరించడం లేదన్నారు. ఎంఎస్‌పీ జాబితాలో లేని పంటల కోసం ప్రభుత్వం మార్కెట్ స్థిరీకరణ నిధి నుంచి నిధులను ఉపయోగించాలని, కానీ అది చేయడం లేదన్నారు. జూన్ 10వ తేదీ నాటికి వరి ధాన్యం కొనుగోళ్లు ప్రభుత్వం నిలిపివేస్తామని ప్రకటించిందని తెలిపారు.

రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నాయని, పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు, పెరుగుతున్న అప్పుల కారణంగా 2014 నుంచి సుమారు 8400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. టీఆర్‌ఎస్‌ పాలనలో కౌలు రైతులకు రుణం కార్డులు ఇవ్వడం లేదన్నారు. ధరణి వల్ల భూమి ఉన్న రైతులు బిక్షగాళ్లగా మారారని అన్నారు. ధరణి పోర్టల్‌లో అసైన్డ్ భూములు బ్లాక్‌లిస్ట్ చేయబడ్డాయని తెలిపారు. తప్పు ఎంట్రీలను సరిదిద్దే ఎంపిక లేకుండా అనేక తప్పులు నమోదు చేయబడ్డాయని వివరించారు. ధరణి పోర్టల్‌లో నమోదు చేయని భూమి పరిమాణానికి సంబంధించిన పాస్‌బుక్ లేని కారణంగా వ్యవసాయ యజమానులు వ్యవసాయ బీమా, రైతు బంధుకు అనర్హులుగా మారుతారని అన్నారు.

పోడు భూములను హరితహారం పేరుతో గుంజుకొని హక్కు పత్రాలు ఇవ్వలేదన్నారు. ప్రతి గిరిజన రైతుకు, పోడు రైతుకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల పేరుతో భారీ దోపిడీకి పాల్పడుతున్నారని, అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టు‌లో అంబెద్కర్ పేరు తీసేసి కాళేశ్వరం అని పేరు పెట్టారని అన్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో తెలంగాణ రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని అన్నారు. 9 అంశాలతో రైతు భరోసా కల్పించడానికి వరంగల్ డిక్లరేషన్‌ని రాష్ట్ర వ్యాప్తంగా 12 ఏళ్ల పిల్లాడికి సైతం తెలిసేలా అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. నెల రోజుల పాటు డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యం చేశామన్నారు. రచ్చబండ ద్వారా కేసీఆర్ మోసాలు ఎండగడతామని ధ్వజమెత్తారు.


Next Story

Most Viewed