తెలంగాణ ద్రోహులు, ఆంధ్ర నాయకులకు అడ్డాగా ప్రగతిభవన్: అద్దంకి దయాకర్​

by Disha Web Desk 19 |
తెలంగాణ ద్రోహులు, ఆంధ్ర నాయకులకు అడ్డాగా ప్రగతిభవన్: అద్దంకి దయాకర్​
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజల సొమ్ముతో కట్టిన ప్రగతిభవన్​పైరవీ కారులకు అడ్డాగా మారిపోయిందని కాంగ్రెస్​ సీనియర్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్​పేర్కొన్నారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. ప్రగతి భవన్ పేదలకు అందుబాటులో లేదని ఫైర్​అయ్యారు. తెలంగాణ ద్రోహులు, పైరవీకారులు, ఆంధ్ర రాజకీయ నాయకులకు అడ్డాగా తయారు చేశారన్నారు. తెలంగాణ వస్తే నక్సలైట్ ఏజెండాను అమలు చేస్తామన్న కేసీఆర్, స్వరాష్ట్రం కోసం పని చేసిన ఉద్యమకారులు, అమరవీరులను మరచిపోవడం సరైంది కాదన్నారు. కోదండ రామ్, గద్దర్, మందకృష్ణ లాంటి ఉద్యమ కారులను అరెస్టులు చేయించి జైల్లో పెట్టడం దారుణమన్నారు. జగన్, లగడపాటి రాజ్ గోపాల్, ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్లకు ఎర్ర తివాచీలు వేసి కేసీఆర్​స్వాగతం పలికినట్లు గుర్తు చేశారు. ప్రగతిభవన్​ముఖ్యమంత్రి అధికారిక నివాసమని, దానిలో ప్రజలకు ఎంట్రీ లేకపోతే ఎట్లా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజా సమస్యలు వినడానికి ముఖ్యమంత్రి కార్యాలయం తలుపులు తెరిచి ఉండాలన్నారు. ప్రగతి భవన్‌లో ప్రజా దర్బార్ నిర్వహించాల్సిన అవసరం ఉన్నదన్నారు. ''గతంలో చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డిలు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ప్రజలను కలవలేదా? ప్రజలకు ప్రవేశం లేని ప్రగతి భవన్ ఎందుకు? ఎవరి కోసం?'' అంటూ విమర్శించారు. నిరంకుశ పాలన నుంచి శాశ్వత పరిష్కారం కోసం తుది దశ ఉద్యమం చేయాల్సిన అవసరం యువత మీద ఉన్నదన్నారు. 9 నెలల్లో ప్రగతి భవన్, 12 నెలల్లో సచివాలయం కట్టిన సర్కార్.. 9 ఏళ్లలో అమరుల స్థూపం కట్టకపోవడంలో అంతర్యామేమిటో అర్థం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రోహిన్ రెడ్డి, రాజశేఖర్, మానవతా రాయ్, సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story