ఎంపీడీవో కార్యాలయం ఎదుట మహిళల ధర్నా..

by Disha Web Desk 20 |
ఎంపీడీవో కార్యాలయం ఎదుట మహిళల ధర్నా..
X

దిశ, భీమిని : మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం సర్పంచ్, కార్యదర్శిని తొలగించాలంటూ సోమవారం గ్రామానికి చెందిన మహిళలు ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో ధర్నాచేపట్టి నిరసన తెలిపారు. ఉదయం ఎంపీడీవో కార్యాలయానికి వచ్చిన అధికారులను గేటుకు అడ్డంగా కూర్చొని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. అధికారులకు పలుసమస్యలను విన్నవించారు. తమకు గ్రామంలోని వాటర్ ట్యాంక్ ద్వారా నీళ్లు సరఫరా చేయడం లేదని, వాగు నుండి సరఫరా చేసే బోర్ వద్ద మోటార్ కాలిపోయి 25 రోజులు గడుస్తున్నా సర్పంచ్ పుల్లూరి సురేఖ, కార్యదర్శి అభిలాష్ పట్టించుకోవడంలేదని ఆరోపించారు. కార్యాలయానికి వచ్చి సమస్యను విన్నవించిన ఎంపీఓ తనకేమీ పట్టనట్టు ఉండడం పై అధికారులను నిలదీశారు. ఎంపీడీవో ఆఫీసుకు చేరుకోగానే మహిళలు ఖాళీ బిందెలు ముందు పెట్టి నిరసన తెలిపారు.

దీంతో మీ సమస్య పరిష్కరించాలని ఎంపీఓకు తెలిపానని ఎంపీడీవో గ్రామస్తులకు తెలుపగా ఇప్పటివరకు మోటారు కాలిపోయి పదిరోజుల అవుతుందని 20రోజులుగా గ్రామానికి నీటి సరఫరా నిలిచిపోయి ఇబ్బందులు పడుతున్నామని గ్రామ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ ద్వారా సరఫరా అయ్యే నీళ్లు వారంలో రెండుసార్లు మాత్రమే వస్తున్నాయనీ ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్, కార్యదర్శిని తొలగించాలంటూ నినాదాలు చేశారు. రెండు గంటల వరకు కార్యాలయం గేటు వద్ద కూర్చొని ఉండిపోయారు. అధికారులు సైతం ఎంత చెప్పినా వినకపోవడంతో అధికారులు తలలు పట్టుకున్నారు. రెండు రోజుల్లో గ్రామానికి నీటి సరఫరా సక్రమంగా జరిగేటట్లు చూస్తానని ఎంపీడీవో రాధాకృష్ణ గ్రామస్తులకు చెప్పడంతో ధర్నా విరమించారు. గ్రామంలో సమస్యలు తాండవం చేస్తున్నాయని, పారిశుద్ధ్య నిర్వహణ అంతంత మాత్రంగానే ఉందని గ్రామస్తులు అధికారులకు తెలిపారు.

Next Story