రాజ్యాంగ హక్కులను కాలరాస్తే ఎలా ఊరుకుంటాం: తుడుం దెబ్బ

by Dishanational1 |
రాజ్యాంగ హక్కులను కాలరాస్తే ఎలా ఊరుకుంటాం: తుడుం దెబ్బ
X

దిశ ప్రతినిధి, నిర్మల్: ఉత్తర తెలంగాణలో విస్తరించి ఉన్న ఏజెన్సీ అటవీ ప్రాంతంలో నివసిస్తున్న ఆదివాసీ బిడ్డలకు న్యాయం జరిగేదాకా తమ పోరాటం కొనసాగిస్తామని తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు బుర్స పోచయ్య స్పష్టం చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆదిమ గిరిజన జాతులకు సంబంధించిన పదికి పైగా సంఘాలు ఐక్య కార్యచరణ వేదికగా ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలో పోరుగర్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివాసీ అస్థిత్వ పోరు గర్జన పేరిట నిర్వహించిన కార్యక్రమానికి భారీగా ఆదివాసులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఇంద్రవెల్లి స్థూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు.

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు పోచయ్య మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో వలస లంబాడాల ఆధిపత్యం పెరిగిపోయి అడవుల్లోనే పుట్టి పెరిగిన ఆదిమ గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాల తరబడి రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం తాము పోరాటం చేస్తుంటే ప్రభుత్వాలు తమకు న్యాయం చేయడం లేదని ఆరోపించారు. 1/70 చట్టాన్ని ప్రజాప్రతినిధులు అధికారులు కలిసి తుంగలో తొక్కి లంబాడాలకు న్యాయం చేస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగంలోని షెడ్యూల్ 5, 6 ప్రకారం అడవిపై ఆదిమ గిరిజనులకే హక్కు ఉంటుందన్న వాస్తవాన్ని పక్కనపెట్టి అధికార యంత్రాంగం వలస లంబాడాలకు పెద్దపీట వేయడం అన్యాయం అన్నారు. జీవో 3 ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలోని ప్రభుత్వ ఉద్యోగాలన్నీ ఆదిమ గిరిజనులకే దక్కాల్సి ఉన్నప్పటికీ లంబాడాలకు ఈ ఉద్యోగాలు కట్టబెట్టి ఆదిమ గిరిజన తెగలకు తీరని నష్టం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి వచ్చిన వలస లంబాడాలను వారికి ఇచ్చిన ఉద్యోగాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించేదాకా తమ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ ఉంటే ఆదిమ గిరిజనులు చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు.

అడవుల్లో నివసిస్తున్న ఆదిమ గిరిజన తెగలయిన గోండు, కొలం, తోటి, పరదాన్, నాయక్ పొడ్ తదితర జాతులు ఇతర ప్రాంతాల నుంచి వలస వస్తున్నవారితో అంతరించిపోయే ప్రమాదం నెలకొందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అడవి నుంచి మమ్మల్ని ఎవరూ విడదీయలేరని తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు, వరంగల్ జిల్లా ఏటూరు నాగారం, ఖమ్మం జిల్లా భద్రాచలం ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదిమ గిరిజన తెగలను ఏకం చేసి తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ఆదిమ గిరిజనులు భారీ ఎత్తున తరలివచ్చారు.


Next Story