బీజేపీ వైపే.. ఏలేటి చూపు..?

by Dishanational2 |
బీజేపీ వైపే.. ఏలేటి చూపు..?
X

దిశ ప్రతినిధి నిర్మల్: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏఐసీసీ వ్యవహారాల అమలు కమిటీ చైర్మన్, నిర్మల్ మాజీ శాసనసభ్యుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి పార్టీ మార్పుపై తీవ్రంగా మల్లగుల్లాలు పడుతున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీని వీడడం ఖాయమని ప్రచారం మొదలైంది. అతి త్వరలోనే భారతీయ జనతా పార్టీలో చేరుతారనే ప్రచారం ఊపందుకోవడం చర్చనీయాంశంగా మారింది. అత్యంత సన్నిహితులు చెప్పిన సమాచారం మేరకు ఆయన బీజేపీలో చేరడం ఖాయమని తెలుస్తోంది.

సుదీర్ఘ మంతనాలు..

వచ్చే ఎన్నికల్లో నిర్మల్ నియోజకవర్గం నుంచి మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటున్నారు 2009లో ఎమ్మెల్యేగా గెలిచిన ఏలేటి 2014, 2018 ఎన్నికల్లో ఓడిపోయారు అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ పార్టీ బలోపేతం కోసం తీవ్రంగా కృషి చేశారు పార్టీలో అంచలంచలుగా ఎదిగి పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ దృష్టిలో పడ్డారు. ఏఐసీసీ వ్యవహారాల అమలు కమిటీ చైర్మన్ గా కీలక బాధ్యతలు చేపట్టారు. కాగా భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై మంగళవారం సుధీర్ఘ మంతనాలు జరిపారు. తన నివాసంలో డీసీసీ ప్రెసిడెంట్ డి.ముత్యంరెడ్డి, నిర్మల్ పట్టణ, నియోజకవర్గంలోని అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు అధికార హోదాలో ఉన్న జెడ్పీటీసీ సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు ఇతర ముఖ్య నేతలతో ఐదారు గంటలకు పైగా సమాలోచనలు చేశారు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలి.. అందుకు ఏం చేద్దాం అన్న ఎజెండాపైనే ముఖ్య నేతల అభిప్రాయాలు తీసుకున్నారు.

బీజేపీలోకి వెళ్లాలని ఒత్తిడి..

మంగళవారం జరిగిన ముఖ్య నేతల సమావేశంలో మెజారిటీ నేతలు మహేశ్వర్ రెడ్డిని బీజేపీలో చేరాలని ఒత్తిడి చేసినట్లు సమాచారం. ఇప్పటికే రెండుసార్లు ఓడిపోయామని, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆశాజనకంగా లేదని, ప్రస్తుత తరుణంలో బీజేపీలో చేరడమే మంచిదని నేతలందరూ ఏలేటి ముందు కుండబద్దలు కొట్టినట్లు తెలిసింది. సుదీర్ఘ మంతనాల అనంతరం త్వరలోనే తన నిర్ణయం వెల్లడిస్తానని మహేశ్వర్ రెడ్డి తన అనుచరులకు చెప్పినట్లు సమాచారం. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు ఆయన సైతం బీజేపీలోకి వెళ్లేందుకు ఆసక్తిని చూపినట్లు చెబుతున్నారు. అయితే నేతల ముందు తన స్పష్టమైన అభిప్రాయాన్ని మాత్రం వెల్లడించలేదని సమాచారం.

చేరితే.. భారీగానే..

కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరితే భారీ ఎత్తున చేరేలా ఏలేటి వర్గీయులు యోచిస్తున్నట్లు తెలిసింది. జేపీ నడ్డా లేదా అమిత్ షా ఒకరిని నిర్మల్ తీసుకువచ్చి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు సమాలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. మరోవైపు రాష్ట్రంలో వేగంగా జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జూపల్లి కృష్ణారావు తో పాటు అనేకమంది ప్రముఖులు బీజేపీ వైపు చూస్తున్నారని, వారితో కలిసి పెద్ద ఎత్తున చేరడం ద్వారా బిగ్ బ్యాచ్ షో ద్వారా లాభపడవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈ వారంలోనే ఆయన తన కార్యాచరణ వెల్లడిస్తారని ఏలేటికీ అత్యంత సన్నిహిత నేత ఒకరు వెల్లడించారు.

Next Story

Most Viewed