ఆ ఉద్యోగులకు కళ్లద్దాల కొరత...!

by Disha Web Desk 20 |
ఆ ఉద్యోగులకు కళ్లద్దాల కొరత...!
X

దిశ, మందమర్రి : తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పరిశ్రమ ఏంటి అంటే సింగరేణి కాలరీస్ కంపెనీ అని చెప్పక తప్పదు. కానీ ఈ పరిశ్రమలో ఉద్యోగులు కళ్లద్దాల కొరతను ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. ప్రతి సంవత్సరం వందల కోట్లరూపాయలు సంస్థ లాభాలు ఆర్జిస్తూ, అందులో కార్మికుల వాటాను కూడా ప్రకటిస్తూ దినదినం అభివృద్ధి పథంలో సింగరేణి సంస్థ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. మరి ఈ క్రమంలో కార్మికులకు కంటి అద్దాలకొరత ఎందుకు ఏర్పడిందో అంతు చిక్కని ప్రశ్నగా భావించక తప్పదు.

ఈ మధ్య మంచిర్యాల జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాలను మంజూరు చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా సింగరేణి కాలరీస్ కంపెనీ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ 500 కోట్ల రూపాయలను కళాశాల నిర్మాణానికి ఆర్థిక సాయం చేసిన విషయం కూడా తెలిసిందే. ఈ క్రమంలో సింగరేణి కార్మికులకు సంస్థ వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించి ప్రైవేటు ఆస్పత్రిలో అద్దాలు కొనుక్కోమని ఉచిత సలహాలు ఇవ్వడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది.

మందమర్రి ఏరియాలో ఆర్కేపీ కే.కే ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో డంపర్ ఈపీ ఆపరేటర్లుగా దాదాపు 180 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారని సమాచారం. వీరికి ప్రతిసంవత్సరం కంటి పరీక్షలు నిర్వహించడం పరిపాటే. అయితే 40 సంవత్సరాలు దాటిన ఉద్యోగులకు ఎంతో కొంత దగ్గర, దూరం చూపులో లోపం ఉండడం సహజమే.

ప్రైవేట్ లో కొనుక్కోండి.. వైద్యుల ఉచిత సలహా..

సింగరేణి ఏరియా ఆసుపత్రిలో కంటి వైద్యపరీక్షలలో కార్మికులలో లోపాలను గుర్తించిన వైద్యులు లోపాలు ఉన్న ఉద్యోగులను ప్రైవేటు ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించుకుని అద్దాలు కొనుక్కొని విధులకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేస్తున్నారని అన్నారు. అద్దాలు పట్టుకొని వైద్యుల దగ్గరికి వెళితేనే విధులకు అనుమతి ధ్రువపత్రాలు ఇస్తున్నారని కార్మికులు వాపోతున్నారు. చివరికి తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ లో కంటి అద్దాలు కొనుక్కోవలసి వస్తుందని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కంటి అద్దాలు పెట్టుకొని వస్తేనే విధులు కల్పిస్తాం..

రెండు ఓసీలలో విధులు నిర్వహిస్తున్న డంపర్ ఈపీ ఆపరేటర్లకు కంటి లోపాలు ఏర్పడితే ఆయా ఉద్యోగులు కంటి అద్దాలు కొనుక్కొని వస్తేనే విధులు అనుమతులు కల్పిస్తామని ఆసుపత్రి వైద్యులు హుకుంలు జారీ చేస్తున్నారని వాపోయారు. ప్రైవేట్ గా కంటి అద్దాలు కొనుగోలు చేసి వైద్యులకు అద్దాలను చూపిస్తేనే ఫిట్ లెటర్ జారీ చేస్తున్నారని కార్మికులు మండిపడుతున్నారు.

సింగరేణి సంస్థనే అద్దాలు ఇవ్వాలి..

సింగరేణి కంపెనీలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ఉచితంగా కంటి పరీక్షల నిర్వహించి లోపాలు ఉన్నవారికి అద్దాలు ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. సింగరేణి ప్రాంత అభివృద్ధి కొరకు డీఎంఎఫ్టీ నిధులు కింద ఏటా కోట్లాది రూపాయలు ఖర్చుచేస్తున్న సింగరేణి సంస్థ కార్మికుల పై ఎందుకు ఆ ప్రేమను కనబరచడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం పై అధికారులు దృష్టి సారించి కార్మికులకు ఉచితంగా కంటి అద్దాలు, లేజర్ అద్దాలు ఇవ్వాలని కార్మిక వర్గం డిమాండ్ చేస్తుంది.

పాలసీ మ్యాటర్ ను అనుసరిస్తున్నాం : డీవైసీఎంఓ ఉష

సింగరేణి సంస్థ గత పాలసీ మ్యాటర్ ను అమలు చేస్తున్నామని మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్ డీవైసీఎంఓ ఉషా తెలిపారు. కార్మికులకు దృష్టిలోపం కలిగితే వారికి అద్దాలు కొనుకొమ్మని సూచనలు చేస్తున్నామని అన్నారు. అద్దాలను ప్రయివేటులో కొనుకొని వస్తేనే విధులకు అనుమతులు ఇస్తామని మేము ఎవరికి ఆదేశాలు ఇవ్వలేదని పేర్కొన్నారు.

Next Story

Most Viewed