రూ. 37 వేల కోట్లకు చేరుకోనున్న సింగరేణి టర్నోవర్

by Disha Web Desk 22 |
రూ. 37 వేల కోట్లకు చేరుకోనున్న సింగరేణి టర్నోవర్
X

దిశ, ఆదిలాబాద్ బ్యూరో: సింగరేణి సంస్థ ఈ నెలతో ముగియనున్న 2023 - 24 ఆర్థిక సంవత్సరంలో తన చరిత్రలోనే అత్యధికంగా రూ. 37 వేల కోట్లకు పైగా అమ్మకాలను సాధించబోతుంది. గత ఆర్థిక సంవత్సరం సాధించిన రూ. 33 వేల కోట్ల రూపాయల టర్నోవర్ కన్నా ఇది 12 శాతం అధికం. బొగ్గు అమ్మకాల ద్వారా రూ. 32,500 కోట్లు, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ద్వారా ఉత్పత్తి అవుతున్న విద్యుత్ అమ్మకాల ద్వారా రూ. 4,500 కోట్ల టర్నోవర్ సాధించనుంది. గత ఏడాది సాధించిన రూ. 33 వేల కోట్ల టర్నోవర్‌ ఫిబ్రవరికి సాధించడం విశేషం. దేశంలో నవరత్న కంపెనీల కన్నా మిన్నగా సింగరేణి అద్భుత పనితీరును కనబరించిందని ఆ సంస్థ సీఅండ్ఎండీ ఎన్‌. బ‌ల‌రామ్ వెల్ల‌డించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 700 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, అదే పరిమాణంలో బొగ్గు రవాణా జరపాలని నిర్ణయించామని, ఈ దిశగా అన్ని ఏరియాలు రోజువారీ లక్ష్యాల సాధనకు కృషి చేస్తున్నాయ‌న్నారు. 2017-18 ఆర్థిక సంవత్సరం తర్వాత తొలిసారిగా ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా నిర్దేశించుకున్న వంద శాతం ఉత్పత్తి లక్ష్యాన్ని సింగరేణి చేరుకోబోతుందని ఆయన వెల్లడించారు.

వేసవిలో విద్యుత్ వినియోగం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో సింగరేణితో ఇంధన సరఫరా ఒప్పందం ఉన్న అన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు నిత్యం తగినంత బొగ్గును సరఫరా చేస్తున్నామని, విద్యుత్ కేంద్రాలలో తగినంత బొగ్గు స్టాకులు ఉండే విధంగా బొగ్గు రవాణా జరుపుతున్నామని పేర్కొన్నారు. సింగరేణితో అనుబంధం ఉన్న ఏ ఒక్క థర్మల్ విద్యుత్ కేంద్రానికి కూడా బొగ్గు కొరత రాబోదని ఆయన స్పష్టం చేశారు. లక్ష్యాల సాధనకు కృషి చేస్తున్న అధికారులను, కార్మికులను, ఉద్యోగులను ఆయన అభినందిస్తూ మిగిలిన పక్షం రోజులు ఇదే స్ఫూర్తితో పనిచేయాలని కోరారు.

Next Story

Most Viewed