కలెక్టరేట్ వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి జర్నలిస్టుల నిరసన

by Kalyani |
కలెక్టరేట్ వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి జర్నలిస్టుల నిరసన
X

దిశ, కాగజ్ నగర్ : కాగజ్ నగర్ పట్టణానికి చెందిన ఆదాబ్ హైదరాబాద్ పత్రిక జర్నలిస్టు పై దాడి చేసిన అక్రమ మైనింగ్ నడిపించే కలీం ను పోలీసులు వెంటనే అరెస్టు చేయాలని, గురువారం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద అసిఫాబాద్, కాగజ్నగర్ ప్రెస్ క్లబ్ ల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి జర్నలిస్టులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆసిఫాబాద్, ప్రెస్ క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సి.హెచ్ సురేష్, కృష్ణంరాజు, కాగజ్ నగర్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టి .సురేందర్, వి. తిరుమల చారి లు మాట్లాడుతూ సమాజంలో జర్నలిస్టులకు భద్రత లేకుండా పోయిందన్నారు.

కాగజ్ నగర్ తహసీల్దార్ కార్యాలయానికి కూతవేటు దూరంలో చారిగాం గ్రామ సమీపంలో నడిపించే అక్రమ మైనింగ్ పై వార్త సేకరణకు వెళ్లిన ఆదాబ్ హైదరాబాద్ పాత్రికేయునిపై అక్రమ మైనింగ్ నడిపించే నిర్వాహకుడు కలీం దాడి చేసి జర్నలిస్టునే ఒక దొంగగా చిత్రీకరిస్తూ మొబైల్ గుంజుకొని పోలీస్ స్టేషన్ వరకు తీసుకువెల్లి జర్నలిస్టు పైనే ఫిర్యాదు చేయడం దారుణమన్నారు. ఎన్నో ఏళ్లుగా చారిగాం ప్రాంతంలో నడుస్తున్న మట్టి మాఫియా పై పలు పత్రికల్లో వార్తా కథనాలు వచ్చిన అక్రమ మైనింగ్ పై రెవెన్యూ అధికారులు ఇప్పటివరకు వారిలో చలనం రాలేదన్నారు. మాఫియా నిర్వాహకులు ఇచ్చే తాయిలాలకు పోలీసులు, రెవెన్యూ అధికారులు అలవాటు పడ్డారని ఆరోపించారు.

ప్రభుత్వానికి. ప్రజలకు వారధిగా ఉండే జర్నలిస్టులకే ఇలా జరిగితే సామాన్య మానవులకు ఇలాంటి న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోకపోతే సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం వాటిల్లే ప్రమాదం ఏర్పడుతుందన్నారు. అక్రమ మైనింగ్ నిర్వాహకుడు కలిమ్ ను పోలీసులు వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ మైనింగ్ చేస్తున్న స్థలాన్ని అధికారులు ఇప్పటివరకు సందర్శించకుండా ఉన్నారని, మైనింగ్ స్థలానికి వెళ్లి అధికారులు విచారణ చేపట్టాలన్నారు.

అనుమతులు ఉన్నాయా లేదా అనే విషయంపై ఆరా తీయాలన్నారు. అంతేకాకుండా కాగజ్ నగర్ పట్టణంలో ఇసుక, మట్టి మాఫియా పై సంబంధిత శాఖ అధికారులు నిర్లక్ష్యం చేస్తూ అండగా నిలుస్తున్నారన్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు చేపట్టేలా అధికారులు దృష్టి సారించాలని కోరారు. బాధిత జర్నలిస్టుకు న్యాయం జరిగేంత ఆందోళన చేపడతామన్నారు. అనంతరం కలెక్టర్ ఏ.వో రఫత్ ఉల్లా కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్, కాగజ్ నగర్ జర్నలిస్టులు పాల్గొన్నారు.

Next Story