హత్య మిస్టరీని ఛేదించిన పోలీసులు.. పరారీలో హంతకులు

by Web Desk |
హత్య మిస్టరీని ఛేదించిన పోలీసులు.. పరారీలో హంతకులు
X

దిశ, నిర్మల్ రూరల్: హత్య? ఆత్మహత్య? అనే మిస్టరీగా మారిన కేసును ఆదివారం నిర్మల్ పోలిసులు ఛేదించారు. కొన్నిరోజుల క్రితం నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలంలోని కనకపూర్ గ్రామ శివారులోని పోలీసులకు ఓ మృతదేహం లభ్యమైంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కానీ ఈ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. ఇది హత్య? ఆత్మహత్య? అన్నది పోలీసులు తేల్చుకోలేక పోయారు. తాజాగా ఈ కేసును పోలీసులు ఛేదించారు. హత్యగా తేలిన ఈ కేసులోని హతంకులను పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. నిర్మల్ డిఎస్‌పీ ఉపేందర్ రెడ్డి తేలిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా మెట్‌పెల్లి మండలం వెంపెట్ గ్రామానికి చెందిన కంచికట్ల స్వప్న, భర్త శ్రీనివాస్ వయస్సు 36 దంపతులు. స్వప్నకు మొదట 12 ఏళ్లప్పుడే అదే మండలంలోని చిట్టపూర్ గ్రామానికి చెందిన కైలాష్ పతి అనే వ్యక్తితో వివాహం జరిగింది.

పెళ్లైన 2 సంవత్సరాలకే వారి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దాంతో విడాకులు తీసుకున్నారు. వారికి ఒక కొడుకు ఉన్నాడు. విడాకుల తర్వాత కుమారుడిని తండ్రి దగ్గరే ఉంచుకున్నారని పోలిసులు తెలిపారు. ఆ తర్వాత స్వప్న హైదరాబాద్‌ ఉప్పల్‌లోని ఓ బట్టల దుకాణంలో పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తోంది. అదే సమయంలో మృతుడు శ్రీనివాస్ షాప్‌కు తరచుగా రావడంతో వారికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో వారు వివాహం చేసుకున్నారు. శ్రీనివాస్ ఆటో నడుపుతూ జీవితం కొనసాగిస్తున్నారు. వారు తమ కుమారుడు తరుణ్ (19), కూతురు సిరివెన్నెల (15) కలిసి జీవితం కొనడిగిస్తున్నారు. వారు ఆర్థికంగా బాగా ఎదగడంతో రియల్ఎస్టేట్ వ్యాపారం మొదలు పెట్టడం జరిగిందని పోలిసులు తెలిపారు.

అలాగే ఉప్పల్‌లో నూతన ఇల్లు నిర్మించుకొని నివసిస్తున్న తరుణంలో శ్రీనివాస్‌కు 9 సంవత్సరాల క్రితమే పరిచయం అయిన నందిని అనే మహిళతో చనువుగా ఉంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న స్వప్న ఆత్మ హత్యకు పాల్పడం జరిగింది. దాంతో శ్రీనివాస్‌కు నందిని దూరమైంది. మనస్తాపానికి గురై భార్య పిల్లలను కొట్టడం ప్రారంభించాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు నందినికి ఉప్పల్‌లో ఇల్లుకొని ఆమెను అందులో ఉంచాడు. అంతేకాకుండా ఇల్లును ఆమె పేరిట రిజిస్ట్రేషన్ చేసి మనం అందరం అందులో కలిసి జీవిద్దాం అని భార్య పిల్లలని అడిగాడు. అందుకు వారు ససేమిరా అనడంతో మళ్ళీ వారిని చిత్రహింసలకు గురి చేయడం మొదలు పెట్టాడు. దీంతో మనస్తాపానికి గురైన భార్య భర్తను చంపితేనే తాము సుఖంగా ఉంటామని భావించిందని పోలీసులు తెలిపారు.

ఇందులో భాగంగా భర్తను చంపేందుకు మొదటి భర్త కుమారుడు రాజ్ కుమార్, మృతుడు శ్రీనివాస్ కుమారుడు తరుణ్ సహా మరి కొందరితో సూపారి మాట్లాడుకొని హత్య చేసేందుకు ప్లాన్ రెడీ చేశారు. అనుకున్న విధంగానే ఈనెల 22న శ్రీనివాస్‌ను స్వప్న స్వగ్రామమైన వెంపేట్‌కు పిలిపించుకుని మద్యం తాపించారు. అనంతరం మత్తులో ఉన్న అతడిని కర్రలతో తలపై కొట్టి హత్య చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని కారులో తీసుకువచ్చి గుర్తు తెలియకుండా నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలంలోని కనకపూర్ గ్రామశివారులోని వాగులో పడేసినట్లు పోలీసులో తెలిపారు. అయితే స్వప్న మాట్లాడుకున్న సూపారి డబ్బులు ఇవ్వక పోవడంతో కిరాయి హంతకులు మృతుడి శరీరంపై ఉన్న బంగారాన్ని తీసుకునీ పరారయ్యారని పోలీసులు పేర్కొన్నారు.

కేసును ఛేదించిన పోలీసులు మృతుని భార్య, కుమారులతోపాటు ఏడుగురు కిరాయి హంతకులను అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుండి పలు వాహనాలతో పాటు బంగారం, నగదు, సెల్ ఫోన్లను, హత్య సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్‌పీ తెలిపారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలో పట్టుకుంటామని చెప్పారు. ఈ మిస్టరీ ని ఛేదించిన సొన్ సిఐ రాంనర్సింహ రెడ్డి, లక్ష్మణచాంద ఎస్సై రాహుల్,మామడ ఎస్సై అశోక్,నిర్మల్ రూరల్ ఎస్సైలను డిఎస్‌పీ అభినందించారు.

Next Story

Most Viewed