ఈ నెల 31 వరకు పోలీస్ యాక్ట్‌ అమలు

by Web Desk |
ఈ నెల 31 వరకు పోలీస్ యాక్ట్‌ అమలు
X

దిశ, ఆదిలాబాద్: జిల్లాలో ప్రశాంత వాతావరణం కల్పించడానికి ఈ నెల 31 వరకు 30 పోలీస్ యాక్ట్ నిబంధనలను అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం పోలీస్ ముఖ్య కార్యాలయం నుండి ప్రకటన విడుదల చేస్తూ వివరాలు వెల్లడించారు. జిల్లాలో ప్రజా సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు, ఊరేగింపులు, బహిరంగ సభలు, ప్రజలు గుమికూడే కార్యక్రమాలను చేపట్టాలన్నా ముందస్తుగా డీఎస్పీ లేదా ఆపై అధికారుల నుంచి అనుమతి పొందాల్సి ఉంటుందన్నారు. నిషేధిత ఆయుధాలు, కత్తులు, కర్రలు, జెండా కర్రలు, తుపాకులు, పేలుడు పదార్థాలు, నేరాలకు ఉసిగొల్పే ఎటువంటి ఆయుధాలు, సామాగ్రి కలిగి ఉండరాదని సూచించారు. జనజీవనానికి ఇబ్బంది కలిగించేందుకు దారితీసే ప్రజా సమావేశాలు, జనసమూహం లాంటివి పూర్తిగా నిషేధం అన్నారు. ప్రచార రథాలు, మైకులు, అధిక శబ్ధ పరికరాలు పూర్తిగా నిషేధించినట్లు పేర్కొన్నారు. ఎవరైనా ఉల్లంఘిస్తే 30 పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం శిక్షార్హులవుతారని సూచించారు. శాంతి పూర్వకంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నా ముందస్తుగా వివరాలు వెల్లడించి అనుమతులు కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులు, కేంద్ర రక్షణ దళాలు, విధి నిర్వహణలోని హోంగార్డులు, ప్రభుత్వ సెక్యూరిటీ గార్డులు, ప్రార్థనా స్థలాలు, అంత్యక్రియల ఊరేగింపులకు నిబంధనల నుండి మినహాయింపు కల్పించినట్లు తెలిపారు. పోలీస్ స్పెషల్ బ్రాంచ్ నిఘా అధికారులు, టాస్క్ ఫోర్స్ బృందం సభ్యులు ప్రతి మండల కేంద్రంలో నిఘా కొనసాగిస్తూ ఆకస్మిక దాడులు చేపట్టి, అక్రమార్కులపై గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

Next Story