ప్రజలకు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించాలి

by Sridhar Babu |
ప్రజలకు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించాలి
X

దిశ, కడెం : గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలకు ఆర్థిక అక్షరాస్యతపై విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్అ న్నారు. శనివారం కడెం మండల కేంద్రంలోని హరిత రిసార్టులో పట్టణ, గ్రామీణ ప్రజలకు అక్షరాస్యతా పై అవగాహన కల్పించేలా వాలంటీర్లకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని మారుమూల గ్రామాల ప్రజలు సైతం ఆర్థిక అక్షరాస్యత వైపు అడుగులు వేసేలా వారికి విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజలందరికీ రోజు వారి జీవితంలో అవసరమయ్యే ఆర్థిక అంశాల అన్నింటిపై అవగాహనను పెంపొందించేలా కృషి చేయాలన్నారు. సైబర్ నేరాలపై బ్యాంకు అధికారులు ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని కోరారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అందించే అన్ని రకాల పథకాలు, రుణాలు, బీమా సదుపాయాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రభుత్వాలు తక్కువ వడ్డీకే రుణాలను అందిస్తాయని, రైతులు, మహిళలు బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకునేలా వారికి వివరించాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జన సురక్ష, పీఎం విశ్వకర్మ, ముద్ర, పీఎంఈజీపీ, పీఎం జీవన్ జ్యోతి, అటల్ పెన్షన్ యోజన, పీఎం ఎఫ్ఎంఈ, ఇతర వ్యవసాయ రుణాలపై రైతులకు, ప్రజలకు అవగాహన కల్పించారు. రుణాలు పొంది వాటిని సక్రమంగా వినియోగించడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని తెలిపారు. అర్హులైన వారు రుణాలు పొంది వ్యవసాయం, వాటి అనుబంధ రంగాలైన డెయిరీ, కోళ్లు, చేపల పెంపకం వంటి రంగాలలో, కుటీర పరిశ్రమ, వ్యాపార, కుల వృత్తులలో అభివృద్ధిని సాధించవచ్చునని తెలిపారు. ప్రభుత్వాలు అందించు వివిధ రకాల బీమా సదుపాయాలు సద్వినియోగం చేసుకునేలా ప్రజలకు విస్తృత ప్రచారం కల్పించాలన్నారు.

మహిళలకు పొదుపు ఆవశ్యకతను వివరించాలని సూచించారు. జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ రాంగోపాల్ మాట్లాడుతూ ప్రజలకు బ్యాంకింగ్ సేవలపై అవగాహన పెంపొందించేందుకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా, వీడ్స్ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. రైతులు, మహిళా సంఘాలు, యువతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు, బీమా సదుపాయం, తదితర బ్యాంక్ సేవలు, అంశాలపై విస్తృత అవగాహన కల్పిస్తారన్నారు. అంతకుముందు వీడ్స్ స్వచ్ఛంద సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పార్థసారథి ప్రజలకు ఆర్థిక అక్షరాస్యత, బ్యాంకు సేవల వినియోగంపై ఏరియా కోఆర్డినేటర్లకు అవగాహన కల్పించారు. అనంతరం ఆర్థిక అక్షరాస్యత కరదీపిక లను అధికారులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుజాత, ఎంపీడీఓ అరుణ, ఎస్బీఐ బ్యాంకు మేనేజర్ సంతోష్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ నరేష్, అధికారులు, సిబ్బంది, సంస్థ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed