పీడీఎస్ బియ్యం పట్టివేత.. అధికారులను దుర్భాషలాడిన నిందితులు..!

by Disha web |
పీడీఎస్ బియ్యం పట్టివేత.. అధికారులను దుర్భాషలాడిన నిందితులు..!
X

దిశ, రామకృష్ణాపూర్: రవీంద్రఖని రైల్వే స్టేషన్ లో మంచిర్యాల జేసీ మధుసూదన్ నాయక్ తన సిబ్బందితో 18 క్వింటల్లా పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్న సంఘటన మంగళవారం వివాదానికి తెరలేపింది. వివరాల్లోకి వెళ్లితే.. రవీంద్ర ఖని రైల్వే స్టేషన్ నుంచి పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలిపోతున్నాయని ఖచ్చితమైన సమాచారం మేరకు మంచిర్యాల జిల్లా జేసీ మధుసూదన్ నాయక్, డీఎస్ఓ ప్రేమ్ కుమార్, మందమర్రి రెవెన్యూ సిబ్బంది ఆకస్మిక దాడి నిర్వహించారు. రవీంద్రఖని నుంచి రైలు మార్గం ద్వారా మహారాష్ట్రకు తరలిస్తున్న సుమారు 18 క్వింటల్లా బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న మహిళలు, ఆకస్మిక దాడి నిర్వహించిన జేసీ బృందాన్ని దుర్భాషలాడినట్లు తెలిసింది.

కాగా దుర్భాషలాడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక తహసీల్దార్ సంపత్ శ్రీనివాస్ రామకృష్ణాపూర్ పట్టణ ఎస్ఐ అశోక్ కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. గత కొన్ని సంవత్సరాలుగా మంచిర్యాల జిల్లా నుంచి తరలిపోతున్న రేషన్ బియ్యంకు అడ్డుకట్ట వేయాలని జిల్లా అధికార యంత్రాంగం పట్టుదలతో ఉంది. ఈ క్రమంలోనే సిబ్బందితో రవాణా కేంద్రాల వద్ద నిఘాను ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇక్కడ తొమ్మిది రూపాయలకు కొనుగోలు చేసిన బియ్యాన్ని మహారాష్ట్రలో రూ. 25లు పలుకుతుండడంతో చాలామంది నిరుద్యోగులు, పేదలు అక్రమ రవాణాకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.


Next Story