ఓపెన్ కాస్ట్ మైనింగ్ లో స్థానికులకే ఉద్యోగాలివ్వాలి: సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క

by Shiva |
ఓపెన్ కాస్ట్ మైనింగ్ లో స్థానికులకే ఉద్యోగాలివ్వాలి: సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క
X

దిశ, నస్పూర్: ఓపెన్ కాస్ట్ మైనింగ్ లో స్థానికులకే ఉద్యోగాలివ్వాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరాంపూర్ ఉపరితల గనిలో హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా ఆయన పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ఉపరితల గనిని పరిశీలిస్తున్న సమయంలో సింగపూర్, తాళ్లపల్లి, గుత్తదారి పల్లె గ్రామస్థలు తమ సమస్యలను ఆయనతో విన్నవించారు.

ప్రధానంగా తమ గ్రామాల్లోని భూములు, ఇళ్లను ఓపెన్ కాస్ట్ మైనింగ్ భాగంగా ప్రభుత్వమే తీసుకుందని తెలిపారు. తమ భూములను తీసుకునే సమయంలో యువతకు ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుండా బయటి వాళ్లకు ఇస్తున్నారని ఆరోపించారు. మూడు గ్రామాలు కలిపి దాదాపు వేయి మంది యువకులు ఉపాధి, ఉద్యోగాలు లేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉపరితల గనిలో మైనింగ్ చేస్తున్న అధికార పార్టీ నాయకుడికి చెందిన సీఆర్ఆర్ సంస్థ స్థానికులకు కాకుండా బయటి వాళ్లకు ఉద్యోగాలిస్తున్నారని ఆరోపించారు. అనంతరం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ రానున్న కాలంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని హామీ ఇచ్చారు.

అనంతరం అక్కడి నుంచి పాదయాత్ర చేస్తూ శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంకు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, పట్టణాధ్యక్షుడు బండారి సుధాకర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సుర్మిల వేణు, కౌన్సిలర్ బొద్దున సంధ్య రామ్మూర్తి, తదితరులు పాల్గొన్నారు.

Next Story