నడిపెల్లికి 'గడ్డం' గండం.. ఇంటా అసమ్మతి బయట బలమైన ప్రత్యర్థి

by Disha Web Desk 12 |
నడిపెల్లికి గడ్డం గండం.. ఇంటా అసమ్మతి బయట బలమైన ప్రత్యర్థి
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: నాలుగు సార్లు ఎమ్మెల్యేగా నడిపెల్లి దివాకర్ రావుకు ఈ సారి గడ్డు పరిస్థితులే ఉన్నాయి.. సొంత పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకుల అసమ్మతి.. బయట బలమైన ప్రత్యర్థి కొక్కిరాల.. మధ్యలో సొంతపార్టీలో సీనియర్ నేత గడ్డం అరవింద్ రెడ్డి నుంచి గండం పొంచి ఉంది. ఈ సారి తనయుడు విజిత్ రావును బరిలో దించాలని భావిస్తుండగా.. అంత వీజీ ఏం కాదంటున్నారు. పాతతరం నేతలు వెంట ఉన్నా.. కొత్త తరం యువతకు దగ్గర కాలేకపోయారు. మరోవైపు బీసీ నాయకులకు అవకాశమిస్తే.. ఎలాగుంటుందనే అధిష్టానం సర్వే చేయడం చర్చకు దారి తీసింది.. గడ్డం సహకరించకున్నా.. వేరే పార్టీ నుంచి బరిలో దిగినా.. అధికార పార్టీ అభ్యర్థికి కష్టకాలమేనటా.. ఇప్పటి వరకు ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి బలహీనతలే.. అధికార పార్టీకి బలమయ్యాయనే చర్చ లేకపోలేదు..!

నడిపెల్లికి గడ్డం గండం తప్పేనా..

నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నడిపెల్లి దివాకర్ రావుకు ఈ సారి ఎన్నికల్లో గడ్డు పరిస్థితులు తప్పేలా లేవు. 1999, 2004 లో లక్సెట్టిపేటలో కాంగ్రెస్ నుంచి రెండు సార్లు, 2014, 2018 లో మంచిర్యాలలో టీఆర్ఎస్ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తాజాగా వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఇంటా బయటా పరిస్థితులు అంతగా అనుకూలంగా లేవని తెలుస్తోంది. 2009, 2010 ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గడ్డం అరవింద్ రెడ్డి.. 2014లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయన తిరిగి సొంత గూడు టీఆర్ఎస్ పార్టీ లోకిరాగా.. 2018 లో ఆయనకు అవకాశం రాలేదు. ఈ సారి ఆయన కూడా టికెట్ ఆశిస్తుండగా.. గడ్డం సహకారం లేనిది నడిపెల్లి గట్టెక్కడం కష్టమే. గడ్డంకు వ్యక్తిగతం మంచి పేరు, ప్రజల్లో సానుభూతి ఉండగా.. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల్లో బలమైన శిష్యులు, క్యాడర్ ఉంది. ఆయన బరిలో దిగితే.. నడిపెల్లికి గడ్డు పరిస్థితులు తప్పేలా లేవు.

విజిత్ రావుకు అంత వీజీ కాదు..

మంచిర్యాల నియోజకవర్గంలో నడిపెల్లి దివాకర్ రావుకు కార్యకర్తలు, నాయకుల విషయంలో మొదటి నుంచి అసమ్మతి ఉంది. పాత తరం నాయకులకే ప్రాధాన్యత ఇస్తుండగా.. యువతను పట్టించుకోవడం లేదటా. గతంలో అవినీతి ఆరోపణలు, భూకబ్జాలు, బంధువుల పేరుతో భూములు చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. సర్కారు పథకాల పైనే ఆధార పడుతుండగా.. అభివృద్ధి కార్యక్రమాలను ఎజెండాగా చేసుకుని జనంలోకి వెళ్తున్నారు. బీసీలకు టికెట్ ఇప్పిస్తే ఎలా ఉంటుందనే విషయంలో సర్వే చేయించగా.. మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ ముఖేష్ గౌడ్, నస్పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, మరో ఇద్దరి పేర్లు పరిశీలనకు వచ్చారు. మారుస్తారా.. లేదా.. అనేది పక్కన పెడితే.. మొత్తానికి సర్వే అయితే నిర్వహించారు. ఆయన కుమారుడు విజిత్ రావు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తుండగా.. కొంత బ్యాలెన్స్ చేస్తున్నారు. ఈ సారి తనయుడికి టికెట్ కోసం ప్రయత్నిస్తుండగా.. వ్యక్తిగతంగా మంచి పేరున్న.. రాజకీయాల్లో ఎంత వరకు నెట్టుకు రావడం కష్టమనే వాదన వినిపిస్తోంది.

బలం అదే.. బలహీనత అదే..

కాంగ్రెస్ పార్టీకి చెందిన కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల నియోజకవర్గం లో మంచి పట్టు సాధించారు. గ్రామీణ ప్రాంతాల్లో కొక్కిరాల, కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. మొదటి నుంచి ఆయన ఆ పట్టును నిలుపుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఆయన మరింత దూకుడు పెంచారు. ప్రత్యర్థి బలమైన వ్యక్తి అయినప్పటికీ.. పార్టీలో, జనాల్లో కొక్కిరాల ఏకపక్ష ధోరణి నడిపెల్లికి కలిసి వస్తుంది. లేదంటే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచేది. స్వల్ప ఓట్లతో ఓడిపోయారు. గత ఎన్నికల్లో లక్సెట్టిపేట, దండేపల్లి, హాజీపూర్ మండలాల్లో కేపీఆర్కు పూర్తి స్థాయిలో ఆధిక్యత ఉంది. నడిపెల్లికి ఇప్పటికీ నాయకత్వ లోపం వల్ల పట్టు దొరకటం లేదు. విజిత్రావు నష్ట నివారణ చర్యలు చేపట్టినా.. జనం పూర్తి స్థాయిలో విశ్వసించడం లేదు. సాధారణంగా అధికార పార్టీలోకి చేరికలుండగా.. ఇక్కడ కాంగ్రెస్ లోకి చేరిక లున్నాయి. పాత మంచిర్యాలకు చెందిన తూముల నరేష్ పార్టీ వీడారు. నస్పూర్ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ టీంను దూరం పెట్టడంతో అసమ్మతి కొనసాగుతోంది. ఇటీవల అధిష్టానం నిర్వహించిన సర్వేలోనూ ఆయన వెనకబడ్డారనే చర్చ సాగుతోంది. మొత్తానికి నడిపెల్లికి వచ్చే ఎన్నికల్లో గెలుపు అవకాశాలు సగం సగమేనని చెప్పవచ్చు.



Next Story

Most Viewed