విచారణ పేరుతో థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు.. Minister Allola Indrakaran Reddy

by Dishafeatures2 |
విచారణ పేరుతో థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు.. Minister Allola Indrakaran Reddy
X

దిశ ప్రతినిధి, నిర్మల్: కేంద్రాన్ని వ్యతిరేకించే వాళ్లపై ఈడీ, సీబీఐ వంటి సంస్థలతో కేసులు పెట్టించి వేధిస్తు్న్నారని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆరోపించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉంటే విచారించే అధికారం ఈడీకి ఉందని, కానీ విచారణ పేరుతో థర్డ్ డిగ్రీ ఉపయోగించే అధికారం మాత్రం లేదని స్పష్టం చేశారు. సోమవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తనపై తప్పుడు ఆరోపణలు చేశారని మండిపడ్డారు. పీహెచ్ వర్కర్ల నియామకాల్లో తాను డబ్బు తీసుకున్నట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానన్న మంత్రి.. నిరూపించకుంటే బండి సంజయ్ రాజీనామా చేయాలని సవాలు విసిరారు. నోటికి ఏదొస్తే అది మాట్లాడుతా అంటే కుదరదని తేల్చి చెప్పారు. బండి సంజయ్ తన భాషను మార్చుకోవాలని హితవు పలికారు. మూడున్నర దశాబ్దాలుగా ప్రజాసేవలో ఉన్నానని, తన గురించి జిల్లా ప్రజలకు తెలుసునని చెప్పారు.


ఒక్క గుంట భూమి ఆక్రమించినట్టు నిరూపిస్తారా?

తాను డీ వన్ పట్టాల పేరిట 2000 ఎకరాలు ఆక్రమించినట్లు బండి సంజయ్ చేసిన ఆరోపణలు నిరాధారం అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఈ విషయంలో తమ ఏజెన్సీ సంస్థలతో విచారణ జరుపుకోవచ్చని చెప్పారు. తాను ఒక్క గుంట భూమిని కూడా ఆక్రమించుకోలేదని స్పష్టం చేశారు. బీజేపీ నాయకులే భూకబ్జాలకు పాల్పడ్డారని, వారి వల్లే చాలా మంది తహసీల్దార్లు తమ ఉద్యోగాలు కోల్పోయారని చెప్పారు. సంక్షేమాల అమలులో టీఆర్ఎస్ ప్రభత్వం దేశంలోనే ముందుందని తెలిపారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రులు అనేకసార్లు చెప్పారని, కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక అవార్డులు వచ్చాయని పేర్కొన్నారు.

అభివృద్ధి విషయంలో చర్చకు సిద్ధం

జిల్లా అభివృద్ధి విషయంలో తాను బండి సంజయ్ తో పాటు ఇంకా ఎవరు వచ్చినా చర్చకు సిద్ధమని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రకటించారు. వందలాది కోట్ల రూపాయలు తీసుకువచ్చి నిర్మల్ జిల్లా అభివృద్ధికి తాను కృషి చేశానని చెప్పారు. నిర్మల్ కు రైలు మార్గం విషయంలో తాను ఇప్పటికీ చిత్తశుద్ధితోనే ఉన్నానని చెప్పారు. ముందుగా నిధులు విడుదల చేయాల్సింది కేంద్రం కాదా అని ప్రశ్నించారు. కేంద్రం నిధులు ఇచ్చిన తర్వాత రాష్ట్రం వాటా ఇవ్వకపోతే అప్పుడు అడగాలని... రైలు మార్గం వేయాలని అడిగితే అడ్డదిడ్డంగా మాట్లాడడం బీజేపీ నేతలకు తగదన్నారు. రైల్వే శాఖ తమ పరిధిలోనిది కాదని.. కేంద్రం పరిధిలోనిదనే విషయాన్ని బీజేపీ నాయకులు గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ జి.ఈశ్వర్, పార్టీ నాయకులు రాజేందర్, రాము తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed