మంత్రి అల్లోలపై ఎఐసీసీ నేత ఏలేటి ధ్వజం

by Disha Web Desk 20 |
మంత్రి అల్లోలపై ఎఐసీసీ నేత ఏలేటి ధ్వజం
X

దిశ ప్రతినిధి, నిర్మల్ : నిర్మల్ మాస్టర్ ప్లాన్ తయారు చేయించడం వెనుక మంత్రిఇంద్రకరణ్ రెడ్డి హస్తం ఉందని ఏఐసీసీ వ్యవహారాల అమలు కమిటీ చైర్మన్ నిర్మల్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి ఇంద్రకరణ్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన కుటుంబ సభ్యులు, అన్నదమ్ములకు సంబంధించిన భూముల కోసమే మాస్టర్ ప్లాన్ మార్చారని విమర్శించారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. మున్సిపల్ కార్యాలయం ప్రధానద్వారం వద్ద బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్లపల్లి సోఫీ నగర్ ప్రాంతాల్లో మంత్రికి సంబంధించిన భూములతో పాటు ఆయన అన్నదమ్ముల భూములను ఇండస్ట్రియల్ గ్రీన్ జోన్ నుంచి తొలగించి మాస్టర్ ప్లాన్ లో రెసిడెన్షియల్ జోన్ గా మార్చారని ఆరోపించారు.

మంజులాపూర్, తల్వేద గాజులపేట్ ప్రాంతాల్లో వ్యవసాయ దారులకు సంబంధించిన భూములను కుట్రపూరితంగా ఇండస్ట్రియల్ గ్రీన్ జోన్లుగా మార్చారని ఆరోపించారు. దీనివల్ల వందలాదిమంది పేద రైతులు నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను నివాసం ఉండే గాజులపేట్ ప్రాంతాన్ని గ్రీన్ జోనుగా మార్చడం వెనుక కుట్ర ఉందని తనపై కోపం ఉంటే తీర్చుకోవాలన్నారు. తాజా ప్లాన్ వల్ల ఆయా ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ బాధపెట్టడం సరికాదన్నారు. నిర్మల్ మాస్టర్ ప్లాన్ ను రద్దు చేసేదాకా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అవినీతి అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని దుయ్యబట్టారు.

మహేశ్వర్ రెడ్డి అరెస్ట్...

నిర్మల్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ఏఐసీసీ నేత మహేశ్వర్ రెడ్డి ఆందోళన చేస్తున్నారన్న సమాచారం మేరకు పట్టణ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు భారీగా తరలివచ్చి ఆందోళన చేస్తున్నారన్న సమాచారంతో డీఎస్పీ జీవన్ రెడ్డి పట్టణ సీఐ మల్లేష్, రామ్ నారసింహ రెడ్డి తదితరులతో అక్కడికి చేరుకొని మహేశ్వర్ రెడ్డితో ఆందోళన విరమించాలని కోరారు. అయినప్పటికీ అక్కడి నుంచి కదలకపోవడంతో పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ధర్నా కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు తక్కల రమణ రెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డి ముత్యంరెడ్డి కాంగ్రెస్ నేతలు ఉన్నారు.


Next Story

Most Viewed