Maoist warning : ఎమ్మెల్యే గడ్డం వినోద్‌కు ‌ మావోయిస్టుల హెచ్చరిక..

by Kalyani |
Maoist warning : ఎమ్మెల్యే గడ్డం వినోద్‌కు ‌ మావోయిస్టుల హెచ్చరిక..
X

దిశ,బెల్లంపల్లి: ప్రజల సమస్యలను గాలికి వదిలేసి మంత్రి పదవి కోసం ఆరాటపడుతూ జల్సా జీవితం గడుపుతున్నాడంటూ బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పై మావోయిస్టు పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే గడ్డం వినోద్ అనుచరులు భూ కబ్జాలపై తీవ్రస్థాయిలో మండిపడింది. రౌడీలను, భూ కబ్జాలను ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రోత్సహిస్తున్నాడని, తీవ్రస్థాయిలో స్పందించడం సంచలనాన్ని రేపుతుంది. ఇంటి నెంబర్లు ఇప్పిస్తామని లక్షల రూపాయలు తీసుకొని ఎమ్మెల్యే అనుచరులు మోసం చేశారని ధ్వజమెత్తారు.

ఇళ్ల పట్టాల విషయంలో గత ప్రభుత్వం విధివిధానాలు లేకుండా చేసిన మోసాలపై, అప్పటి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై మండిపడ్డారు. ప్రజల సమస్యలు, కష్టాలకంటే ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు మంత్రి పదవి పైనే ధ్యాస ఉందన్నారు. జల్సాల కోసం తరచూ విదేశాల్లో పర్యటించడం ప్రజలను విస్మరించడం క్షమించరాని తప్పిదమని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) సింగరేణి కోల్ బెల్ట్ కమిటీ కార్యదర్శి ప్రభాత్ చేసిన హెచ్చరిక రాజకీయ వర్గాల్లో వణుకు పుట్టిస్తోంది. ఈ మేరకు మీడియాకు మావోయిస్టు పార్టీ కోల్ బెల్ట్ కమిటీ కార్యదర్శి ప్రభాత్ విడుదల చేసిన లేఖ పూర్తి పాఠం ఇలా ఉంది...

“మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వ హయంలో అప్పటి ముఖ్యమంత్రి ఆదేశంతో ఎన్నికల లబ్ధి కోసం ఎలాంటి విధి విధానాలు రూపొందించకుండా రెవెన్యూకు అప్పగించిన సింగరేణి క్వాటర్లకు పట్టాలు ఇచ్చే పేరిట లక్షలాది రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజులు వసూలు చేసి ఇంతవరకు ఇంటి నెంబర్లు ఇవ్వకపోవడం వల్ల ప్రభుత్వం కరెంట్ కనెక్షన్లు ఇవ్వడం లేదు.

సింగరేణి అధికారులు బి.ఆర్.ఎస్ పాలకుల మెప్పుల కోసం క్వార్టర్స్ వదిలిపెట్టి ప్రస్తుతం మందమర్రి జనరల్ మేనేజర్ మనోహర్ సింగరేణి కరెంట్ కట్ చేసే చర్యలకు పాల్పడడంతో పట్టణంలోని వివిధ బస్తీలకు చెందిన కార్మికులు, రిటైర్ కార్మికులు గత నాలుగు రోజులుగా అంధకారంలో మగ్గుతున్నారు. దోమల బెడద, విషజ్వరాలు, చీకటి అంధకారంతో బస్తీ లోని ప్రజలు అల్లాడుతుంటే గుర్తింపు సంఘం ఏ.ఐ.టి.యు. సి ఎమ్మెల్యే వినోద్ అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. బి.ఆర్. ఎస్. పై ఉన్న అసంతృప్తి దుర్గం చిన్నయ్య అరాచకలతో విసిగి పోయి ప్రజలు కాంగ్రెస్ పార్టీ వినోద్ మాయమాటలు నమ్మి గెలిపిస్తే ప్రజల సమస్యలను పట్టించుకోవడంలేదు.

బెల్లంపల్లి ప్రజల పట్ల నిర్లక్ష్యం తో సింగరేణి యాజమాన్యం విద్యుత్ కోతలు కరెంట్ కనెక్షన్లు తొలగింపులు, మంచినీటి సరఫరాను నిలిపివేస్తుంటే ఎమ్మెల్యే వినోద్ 'రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేలు వాయించిన ఫాసిస్టు నియంత ఊరు లాగా ఢిల్లీ, బెంగళూరు, అమెరికా అంటూ జల్సాలతో మంత్రి పదవి వేటలో నియోజకవర్గ ప్రజలను పూర్తిగా పట్టించుకోకపోవడం క్షమించరాని తప్పిదం. ప్రజల సమస్యలను గాలికి వదిలి అనుచరులు, భూకబ్జా కోరులను, రౌడీలను, గుండాలను ఎమ్మెల్యే ప్రోత్సహించడం జరుగుతుంది. అనుచర వర్గం రెచ్చిపోతూ భూ కబ్జాలకు పాల్పపడుతూ ఇంటి నంబర్లు ఇప్పించే పేరిట లక్షల రూపాయల వసూళ్ళకు పాల్పడుతున్నారు.

నియోజక వర్గానికి చెందిన వేమనపల్లి మండల, గ్రామాల ప్రజలు వర్షం ప్రభావంతో వరదలతో ముంపునకు గురైన పంటపొలాలు కొట్టుకుపోయి, ఇండ్లు కూలిపోయి బురద మట్టి తిప్పలు పేరుకుపోయి గత పది రోజులుగా ప్రభుత్వ సహాయం కొరకు ప్రజలు అల్లాడుతుంటే ఎమ్మెల్యే విందులు, వినోదాలు, షికార్లతో ఆయిల్ మసాజ్ లతో, పబ్లు, క్లబ్లు, నీలి చిత్రాలకు పరిమితమై ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు.

ఎమ్మెల్యే వినోద్ తన పద్ధతులు మార్చుకొని ప్రజల సమస్యలు పట్టించుకోవాలని డిమాండ్ చేశారు. కలెక్టర్, రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి బెల్లంపల్లి క్వార్టర్లకు పట్టాలు, ఇంటి నెంబర్లు ఇవ్వాలని అంతవరకు సింగరేణి అధికారుల కంపెనీ కరెంటు తొలగిస్తే మందమర్రి జనరల్ మేనేజర్ మనోహర్, ఎమ్మెల్యే వినోద్ తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నామని ప్రభాత్ పేర్కొన్నారు." తక్షణం సింగరేణి అధికారులు తొలగించిన కంపెనీ కరెంటును పునరుద్దరించాలన్నారు.



Next Story

Most Viewed