Telangana Rain Update : ప్రమాదపుటంచున "కడెం"..

by Disha Web Desk 20 |
Telangana Rain Update : ప్రమాదపుటంచున కడెం..
X

దిశ, ప్రతినిధి నిర్మల్ : గత ఏడాది సరిగ్గా జూలై 13న జరిగిన భారీ ప్రమాదం నుంచి ఈ సర్కారు ఇంకా గుణపాఠం నేర్వలేదు. ఎగువ ప్రాంతం నుంచి భారీగా వచ్చిన వరద కారణంగా నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు భారీగా గండిపడి 12 గ్రామాలు మునిగిపోయిన సంగతి తెలిసిందే. మరమ్మత్తులకు నోచుకోని కారణంగా గేట్లు తెలుసుకోలేక ప్రాజెక్టు పై నుంచి వరద నీరు పోటెత్తి వారి విధ్వంసాన్ని సృష్టించిన చరిత్రను సాగునీటి శాఖ ఇంజనీరింగ్ అధికార యంత్రాంగం మరిచిపోయినట్టుంది. ఒకవేళ అధికార యంత్రాంగం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన సర్కారు మొద్దు నిద్రలో మునిగినట్టుంది. తాజా పరిస్థితులను చూస్తే ప్రాజెక్టు ఆయకట్టు రైతాంగంతో పాటు ప్రాజెక్టు దిగువన ఉన్న గ్రామాల ప్రజలు నీటిపారుదల శాఖ అధికారులతో పాటు ప్రభుత్వంపై తీవ్రంగా ఆగ్రహంతో ఉన్నారు.

మొరాయిస్తున్న ప్రాజెక్టు గేట్లు..

కడెం ప్రాజెక్టునకు 18 క్రస్ట్ గేట్లు ఉండగా ఇందులో ప్రస్తుతం 12 మాత్రమే పనిచేస్తున్నాయి. 6 గేట్లు సుదీర్ఘకాలంగా పనిచేయక ఎత్తే పరిస్థితి లేదు ప్రాజెక్టు నిండిన ప్రతిసారి ఇదే అవస్థ ఎదురవుతున్నది గత ఏడాది భారీ వరదల కారణంగా ప్రాజెక్టు కట్ట కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే ప్రధాన కారణం గేట్ల మొరాయింపేనని అధికారులు నివేదిక కూడా ఇచ్చారు. అధికార యంత్రాంగం సహామంత్రులు శాసనసభ్యులు ప్రాజెక్టును సందర్శించి సత్వరమే గేట్లు రిపేరు చేయిస్తామని హామీ ఇచ్చారు. 12 గ్రామాలు మునిగిపోయి పునరుద్ధరణకు సుమారు రెండు నెలల కాలం పట్టింది అన్ని గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు ప్రభుత్వం తరలించి చర్యలు తీసుకుంది. కానీ గతంలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని గేట్లకు మరమ్మత్తులు మాత్రం చేయించడం లేదు. అధికారులను అడిగితే నిధులు లేవన్న సమాధానమే వస్తున్నది.

పెరుగుతున్న వరద.. వణుకుతున్న గ్రామాలు..

గత నాలుగు రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. కడెం ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో సైతం భారీ వర్షాల కారణంగా ఇప్పటికే ప్రాజెక్టు నిండిపోయింది. ప్రస్తుతం సుమారు రెండు లక్షల క్యూసెక్కుల మేర వరద నీరు వస్తున్నది. 12 గేట్లు ఎత్తి సుమారు లక్షన్నర క్యూసెక్కుల చొప్పున వరద నీటిని బయటకు వదులుతున్నారు. మరో ఐదు రోజులపాటు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ చెబుతున్న విషయం తెలిసిందే. కడెం ప్రాజెక్టుకు ఎగువన ఉన్న వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతోపాటు క్యాచ్ మెంట్ ఏరియాలో వర్షాల కారణంగా ప్రాజెక్టుకు వరద పెరుగుతూనే ఉంది. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే గతేడాది జరిగిన సంఘటన పునరావృతం అయితే దానికి బాధ్యులు ఎవరన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. కాగా ఈనెల 29న సెంట్రల్ వాటర్ కమిషన్ టీం ప్రాజెక్టును సందర్శించేందుకు వస్తోంది.

హుటాహుటిన కలెక్టర్ కడెంకు...

గత ఏడాది కడెం ప్రాజెక్టు దుర్ఘటన సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి ప్రాజెక్టుకు భారీగా వరద వస్తున్న సమాచారంతో హుటాహుటిన ప్రాజెక్టు వద్దకు తరలించారు. శుక్రవారం తన షెడ్యూల్ మొత్తాన్ని రద్దు చేసుకుని అక్కడికి వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మొరాయిస్తున్న గేట్లపై ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులతో అడిగి తెలుసుకున్నారు. తక్షణమే ఇందుకు సంబంధించి మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ఎమ్మెల్యే రేఖ నాయక్ అక్కడికి చేరుకొని ప్రాజెక్టు వద్ద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్ట్ వద్ద నెలకొన్న పరిస్థితులపై దిగువన ఉన్న 12 గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.



Next Story

Most Viewed