సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు అవినీతి చీడ.. అంతా వారిదే హవా..

by Disha Web Desk 13 |
సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు అవినీతి చీడ.. అంతా వారిదే హవా..
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : సర్కార్‌కు ఆదాయమే ముఖ్యం.. వారికి అక్రమ వసూల్లే లక్ష్యం.. అన్ని పత్రాలున్నా.. రకరకాల కొర్రీలు పెడతారు. కాసులు ఇవ్వనిదే.. అసలు రిజిస్ట్రేషన్లు చేయరు. నిబంధనల ప్రకారం ఉన్నా.. ఆ పత్రం, ఈ పత్రం లేదని.. అధికారులు మెలిక పెడతారు. చివరికి డాక్యుమెంట్ రైటర్లు రంగంలోకి దిగి.. తాము సెటిల్ చేస్తామని చెబుతుంటారు. ప్రతి పనికో రేటు కడతారు.. పైసలిస్తేనే పనులు చేస్తారు. పైసలిస్తే తగిన పత్రాలు లేకున్నా.. సాఫీగా పనులు అయిపోతుంటాయి. జిల్లాలోని వివిధ రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాల్లో అధికారులు, డాక్యుమెంట్ రైటర్లు కలిసి నడిపిస్తున్న దందా ఇది. డాక్యుమెంట్ రైటర్లే సూత్ర, పాత్రధారులుగా ఉండటం గమనార్హం..!

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం ఉండగా.. ఉమ్మడి జిల్లాలో పది వరకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయమే ముఖ్యంకాగా.. రిజిస్ట్రేషన్ శాఖాధికారులు అక్రమ వసూళ్లే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. అన్ని పత్రాలున్నా.. పైసలివ్వనిదే పనులు కావడం లేదు. ప్రతి పనికో రేటు కట్టి.. ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇక ఏదైనా పత్రం లేకుంటే.. చుక్కలు చూపిస్తున్నారు. చివరికి మధ్యవర్తులుగా డాక్యుమెంట్ రైటర్లు ఉండి.. అంతా కథ నడిపిస్తున్నారు. చిన్న చిన్న సాకులు చూపి.. రిజిస్ట్రేషన్లు ఆపేస్తున్నారు. దీంతో డాక్యుమెంట్ రైటర్లను కలిస్తే.. చివరికి పని పూర్తి అవుతోంది. సారుకు డబ్బులు ఇవ్వాలని చెప్పి వసూళ్లు చేస్తున్నారు.


సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏ పని కావాలన్నా.. డాక్యుమెంట్ రైటర్లు, ప్రైవేటు వ్యక్తుల ద్వారా పూర్తవుతోంది. వాస్తవానికి డాక్యుమెంట్ రైటర్‌లకు ప్రభుత్వం నుంచి ఎలాంటి గుర్తింపు, అనుమతి లేదు. డాక్యుమెంట్ తయారు చేసినందుకు చార్జీలు వసూలు చేయాల్సి ఉండగా.. అధికారులకు ఇవ్వాలని అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఒక్కో డాక్యుమెంటుకు ఒక్కో రేటు ఉంటుంది. ఏవైనా లోపాలు, సరైన పత్రాలు లేకుండా మాత్రం అధికారులు రిజిస్ట్రేషన్ కాదని చెబుతుండగా.. డాక్యుమెంట్ రైటరును కలిస్తే పనైపోతుంది. ఇందుకు భారీగా డబ్బులు పిండుకుంటున్నారు. ఏ పని కావాలన్నా.. డాక్యుమెంట్ రైటర్లను కలిస్తే పూర్తవుతోంది. ఇక కార్యాలయాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఏజెంట్లదే హవా నడుస్తోంది.


రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ప్రైవేటు వ్యక్తులను పెట్టుకుని వసూళ్లకు దిగుతున్నారు. వీరు ప్రభుత్వ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కాకపోయినా.. వారికి సబ్ రిజిస్ట్రార్లు జీతాలు ఇచ్చి మరీ పెట్టుకుంటున్నారు. వీరి ద్వారానే కథ నడిపిస్తున్నారు. వసూల్లలో వీరిదే కీలక పాత్ర ఉంటోంది. ప్రైవేటు వ్యక్తులే డాక్యుమెంట్ నెంబర్లు వేస్తున్నారు. డబ్బులిస్తే రెగ్యులర్ డాక్యుమెంట్ నెంబరు వేస్తుండగా.. డబ్బులివ్వని ఫైలుకు పెండింగ్ నెంబర్ వేస్తారు. ఆయా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం బోర్డులు కూడా సరిగా లేవు. పేపర్ పై రాసి ఎక్కడో మూలన గోడకు అతికిస్తున్నారు. ఇక రిజిస్ట్రేషన్లకు వచ్చే కస్టమర్లకు కనీసం మర్యాద, గౌరవం కూడా ఇవ్వడం లేదు. త్రాగే నీరు, కూర్చునేందుకు సరిగా కుర్చీలు కూడా ఉండటం లేదు.



Next Story