ఖాళి జాగా కనిపిస్తే కబ్జా...

by Disha Web Desk 20 |
ఖాళి జాగా కనిపిస్తే కబ్జా...
X

దిశ, మంచిర్యాల టౌన్ : మంచిర్యాల బీఆర్ఎస్ నాయకులు ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే చాలు అక్కడ కబ్జా చేయడమే పనిగా పెట్టుకుంటున్నారు. చెరువులు, వాగులు, రోడ్లు, ప్రభుత్వ భూములే కాకుండా నాళాలను సైతం యథేచ్ఛగా ఆక్రమిస్తున్నారు. ప్రజానాయకులూ, అధికారులు ఎవరు పట్టించుకోక పోవడంతో ఇష్టారాజ్యంగా స్థలాలను ఆక్రమించుకొని నిర్మాణాలు చేపడుతున్నారు. అలా నిర్మించిన షట్టర్ లను కొందరు వారి సొంత అవసరాలకు ఉపయోగించుకోగా మరికొందరు ఇతరులకు అద్దెకు ఇచ్చి వారి వద్ద నుండి నెలనెలా అద్దె వసూలు చేసుకుంటున్నారు.

తాజాగ మంచిర్యాల పట్టణంలో తోళ్లవాగును ఆనుకొని ఉన్నరహదారికి, వాగుకు మధ్యలో ట్రాక్టర్ లతో మొరం పోయించడం చర్చనీయాంశంగ మారింది. తోళ్లవాగును ఆనుకోని ఒకవైపు జాతీయ రహదారి ఉండగా మరోవైపు వాగు బఫర్ జోన్ ఉంది. దాన్ని ఏమి పట్టించుకోకుండా మొరం పోయించి అక్రమ నిర్మాణాలు చేస్తున్నప్పటికీ అధికారులు చోద్యం చూస్తున్నారు. పట్టపగలే ట్రాక్టర్ లతో మొరం పోయించి నిర్మాణ పనులు జరిపిస్తున్నారు. అంటే అందులో ఎవరో అధికార పార్టీ నాయకుడి హస్తం తప్పకుండా ఉండి ఉంటుందని అక్కడి వారు చర్చించుకుంటున్నారు. ఈ వాగు వర్షకాలంలో పొంగి పొర్లడంతో పాటు పక్కన ఉన్న నిర్మాణాల్లోకి వరదనీరు చేరే అవకాశం ఉంది.

మంచిర్యాల పట్టణంలో చున్నం బట్టీని ఆనుకొని ఉన్న100 ఫీట్ల రోడ్ లో స్థానిక బీఆర్ఎస్ కౌన్సిలర్ ఒక షట్టర్ ను నిర్మించడం పలు విమర్శలకు దారి తీస్తుంది. అది అక్రమ నిర్మాణం అని పలువురు మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేయగా వివరాలు తెలుసుకొని చెప్తం అన్నట్లుగా ఫిర్యాదు దారుడికి కమిషనర్ సమాదానం చెప్పారు. విషయమై స్థానిక కౌన్సిలర్ ని సంప్రదించగా, అందులో తప్పేం ఉంది అండి మున్సిపాలిటీ ఆదాయాన్ని పెంచడానికే అక్కడ షట్లర్ ఏర్పాటు చేస్తున్నాను, నిర్మాణం అనంతరం, టాక్స్ కట్టడం వాళ్ళ మున్సిపాలిటీకి ఆదాయం పెరుగుతుంది అని స్థానిక టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఏ వచ్చి స్థలాన్ని చూసి నాకు బదులు ఇచ్చాడు అని చెప్తుంది. నిర్మాణానికి సంబంధించిన విషయం పై పట్టన ప్రణాళిక అధికారి వివరణ పొందేందుకు సంప్రదించగా అధికారి అందుబాటులోకి రాలేదు.

Next Story

Most Viewed