సేంద్రియ వ్యవసాయంపై రైతులు దృష్టి సారించాలి : కలెక్టర్ వరుణ్ రెడ్డి

by Disha Web Desk 15 |
సేంద్రియ వ్యవసాయంపై రైతులు దృష్టి సారించాలి : కలెక్టర్ వరుణ్ రెడ్డి
X

దిశ,సారంగాపూర్ : పంటలను హానికర రసాయనిక ఎరువులు, పురుగు మందుల ద్వారా కాకుండా సేంద్రియ విధానంతో సాగు చేయాలని కలెక్టర్ వరుణ్ రెడ్డి అన్నారు. శనివారం మండలం కేంద్రంలో సేంద్రియ ఎరువుల వాడకంలో భాగంగా ఘన జీవామృతం తయారీ శిక్షణ నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ అరుణ్ రెడ్డి, డీఆర్డీఓ విజయలక్ష్మి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలు ఉపాధి హామీలో పని చేసే మహిళలకు , రైతులకు సేంద్రియ పద్దతిలో వ్యవసాయం కోసం ప్రతి ఒక్కరూ పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. సేంద్రియ వ్యవసాయం జీవ వైవిధ్యాన్ని, జీవుల వివిధ దశలను, నేలలో గల సూక్ష్మ జీవుల పనితనాన్ని వృద్ధి పరుస్తుందని అన్నారు.

ముఖ్యంగా ప్రాంతీయంగా లభించే వనరులతో వ్యవసాయం చేసేందుకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ, హానికర రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని విస్మరిస్తూ, సేద్య, జీవ సంబంధ మరియు యాంత్రిక పద్ధతులతో వ్యవసాయం చేసేలా అందరూ ముందుకు రావాలని అన్నారు. రసాయనాలను వాడి పండించే పంటల ద్వారా ఎన్నో రకాల క్యాన్సర్ ల బారిన పడుతున్నామని, ప్రస్తుతం మనం అన్నం కూడా సంతృప్తిగా తినడం మానేసి మన తాతలు, తండ్రులు తిన్న గోధుమ, రాగులు వంటి వాటిపైపు దృష్టిని సారిస్తున్నామని అన్నారు.

కావున హరిత విప్లవం ద్వారా సేంద్రియ వ్యవసాయం వైపు రైతులు మొగ్గుచూపాలని పేర్కొన్నారు. రైతులకు జిల్లాలోని వ్యవసాయశాఖ అధికారుల ద్వారా మరింత అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అట్ల మహిపాల్ రెడ్డి, జెడ్పీటీసీ పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి, ఎంపీడీవో సరోజ, ఎంపీ ఓ తిరుపతిరెడ్డి, ఏపీఓ లక్ష్మారెడ్డి, ఏబీఎం మాధురి, స్థానిక సర్పంచ్ సుజాత నర్సారెడ్డి, ఎంపీటీసీ పద్మ, మహిళా సంఘాలు, రైతులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.



Next Story