వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలి

by Sridhar Babu |
వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలి
X

దిశ, బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా మున్సిపాలిటీలో వేసవిలో తాగునీటి సమస్య లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం ఆయన మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో నీటి సమస్యపై సమీక్షించారు. పట్టణ పరిధిలోని వార్డులలో తాగునీటిని నిరంతరాయంగా ప్రతి ఇంటికి అందించేలా చూడాలన్నారు. ఈ దిశగా కార్యాచరణ రూపొందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. బెల్లంపల్లి ఆర్డీఓ హరికృష్ణ, తహసీల్దార్ జ్యోత్స్న, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావుతో కలిసి నీటి సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. పారిశుద్ధ్యం, తాగునీరు, అంతర్గత రహదారులు, మురుగు కాలువల నిర్వహణ ఇతరత్రా పనులను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. వార్డులలోని ప్రతి ఇంటి నుండి ప్రతి రోజూ తడి చెత్త, పొడి చెత్తలను సేకరించి డంపింగ్ యార్డుకు తరలించాలని సూచించారు. మున్సిపల్ పరిధిలోని ఇంటి పన్నులు, ట్రేడ్ లైసెన్సులు 100 శాతం వసూలు చేయాలని పేర్కొన్నారు. అంతకు ముందు కన్నాల శివారులో అమృత్ 2.0 పథకం కింద చేపట్టిన వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలన్నారు.

Advertisement
Next Story