ఉందామా... వెళ్దామా..!

by Disha Web Desk 20 |
ఉందామా... వెళ్దామా..!
X

దిశ ప్రతినిధి, నిర్మల్ : అధికార బీఆర్ఎస్ పార్టీని వీడెందుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ముఖ్య నేతలు అటుఇటు చూస్తున్నారు. పార్టీని ఇప్పుడే వీడుదామా వద్దా అన్న సంశయంలో కొట్టుమిట్టాడుతున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఎంత చేసినా తమకు న్యాయం జరగడం లేదన్న ఆలోచనతో కొందరు... ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న నేతలు తీరుతో మరికొందరు గులాబీ పార్టీని వీడుతారన్న ప్రచారం మొదలైంది. అయితే ఇప్పటికిప్పుడే పార్టీకి రాజీనామా చేసి బయటకు వెళ్లడమా లేదంటే కాస్త వేచి చూడడమా అన్నది తేల్చుకోలేకపోతున్నారు.

పశ్చిమ జిల్లాలో లుకలుకలు...

ఉమ్మడి ఆదిలాబాద్ పశ్చిమ ప్రాంతంలో అధికార బీఆర్ఎస్ లో విభేదాలు ముదురుతున్నాయి. సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఈ పరిస్థితులు పార్టీకి విఘాతం కలిగిస్తాయన్న సంకేతాలు అధిష్టానానికి వెళ్లాయి. అయినప్పటికీ అధిష్టానం నుంచి ఇప్పటిదాకా ఎలాంటి పిలుపు లేకపోవడంతో పార్టీ తమకు న్యాయం చేయదన్న ఆలోచనతో నేతలు ఉన్నట్లు అభిప్రాయం ఉంది. ఆదిలాబాద్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే జోగు రామన్నతో అక్కడి పార్టీ సీనియర్లు బాలూరి గోవర్ధన్ రెడ్డి తీవ్రంగా విభేదిస్తున్నారు. పార్టీ కోసం పనిచేసిన సీనియర్ నేత లోక భూమారెడ్డి కార్పొరేషన్ చైర్మన్ గా అవకాశం ఇచ్చినప్పటికీ నియోజకవర్గంలో మళ్లీ తనకు గుర్తింపు లేకపోవడంపై సన్నిహితుల వద్ద తన నిరాశ వ్యక్తపరుస్తున్నారని సమాచారం. బోథ్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావుతో మాజీ మంత్రి గోడెం నగేష్, నేరడిగొండ జడ్పీటీసీ అనిల్ జాదవ్ అంటి ముట్టనట్లుగా ఉంటు వీరు కూడా టికెట్ ఆశిస్తున్నారు.

మళ్లీ బాపూరావు కే టికెట్ వస్తుందన్న ప్రచారం జరుగుతుండడంతో మిగతా నేతలు పార్టీని వీడుతారని ప్రచారం జరుగుతుంది. నిర్మల్ నియోజకవర్గంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో ఈ మధ్యకాలంలో పార్టీ సీనియర్లు సత్యనారాయణ గౌడ్ నల్ల ఇంద్రకరణ్ రెడ్డి వంటి నేతలు దూరంగా ఉంటున్నారు. ఈ నేతలు కూడా పార్టీ వీడతారని ప్రచారం జరుగుతున్నప్పటికీ వేచి చూసే ధోరణితో ఉన్నారని తెలుస్తోంది. ముధోల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే విట్టల్ రెడ్డితో జడ్పీటీసీ రమేష్ మాజీ జెడ్పి చైర్ పర్సన్ జుట్టు అశోక్ తదితరులు విభేదిస్తున్నారు. అవకాశం కోసం వేచి చూస్తున్న ఈ నేతలు కూడా పార్టీని వీడే అవకాశం లేకపోలేదని అంటున్నారు. ఖానాపూర్ నియోజకవర్గం లో ఎమ్మెల్యే రేఖ నాయక్ పై కొందరు నేతలు అసంతృప్తితో ఉన్నప్పటికీ బయటపడడం లేదు.

తూర్పు గులాబీ గందరగోళం...

తూర్పు జిల్లారాజకీయ కేంద్రం మంచిర్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే దివాకర్ రావును మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి బలంగా వ్యతిరేకిస్తున్నారు. అరవింద్ రెడ్డి గతంలో ఒకసారి గులాబీ పార్టీని వీడి మళ్లీ అదే గూటికి చేరారు. తాజాగా మళ్లీ అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. చెన్నూరు నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పై జెడ్పి చైర్ పర్సన్ భర్త మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు మళ్లీ టికెట్ ఆశిస్తున్నారు. పార్టీని వీడి కాంగ్రెస్లో చేరిన ఆయన ఇటీవలనే మళ్లీ టీఆర్ఎస్ లోకి వచ్చారు. వచ్చే ఎన్నికల్లో తనకు అవకాశం ఇవ్వకపోతే మళ్లీ పార్టీ మారుతారని ప్రచారం జరుగుతుంది. మాజీ ఎమ్మెల్సీ పార్టీ తూర్పుజిల్లా మాజీఅధ్యక్షుడు పురాణం సతీష్ అధిష్టానం పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

పార్టీ కోసం ఎంతగానో శ్రమించిన తనకు రెండోసారి ఎమ్మెల్సీ అవకాశం ఇస్తారని ఆశించారు. అయితే అధిష్టానం మొండి చేయి చూపింది. దీంతో ఆయన పార్టీకి రాజీనామా చేస్తారని ప్రచారం మొదలైంది. బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే చిన్నయ్యను గ్రంధాలయ చైర్మన్ రేణుగుంట్ల ప్రవీణ్ వ్యతిరేకిస్తున్నారు. మావోయిస్టు ఉద్యమ నేపథ్యం ఉన్న ప్రవీణ్ తెలంగాణ ఉద్యమంలో తీవ్రంగా పనిచేశారు. అప్పటినుంచి ఆయన ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. ఈసారి తనకు ఇవ్వాలని గట్టిగా పట్టుబడుతున్నారు. అయితే అధిష్టానం నుంచి ఆశించిన ఫలితం కనిపించకుండా పోతుండడంతో పార్టీ మారతారని ప్రచారం జరుగుతుంది అసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కును జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన సక్కుకు అధిష్టానం ప్రాధాన్యం ఇవ్వడాన్ని ఆమె జీర్నించు కోవడంలేదని చెబుతున్నారు.

ఇప్పటికే ఆమెతో బిజెపి అధిష్టానం టచ్లో ఉందని కూడా చెబుతున్నారు. అయితే టికెట్ల కేటాయింపు సమయం దాకా వేచి చూడాలన్న ధోరణితో ఆమె ఉన్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. సిర్పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోనప్పపై పార్టీలో అంతర్గతంగా విభేదాలు ఉన్నప్పటికీ నేతలు బయటపడడం లేదు. ఇలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గులాబీ పార్టీలో అసమ్మతి సెగలు బలంగానే ఉన్నప్పటికీ వేచి చూసే ధోరణితో నేతలు ఉన్నట్లు స్పష్టమవుతుంది. ఇతర పార్టీల నుంచి వీరికి ఆఫర్ ఉన్నప్పటికీ అధిష్టానం నుంచి ఏమైనా పిలుపు వస్తుందా లేదా అన్నట్టుగా ఉన్నారు. వచ్చే నెలలోనే ప్రభుత్వం రద్దు చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తమ భవిష్యత్తు విషయంలో భారత్ రాష్ట్ర సమితి వీడడమా అదే పార్టీలో కొనసాగడమా అని తెలుసుకోలేక సతమతమవుతున్నారు.


Next Story

Most Viewed