అవినీతి డొంకలు.. ఏసీబీని పట్టించుకోని లంచావతారులు

by Aamani |
అవినీతి డొంకలు.. ఏసీబీని పట్టించుకోని లంచావతారులు
X

దిశ ప్రతినిధి, నిర్మల్ : ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న అధికారులు, ఉద్యోగులకు అవినీతి నిరోధక శాఖ ఒకటి ఉంటుందన్న భయం లేకుండా పోతున్నది. పట్టుబడితే శాశ్వతంగా ఉద్యోగం పోదని... నాలుగు రోజులు ఆగితే మళ్లీ ఉద్యోగంలోకి రావచ్చన్న ధీమా అవినీతి అధికారులు, ఉద్యోగుల్లో పెరిగిపోతున్నది. ప్రభుత్వం ఇచ్చే జీతం కన్నా ఎక్కువగా లంచాలకు మరిగిన అధికారులు ఉద్యోగులు అవినీతి నిరోధక శాఖను అసలు పట్టించుకోవడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పరువు కన్నా పైసానే ముఖ్యం అనుకున్న ఉద్యోగులు అవినీతి నిరోధక శాఖను లెక్క చేయడం లేదన్న చర్చ ఉద్యోగ వర్గాల్లో మొదలైంది.

వరుస ఘటనలు జరుగుతున్నా.. ?

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొద్ది రోజులుగా వరుసగా అవినీతి నిరోధక శాఖ దాడుల్లో ప్రభుత్వ ఉద్యోగులు అధికారులు ప్రత్యక్షంగా లంచం తీసుకుంటూ పట్టుబడుతున్న సంఘటనలు పెరుగుతున్నాయి. అందులోనూ వేధింపుల కేసుల కన్నా ఎక్కువగా చిన్నచిన్న వ్యవహారాలకు పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తూ దొరికిపోతున్నారు. ఒక్క నిర్మల్ జిల్లాలోనే రెండేళ్ల వ్యవధి లోపే ఆరుగురు అవినీతి నిరోధక శాఖకు పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది. దీనికి గల కారణాలను విశ్లేషిస్తే అవినీతి నిరోధక శాఖకు పట్టుబడిన ఉద్యోగులు అధికారులకు కొద్ది కాలంలోనే తిరిగి ఉద్యోగం దక్కుతుండడంతో... లంచాలకు మరిగిన అధికారులు ఉద్యోగుల్లో విశ్వాసం పెరిగిపోతున్నది. ఇంతకాలం పనిచేసిన జీతమే కదా..! గట్టిగా నాలుగేళ్ల అవినీతిని నమ్ముకుంటే 40 ఏళ్ల సర్వీసును మించి సంపాదించవచ్చన్న అత్యాశ... లంచమే ఉద్యోగంగా భావిస్తున్న అధికారులు ఉద్యోగుల్లో పెరిగిందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

రెండేళ్లలో ఆరు కేసులు..

ఒక్క నిర్మల్ జిల్లాలోనే రెండు సంవత్సరాల వ్యవధి పూర్తి కాకుండానే ఆరుగురు ప్రభుత్వ ఉద్యోగులు అవినీతి నిరోధక శాఖకు పట్టుబడ్డారు. బుధవారం నిర్మల్ పురపాలక సంఘంలో పనిచేస్తున్న ఒక బిల్ కలెక్టర్ తన సర్వీస్ రిజిస్టర్ లో రెగ్యులరైజేషన్ ఎంట్రీ కోసం 15000 లంచం ఇస్తూ సొంత శాఖకు చెందిన జూనియర్ అసిస్టెంట్ ను అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టించారు. కార్యాలయాలకు వచ్చిన ప్రజల నుంచి డబ్బులు డిమాండ్ చేసి కేసుల్లో ఇరుక్కోవడం ఒక కోణం అయితే... సొంత శాఖలోనే పనిచేస్తూ డబ్బులు డిమాండ్ చేసి పట్టుబడుతున్న తీరు ఉద్యోగుల్లో జుగుప్సాకరంగా మారుతున్నది. సాటి ఉద్యోగి నుంచి లంచం డిమాండ్ చేయడం పట్ల ఉద్యోగుల్లో ఒక రకమైన ఆగ్రహం కూడా వ్యక్తం అవుతోంది. బుధవారం నిర్మల్ పురపాలక సంఘంలో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న షాకీర్ అనే ఉద్యోగిని అదే కార్యాలయంలో బిల్ కలెక్టర్ గా పనిచేస్తున్న భరత్ అనే ఉద్యోగి అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టించారు.

ఈ వ్యవహారం పురపాలక శాఖ ఉద్యోగులతో పాటు అన్ని శాఖల ఉద్యోగుల్లో కలకలం రేపడంతో పాటు చర్చకు దారి తీసింది. కాగా 2023 అక్టోబర్ లో స్టేషన్ బెయిల్ కోసం 10000 లంచం తీసుకుంటూ ఎస్సై రాజు మామడ పోలీస్ స్టేషన్ లో ఏసీబీకి చిక్కారు. అదే ఏడాది నవంబర్ నెలలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గిఫ్ట్ డిడ్ చేసే విషయంలో జూనియర్ అసిస్టెంట్ అరుణ్ కుమార్ ప్రైవేటు ఉద్యోగి రాజు 8000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. 2023 డిసెంబర్ నెలలో కడెం మండలం పెద్ద బెల్లాల్ గ్రామానికి చెందిన ఒక కూలి చనిపోగా రిజిస్టర్ లేబర్ బదలాయింపు కోసం లంచం డిమాండ్ చేయడంతో జిల్లా కార్మిక శాఖ అధికారి సాయిబాబా తన కుమారుడి సహాయంతో రూ.25 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో పడ్డారు. 20 24 సంవత్సరం జనవరిలో భూమి బదలాయింపు గిఫ్ట్ విషయంలో తాసిల్దార్ రాజేశ్వరి డిప్యూటీ తహసీల్దార్ చిన్నయ్యలు నగదు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు.

అదే నెలలో నిర్మల్ మున్సిపాలిటీలో రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్న గంగాధర్ మరో ఉద్యోగి నవంబర్ ఇద్దరు ప్రాపర్టీ అసెస్మెంట్ విషయంలో నగదు తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. తాజాగా ఇదే పురపాలక సంఘం లో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ షాకీర్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుకోవడం గమనార్హం. ఇలా వరుస ఘటనలు జరుగుతున్నప్పటికీ అధికారులు ఉద్యోగుల్లో ఏసీబీ అంటే భయం లేకుండా పోతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి కారణాలు చూస్తే కొద్ది కాలంలోనే ఉద్యోగం వస్తుందన్న ధీమా వారిలో ఉందని చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed