నకిలీ విత్తనాల కట్టడికి నిరంతర నిఘా..: సీపీ

by Aamani |
నకిలీ విత్తనాల కట్టడికి నిరంతర నిఘా..: సీపీ
X

దిశ‌, మంచిర్యాల : న‌కిలీ విత్త‌నాల క‌ట్ట‌డికి నిరంత‌రం నిఘా పెట్టాల‌ని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ‌నివాస్ స్ప‌ష్టం చేశారు. ఆయ‌న నకిలీ, కల్తీ విత్తనాలు, నిషేధిత హెచ్ టి కాటన్ విత్తనాలను తనిఖీలలో గుర్తించడం కోసం పాటించే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(SOP) పై క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో పోలీసు అధికారులతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా సీపీ మాట్లాడుతూ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా డీలర్లు విత్తనాలు విక్రయించాలన్నారు. విత్తన డీలర్లు లైసెన్స్ లేకుండా వ్యాపారం చేసినా, దుకాణాలలో, ఏజెంట్లు, మధ్యవర్తుల ముసుగులో ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయించినా కేసులు న‌మోదు చేసి చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. బ్రాండెడ్‌ కంపెనీల విత్తనాల పేరుతో నాసి రకం విత్తనాలు అమ్మినా, నకిలీ విత్తనాలు అమ్మినా నకిలీ దందా చేస్తున్నట్లు తెలిసినా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.

విత్తనాల ఎరువుల దుకాణాలు, గోదాముల్లో తనిఖీలు నిర్వహించాల‌న్నారు. విత్తన దుకాణాలు, గోదాములు, తయారీ కేంద్రాలను తనిఖీ చేసే సమయంలో లైసెన్స్ ఉందా లేదా, ఉంటే ఫారం –Bలేదా ఫారం -C (రెన్యూవ‌ల్‌) చెక్ చేయాలన్నారు. సీడ్ సర్టిఫికేషన్ అథారిటీ ఇచ్చిన ఆథ‌రైజేషన్ సర్టిఫికెట్ ఉన్నదా లేదా చెక్ చేయాలన్నారు. అనుమానస్పదంగా ఏవైనా విత్తనాలు గుర్తించినట్లయితే సంబంధిత MAO తో విత్తనాలను ల్యాబ్ టెస్టింగ్ కి పంపించాలన్నారు. కొనుగోలు చేసిన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులకు సంబంధించి రైతులు డీలర్ల నుంచి రసీదులు ఇస్తున్నారా లేదా చెక్ చేయాలని తెలిపారు. నకిలీ విత్తనాల సమస్యలను నియంత్రించేందుకు ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాలోకి రాకుండా సరిహద్దు ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేయడంతో పాటు సమాచారం వ్యవస్థను పటిష్టం చేయాలన్నారు. నకిలీ విత్తనాలు అంటగట్టి రైతులను మోసం చేయాలని చూస్తే ఉపేక్షించేది లేదన్నారు., అదేవిధంగా నకిలీ విత్తనాల విక్రయాలలో గతంలో కేసులు నమోదైన వారిపై నిఘా ఉంచి తరచూ కేసులు నమోదైతే పీడీ యాక్ట్ అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి. రాజు, సిసిఅర్బీ ఇన్స్పెక్టర్ బుద్దె స్వామి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Next Story