ఆ విషయంలో రాటుతేలిన Bandi Sanjay.. జనాల్లోనూ ఆసక్తి!

by Disha Web Desk 7 |
ఆ విషయంలో రాటుతేలిన Bandi Sanjay.. జనాల్లోనూ ఆసక్తి!
X

దిశ, ప్రతినిధి నిర్మల్ : పొట్టోడిని పొడుగోడు కొడితే.. పొడుగోడిని పోచమ్మ కొట్టిందట..! ఈట్ కా జవాబు పత్తర్ సే..! ఈ మాటలు తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ నోటి వెంట తరచూ వినబడేవి. ఆనాడు ప్రత్యేక తెలంగాణ రీజియన్ ఆకాంక్షతో కేసీఆర్ మాట్లాడుతుంటే సభలకు వెళ్లి చెవులు రిక్కించి వినేవారు. ఆ మాటలే తెలంగాణ ఉద్యమాన్ని ప్రత్యేక రాష్ట్రం సాధించేదాకా వెళ్ళాయనడంలో అతిశయోక్తి కాదు.

అదే ఇప్పుడు తాజాగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ మాటలు అంతకుమించిన తూటాలుగా పేలుతున్నాయని జనంలో టాక్ మొదలైంది. ఈట్ కా జవాబ్ పత్తర్ సే అనే కేసీఆర్ మాటకు.. ఈట్ ఔర్ పత్తర్ మిలాకే మారో.. అన్నట్టుగా బండి తూటాలు పేలుస్తుండటం చర్చనీయాంశం అవుతున్నాయి. బీజేపీ చీఫ్ బండి సంజయ్ కౌంటర్ ఎటాక్‌లో రాటు దేలాడని చెబుతున్న రాజకీయ విశ్లేషకులు ఆయన తీరును కేసీఆర్‌తో పోలుస్తూ సేర్ కు సవా సేర్ ( హిందీలో తనను మించిన వాడు ఇంకొకడు వచ్చాడని అర్థం) లా బండి ప్రసంగం ఉంటున్నదని చెప్పుకొస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ఒక సీనియర్ నేత వ్యాఖ్యానిస్తూ బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ నాలుగు విడతల్లో చేపట్టిన పాదయాత్రతో పోలిస్తే ఐదో విడత నిర్మల్ జిల్లా బైంసా నుంచి ప్రారంభించిన నాటి నుంచి ఆయన మాట్లాడుతున్న తీరు భావోద్వేగ ప్రసంగాలు నిజంగా ఆకట్టుకుంటున్నాయని అభిప్రాయపడ్డారు. ఈ టూర్ ఆద్యంతం కాషాయ పార్టీకి కొత్త మైలేజీ తెస్తున్నదని చెప్పారు.

కేసీఆర్ రీజియన్.. బండి రిలీజియన్..!

రీజియన్ అండ్ రిలీజియన్ మేక్స్ ద పాలిటిక్స్ ( ప్రాంతీయతత్వం, మతం) శాశ్వతంగా రాజకీయాలను ఏలుతాయని పొలిటికల్ ఫిలాసఫర్లు చెప్పిన విధంగానే తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. తెలంగాణ ఉద్యమం భుజానికి ఎత్తుకొని తానే ముందుండి నడిపిన కేసీఆర్ అడుగడుగునా ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టారు. ఆంధ్ర పాలకుల వలన తెలంగాణ విధ్వంసానికి గురైందని, వలస పాలనతో తెలంగాణ సమాజం వివక్షకు గురి అయ్యిందని.. ఆంద్రోడిని తెలంగాణ సరిహద్దుల దాకా తరిమికొట్టాలని పిలుపునిస్తూ యువతలో తీవ్రమైన ఉత్సాహాన్ని నింపేవారు. ఆయన ప్రసంగాలు ఉమ్మడి రాష్ట్రంలో మన ఇంటి పక్కన ఉండే ఆంధ్ర సోదర కుటుంబాలను సైతం అసహ్యించుకునే స్థాయిలో ఉండేవి. సన్నిహిత సంబంధీకులు సైతం రెండు సెక్షన్లుగా విడిపోయిన పరిస్థితి అప్పుడు ఏర్పడింది. ఉద్యమం పతాక స్థాయికి చేరి అన్ని రాజకీయ పక్షాలు తెలంగాణ ఏర్పాటుకు అంగీకారం తెలిపినప్పటికీ.. పార్లమెంటులో బీజేపీ మద్దతు తెలిపి సోనియాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినప్పటికీ ఆ క్రెడిట్ అంతా కేసీఆర్‌కే దక్కింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు కేసీఆర్ సీఎం కావడం రెండో దఫా మళ్లీ అధికారం చేపట్టడం జరిగింది.

8 ఏళ్ల పాలన తర్వాత కేసీఆర్ పరిపాలన వ్యవహారాల్లో అనేక ఆరోపణలు ఎదుర్కోవడం.. కూతురు కవిత సహా ఆయన కుటుంబ సభ్యులపై అవినీతి ఆరోపణలు జరగడం.. బంధుప్రీతి కుటుంబ పాలన వంటి వ్యవహారాలు కేసీఆర్‌ను చుట్టుముట్టాయి. ఈ క్రమంలోనే కేసీఆర్ తన టీఆర్ఎస్ పార్టీని బి ఆర్ ఎస్‌గా మార్చడం కేంద్రంతో తగవుకు దిగడంతో తెలంగాణలో కొత్త రాజకీయ యుద్ధం మొదలైంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఇస్తున్న పూర్తి సహకారంతో పార్టీ బీజేపీ చీఫ్ బండి సంజయ్ రంగంలోకి దిగారు. కేసీఆర్‌పై ఆయన చేస్తున్న కౌంటర్ ఎటాక్ ఇప్పుడు సర్వత్ర చర్చనీయాంశం అవుతుంది. ఆయన ఐదో విడత పాదయాత్ర మొదలైనప్పటి నుంచి వారం రోజులు గడుస్తున్నా అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి గాని, ఇతర పార్టీల నుంచి గాని ఆయన కామెంట్స్‌పై పెద్దగా ఎదురు దాడి కనిపించడం లేదు. కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్‌గా చేసుకొని బండి సంజయ్ చేస్తున్న ఎదురుదాడి ఇప్పుడు అన్ని వర్గాల్లో ఆసక్తికరంగా మారుతోంది. నాడు కేసీఆర్ ప్రాంతీయ తత్వ ఎజెండా ఎత్తుకుంటే ఇప్పుడు జరుగుతున్న పోరులో బండి సంజయ్ పక్కాగా మతతత్వ ఎజెండాతో ముందుకు సాగుతూ ఉండడం రాజకీయ వర్గాలతో పాటు మేధావి వర్గాలను ఆలోచనకు గురిచేస్తున్నది.

అవును మతమే.. నా అభిమతం అంటూ చేస్తున్న వ్యాఖ్యలతో జనంలోకి..

నాడు ప్రత్యేక వాదం పేరుతో తెలంగాణ ప్రజల్లో తీవ్రస్థాయిలో తెలంగాణ సమాజంలో ఉద్వేగాన్ని రగిలించిన కేసీఆర్ ప్రసంగాన్ని తలపిస్తూనే.. ఆనాడు నువ్వేం మాట్లాడావో.. నేను ఇప్పుడు అదే మాట్లాడుతున్నా. నేను హిందుత్వవాదిని.. దేశం కోసం ధర్మం కోసం హిందుత్వం కోసం పనిచేసే మనిషిని. వీటి కోసం ఎంతకైనా తెగబడే సైకోను అంటూ మాట్లాడుతున్న తీరు హిందూ సమాజంలో మానసికంగా ఆలోచనను రేకెత్తిస్తున్నది. ఒక సందర్భంలో టీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం పార్టీలు సెక్యులర్ అని ప్రచారం చేసుకుంటూ బీజేపీని మతతత్వ పార్టీ అని పేర్కొనడాన్ని ప్రస్తావిస్తూ.. సీఎం కేసీఆర్ నాకు సర్టిఫికెట్ ఇస్తే దాన్ని మెడలో వేసుకుని బీజేపీ తెలంగాణలో పక్కా మతతత్వ పార్టీ అని చెబుతానని సవాల్ విసరడం ఆశ్చర్యానికి లోను చేస్తున్నది. దేశం కోసం.. ధర్మం కోసం.. హిందూ సమాజం పరిరక్షణ కోసం అంటూ ప్రసంగాల ధాటితో యువతతో పాటు హిందుత్వ భావజాలాన్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండడంపై కూడా అన్ని వర్గాలను బండి ఆలోచింపచేస్తున్నారు.

బండి సౌండ్‌కు అధికార పార్టీలో గుబులు..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన ఐదో విడత పాదయాత్ర సందర్భంగా అడుగడుగునా చేస్తున్న వ్యాఖ్యలు అధికార పార్టీలో గుబులు పుట్టిస్తున్నాయి. గడిచిన నాలుగు విడతల పాదయాత్రలో రాని మైలేజీ ఐదో విడత పాదయాత్రలో వస్తుండడం అధికార పార్టీలో ఆందోళన కలిగిస్తున్నది. నేను హైదరాబాద్ పాతబస్తీలో భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు వెళ్లి కాషాయ జెండా కట్టినోన్ని బైంసాకు వచ్చుడు ఒక లెక్కన అని.. పేర్కొన్న బండి ఎనిమిది రోజుల పర్యటనలో తన భాష యాసతో పాటు సీఎం కేసీఆర్‌పై పదునైన భావజాలంతో మాట్లాడుతున్న వ్యాఖ్యలు అన్ని వర్గాలను ఆకట్టుకుంటున్నాయి. గతంలో కేసీఆర్ మాట్లాడిన మాటలే ఇన్నాళ్లు తమ మదిలో ఉన్నాయని తాజాగా బండి సంజయ్ మాట్లాడుతున్న మాటలు ఆనాటి ఉద్యమ తరహా మాటలను చెరిపివేసేలా ఉన్నాయని యూత్ అభిప్రాయపడుతోంది. ప్రస్తుత తరుణంలో బండి సంజయ్ యూత్ ట్రెండ్ సెట్టర్‌గా మారాడన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

మేధావి వర్గాల్లోనూ..

తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ మాటలు మేధావి వర్గాలను ఆలోచింపజేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన రీతిలోనే.. ఇప్పుడు బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలు మేధావి వర్గంలోనూ కొత్త ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. ఒక్క బీజేపీని కార్నర్ చేస్తూ మతతత్వ పార్టీగా మాట్లాడుతున్న మేధావి వర్గాలు లౌకిక శక్తులు ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నిస్తున్న తీరు కూడా చర్చగా మారుతుంది. ఢిల్లీలో శ్రద్ధ అనే యువతి హత్య కేసులో ముస్లిం యువకుడి పాత్ర, ఆ తరువాత మరో 20 మంది హిందూ అమ్మాయిలతో తాను ఎంజాయ్ చేశారంటూ ప్రకటించిన వివాదం.. కేరళలో వందలాదిమంది క్రిస్టియన్ యువతుల మతమార్పిడి వల్ల జరుగుతున్న ఘోరం, ట్రిపుల్ తలాక్ విషయంలో ముస్లిం యువతులకు జరుగుతున్న న్యాయం గురించి సెక్యులర్లు క్రిస్టియన్ సంఘాలు ముస్లిం మతత్వ సంఘాలు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించిన తీరు కూడా మేధావి వర్గాలను ఆలోచింపజేస్తోంది.

సేర్ కో సవా సేర్ లా..

బీజేపీ చీఫ్ బండి సంజయ్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. నువ్వు మాట్లాడితే సంసారం నేను చేస్తే వ్యభిచారమా అన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు అన్ని వర్గాలను ఆకట్టుకుంటున్నాయి. నువ్వు నేర్పిన విద్యనే నీరజాక్ష.. అన్నట్టుగా కేసీఆర్‌ను తీసుకొని రీతిలో బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలు అధికార పార్టీలో సైతం ఆలోచనత్మకంగా మారుతున్నాయి. బండి సంజయ్ తన పాదయాత్రలో సీఎం కేసీఆర్‌ను.. ఆయన కుటుంబాన్ని టార్గెట్‌గా చేసుకొని చేస్తున్న వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. కేసీఆర్ ఉద్యమ కాలంలో చేసిన వ్యాఖ్యలను తలదన్నేలా బండి సంజయ్ మాటలు ఉంటున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రతి చోటా ఆయన పాల్గొని సభల్లో ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులతో పాటు తాను హాజరవుతున్న ప్రాంతాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు ఎమ్మెల్యేలను టార్గెట్ చేసుకుంటూ బండి చేస్తున్న ప్రసంగాలు ప్రకంపాలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా నిర్మల్ జిల్లాలో మైనార్టీ వర్గాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు మరింత బలంగా పేలుతున్నాయి. తాజా పరిణామాలు బండి సంజయ్ పొలిటికల్ గ్రాఫ్‌ను ఇనుమడింపజేసెలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


Next Story

Most Viewed