'లిక్కర్ దందాలో ఇరుక్కున్న తన కూతురును రక్షించే పని తప్ప కేసీఆర్‌కు ప్రస్తుతం ఇంకో పనిలేదు'

by Dishanational1 |
లిక్కర్ దందాలో ఇరుక్కున్న తన కూతురును రక్షించే పని తప్ప కేసీఆర్‌కు ప్రస్తుతం ఇంకో పనిలేదు
X

దిశ ప్రతినిధి, నిర్మల్: ప్రపంచ దేశాల జీ20 సదస్సుకు ఆతిథ్యదేశమైన భారత్... ఆ సదస్సుకు అధ్యక్ష హోదాలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతున్న నేపథ్యంలో ఆ సదస్సును జయప్రదం చేసే సన్నాహక సమావేశానికి దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అధికార, ప్రతిపక్ష పార్టీల జాతీయ అధ్యక్షులు హాజరైతే మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎటు వెళ్ళాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిలదీశారు. 9వ రోజు పాదయాత్రలో భాగంగా మంగళవారం జిల్లాలోని మామడ మండలం దిమ్మదుర్తి గ్రామంలో జరిగిన సభలో మాట్లాడారు. అంతకుముందు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో బండి సంజయ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లిక్కర్ దందాలో ఇరుక్కున్న తన కూతురు కవితను రక్షించే పని తప్ప ఇప్పుడు ఏమీ కనిపించడం లేదన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలు, ముఖ్యులందరూ ప్రధాని నిర్వహించిన సమావేశానికి వెళితే ఈయన మాత్రం ప్రగతిభవన్ లో తన కూతురుని పట్టుకుని ఏడ్చుకుంటూ కూర్చున్నాడని ఎద్దేవా చేశారు. అలాగే న్యాయవాదులను పిలిపించుకుని ఆ కేసులో ఎలా బయటపడాలో అన్న ఆలోచనలో ఉన్నాడని పేర్కొన్నారు. మరోవైపు దేశమంతటా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వర్ధంతి వేడుకలు జరుగుతుంటే ఈయన మాత్రం ఇంట్లోనే కూర్చుని ఈడీ కేసులు, డ్రగ్స్ కేసులను తప్పించుకునే ఆలోచన చేస్తున్నాడని దుయ్యబట్టారు. ఎన్నికలప్పుడు మాత్రమే సీఎం కేసీఆర్ కు దళితులు గుర్తుకువస్తారని ఆరోపించారు. అంబేద్కర్ ను వర్ధంతి రోజున స్మరించకుండా నివాళులు అర్పించని సీఎం కేసీఆర్ అంబేద్కర్ సహా దళిత జాతిని అవమానపరిచినట్టేనని ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ కూడా దళిత వ్యతిరేక పార్టీ అని ఆరోపించారు. అంబేద్కర్ ను ఎన్నికల్లో ఓడించిన పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. బీజేపీ అంబేద్కర్ ను ప్రపంచ దేశాలకు ఒక ఆదర్శమూర్తిగా చూపిన పార్టీ అన్నారు. పార్లమెంటు సెంట్రల్ హాలులో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి గౌరవించామన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సైతం తాను ఈ కుర్చీలో ఉన్నానంటే అది అంబేద్కర్ పెట్టిన భిక్ష అని గుర్తు చేశారని బండి సంజయ్ వివరించారు. దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన కేసీఆర్ దళితులను మోసం చేశాడని, దళిత బంధు పేరిట మరో మోసానికి తెర లేపాడని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో దళితులందరూ ఏకమై టీఆర్ఎస్ ను ఓడించాలని పిలుపునిచ్చారు. ఎంపీ సోయం బాపూరావు, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి, అప్పల గణేష్ చక్రవర్తి మల్లికార్జున్ రెడ్డి, అంజు కుమార్ రెడ్డి, రావుల రామనాథ్, అయ్యన్న గారి భూమయ్య, పార్టీ నాయకులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed