Collector: దరఖాస్తులు పెండింగ్ లో ఉంచకూడదు

by Kalyani |
Collector: దరఖాస్తులు పెండింగ్ లో ఉంచకూడదు
X

దిశ, ఆదిలాబాద్ : కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల విభాగంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు వారి సమస్యల పరిష్కారం కోరుతూ అందజేసిన ఫిర్యాదులను పెండింగ్లో ఉంచవద్దని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజార్షి షా అధికారులను ఆదేశించారు. సోమవారం సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభాగంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు వారి సమస్యల పరిష్కారం కోరుతూ 166 అర్జీలను సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వారి సమస్యలను ఆలకించారు.

తప్పనిసరిగా డైరీ మెయింటైన్ చేయాలి

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాలకు ప్రత్యేక అధికారులుగా పనిచేస్తున్న వారు తప్పనిసరిగా వారి టూర్ డైరీ ని మైంటైన్ చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. అదేవిధంగా ప్రత్యేక అధికారులు తరచుగా క్షేత్రస్థాయిలో పర్యటన చేసి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని, ఏ ఏ గ్రామాలలో ఏ ఏ సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారానికి తీసుకునే చర్యలపై ప్రజలకు ఇచ్చిన భరోసా పై డైరీలో రాసుకోవాలని అన్నారు.

ఇప్పటివరకు 18 మండలాల్లో ఎక్కడెక్కడ పర్యటించారు. ఏ మండలంలోని ఏ ఏ గ్రామాలలో ప్రజా సమస్యలను పరిష్కరించారు అనే విషయాలను డైరీలో వెల్లడించాలన్నారు. ఇంకా పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను తొందరగా పరిశీలించి సమస్యలను దూరం చేయాలని ఆదేశించారు. ఇందులో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో వినోద్ రెడ్డి, డిఆర్డిఏ పిడి సాయన్న, మార్కెట్ ఏడి శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్ రావు, డీఎస్ఓ కిరణ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ కమర్ అహమ్మద్, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి రాజలింగు తదితరులు ఉన్నారు.



Next Story

Most Viewed