అంగరంగ వైభవంగా మహా సమ్మేళన వేడుకలు..

by Disha Web Desk 20 |
అంగరంగ వైభవంగా మహా సమ్మేళన వేడుకలు..
X

దిశ, నస్పూర్ : నస్పూర్ పట్టణంలోని సింగరేణి హై స్కూల్ పూర్వ విద్యార్థుల మహాసమ్మేళన కార్యక్రమం ఆదివారం ఎంతో వైభవంగా నిర్వహించారు. 1985-86 నుండి 2021-2022 వరకు పాఠశాలలో విద్యను అభ్యసించిన 76 బ్యాచ్లకు చెందిన 3500 మంది పూర్వ విద్యార్థులు, పాఠశాలలో విద్యాబోధన గావించి పదవి విరమణ పొందిన 200 ఉపాధ్యాయులు ఈ వేడుకకు హాజరయ్యారు. గత ఐదు నెలలుగా కో ఆర్డినేటర్లుగా వ్యవహరిస్తున్న పూర్వ విద్యార్థులైన రాజారెడ్డి, వాణిశ్రీ ఐదు సమావేశాలు నిర్వహించి ప్రతి బ్యాచ్ నుండి ఇద్దరినీ ఎన్నుకొని వారి ద్వారా ఈ సమ్మేళనం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ బి.సంజీవరెడ్డి హాజరై విద్యార్థులకు సందేశం ఇచ్చారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి సంస్థ ఎంతో ఘనమైనదని, ఎన్నో వేల మందికి ఉపాధి కల్పిస్తూ ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నదని తెలియజేశారు. అలాగే గోదావరిఖని ప్రాంతంలో 500 కోట్ల రూపాయలతో నిర్మించే మెడికల్ కాలేజీకి కూడా సింగరేణి సంస్థ తోడ్పాటు ఇస్తుందని తెలియజేశారు. దేశ విదేశాల్లో స్థిరపడ్డ పూర్వవిద్యార్థులు తాము చదువుకున్న పాఠశాలను గుడిలాగా భావిస్తూ ఇక్కడ సమావేశం కావడం అభినందనీయమని అన్నారు. ఈ మహాసమ్మేళనం సందర్భంగా సింగరేణి పూర్ణ విద్యార్థుల చారిటబుల్ ట్రస్టును జీఎం ప్రారంభించారు. కొంతమంది పూర్వవిద్యార్థులు శాశ్వత దాతలుగా ఉంటూ ఈ పాఠశాలలో చదువుకొని ఆపదలో ఉన్న సింగరేణి పాఠశాల కుటుంబ సభ్యులను ఆదుకోవడానికి ఈ ట్రస్టు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు.

అలాగే సింగరేణి పాఠశాల ఘనచరిత్రను సాధించిన విజయాలను, మహోన్నతఘట్టాలను ఒక పుస్తక రూపంలో ఒక సావనీర్ కూడా జీఎం, ముఖ్య అతిథులు ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు వేదిక పై పలు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించి ఆహుతులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా డిప్యూటీ జీఎం గోవిందరాజులు, కరస్పాండెంట్, శ్రీరాంపూర్ ఏరియా పర్సనల్ మేనేజర్ రాజేశ్వరరావు, పాఠశాల ఇన్చార్జి హెడ్మాస్టర్ రాధాకృష్ణమూర్తి, సమన్వయకర్తలుగ రాజారెడ్డి, వాణిశ్రీ,పూర్వ విద్యార్థులు డి సమ్మయ్య గౌడ్,విష్ణువర్ధన్ రావు, శ్యాంసుందర్ రెడ్డి, రవి వర్మ, బండారి శారద, జక్కుల మల్లేష్, గోశిక మనోజ్, బండి రమేష్, డప్పు సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Next Story