కవిత విచారణకు ముందు లిక్కర్ స్కాంలో ట్విస్ట్

by Disha Web Desk 2 |
కవిత విచారణకు ముందు లిక్కర్ స్కాంలో ట్విస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఇదివరకే ఈడీకి వాంగ్మూలం ఇచ్చిన హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై తన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలని శుక్రవారం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రామచంద్ర పిళ్ళై పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన స్పెషల్ కోర్టు దర్యాప్తు సంస్థ ఈడీకి నోటీసు జారీ చేసింది. రామచంద్ర పిళ్లై పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అయితే, లిక్కర్ స్కాం విచారణలో భాగంగా అరుణ్ పిళ్లై గతంలో ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను రేపు ఈడీ ప్రశ్నించబోతున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం సంచలనంగా మారింది.

పిళ్లై స్టేట్‌మెంట్ దృష్ట్యా ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించేందుకు రెడీ అవుతోంది. మార్చి 11 శనివారం నాడు ఆమెను ఈడీ ఆఫీసులో ప్రశ్నించబోతోంది. ఈ సమయంలో పిళ్లై ఇలా కోర్టుకు వెళ్లడం, తన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకోవాలనుకుంటున్నానని పిటిషన్ వేయడం ఈ కేసులో కీలక మలుపుగా మారింది. అయితే, సౌత్ గ్రూప్ నుంచి ఎమ్మెల్సీ కవితకు తాను బినామినంటూ అరుణ్ రామచంద్ర పిళ్లై ఈడీ అధికారులకు వాంగ్మూలం ఇచ్చారు. ఆ వాంగ్మూలం ఆధారంగా రిమాండ్ రిపోర్టును ఈడీ అధికారులు కోర్టుకు సమర్పించారు. సౌత్ గ్రూప్‌లో పార్టనర్స్‌గా శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ్, శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్సీ కవిత సహా మరికొంత మంది ఉన్నారు.

దీనికి బయట ప్రతినిధులుగా పిళ్లై, అభిషేక్ బోయినపల్లి, బుచ్చిబాబు వ్యవహరిస్తున్నారని ఈడీ రిమాండ్ రిపోర్టులో తెలిపారు. అంతేకాకుండా, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు రూ.100 కోట్ల మేర ముడుపులు ఇచ్చిన సౌత్‌ గ్రూప్‌ గుప్పిట్లో ఉన్న ఇండోస్పిరిట్స్‌ సంస్థలో ఎమ్మెల్సీ కవిత తరఫున అరుణ్‌ పార్టనర్‌గా ఉన్నారని ఈడీ ఆరోపించింది. ఇప్పుడు పిళ్లై తన వాంగ్ములాన్ని ఉపసంహరించుకోవాలని కోర్టును ఆశ్రయించడంతో లిక్కర్ స్కాంలో నెక్ట్స్ ఏం జరగబోతుంది అనేది తీవ్ర ఉత్కంఠగా మారింది. గడిచిన 5 రోజులుగా పిళ్లై ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈ క్రమంలో 29 సార్లు ఈడీ ఎదుట పిళ్లై హాజరు కాగా, 11 సార్లు రామచంద్ర పిళ్లై స్టేట్మెంట్‌ను ఈడీ రికార్డు చేసింది. కాగా, ఈనెల 13 వరకు పిళ్లై ఈడీ కస్టడీలో ఉండనున్నారు.

Next Story