అత్యాశతో రూ.కోటిన్నర గుల్ల.. భర్తను కోల్పోయి దుఖంలో ఉన్న వితంతువుకు షాక్!

by Disha Web Desk 4 |
అత్యాశతో రూ.కోటిన్నర గుల్ల.. భర్తను కోల్పోయి దుఖంలో ఉన్న వితంతువుకు షాక్!
X

దిశ, రాచకొండ : భర్తను కోల్పోయి దుఖంలో ఉన్న ఓ వితంతువుకు సైబర్ నేరగాళ్ళు కోలుకోలేని దెబ్బ కొట్టారు. దీంతో ఆ కుటుంబం ఆర్ధిక సుడిగుండం లో చిక్కుకున్నారు. రాచకొండ పోలీసు కమిషనరేట్ ఎల్‌బీ నగర్ ప్రాంతానికి చెందిన మహిళను సైబర్ మోసగాళ్లు నిండా ముంచారు. ఆత్యాశకు గురి చేసి ఆ వితంతు మహిళ నుంచి కోటిన్నర కొట్టేశారు. ఇప్పుడు ఆ మహిళ తన డబ్బును తిరిగి ఇచ్చే విధంగా పోలీసులు సహాయం చేయాలని రాచకొండ సైబర్ క్రైమ్ పీ‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన ఆశకు పొతే నష్టం ఎంత తీవ్రంగా ఉంటుందో హెచ్చరిస్తుంది. ఎల్‌బీ నగర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ (48) భర్త కొద్ది రోజుల కిందట మరణించాడు.

భర్తకు సంబంధించిన ఇన్సూరెన్సు డబ్బులు కోటిన్నర వచ్చాయి. ఇది సైబర్ నేరాలకు ఎలా తెలిసిందో తెలియదు ఆ మహిళకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. మీరు పెట్టుబడి పెడితే డబుల్ ఇస్తామని నమ్మించారు. అలా మభ్యపెట్టి సైబర్ నేరగాళ్ళు మొదట రూ.5 లక్షల వరకు చెల్లించారు. తర్వాత కోటిన్నర పెట్టుబడిపెడితే రూ.3 కోట్లు వస్తాయని మాయ చేశారు. దీంతో ఎవరికీ చెప్పకుండా నేరుగా బ్యాంకు‌కు వెళ్లి గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చిన ఖాతాకు కోటిన్నర బదిలీ చేసింది. బ్యాంకు అధికారులు 100 సార్లు ఆలోచించుకోమని ఒకే సారి కోటిన్నర ఒకే ఖాతాకు బదిలీ చేయమనడం మోసంగా అనుమానించాలని సూచించిన ఆమె రూ.3 కోట్ల మాయలో అందరు అబద్ధం చెపుతున్నారని భావించి కోటిన్నర నగదును బదిలీ చేసింది.

600 ఖాతాలోకి ఆ నగదు ట్రాన్స్ఫర్?? కోటిన్నర వేసిన తర్వాత ఆమెను మభ్య పెట్టిన సైబర్ నేరగాళ్ళు అలా 2 నెలల పాటు ఆశ పుట్టించారు. ఆ తర్వాత ఇంకా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో అప్పుడు మేల్కొని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ప్రాథమికంగా దర్యాప్తు చేసిన పోలీసు అధికారులు ఆ కోటిన్నర బదిలీ అయ్యిన తర్వాత ముందుగా 150 ఖాతాలకు ట్రాన్స్ఫర్ అయ్యి ఆ తర్వాత మరో 450 ఖాతాలకు బదిలీ అయ్యి మొత్తం రూ.కోటిన్నర నగదు 600 బ్యాంకు ఖాతాల్లోకి వెళ్లినట్లు పోలీసు అధికారులు ఓ అంచనాకు వచ్చారు. ఈ బ్యాంకు ఖాతా ఒక్కటి కోల్‌కతాలో ఉంటే మరొక్కటి ఈశాన్య రాష్ట్రాల్లో, ఇంకాకొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్నట్లు తెలుస్తున్నాయి.

ఈ ఖాతాలు గుర్తించి వాటిని క్రోడికరించి సైబర్ మోసగాళ్ళను పట్టుకోవాలంటే కనీసం 8 నెలలు పడుతుందని అనుభవం ఉన్న అధికారులు అభిప్రాయపడుతున్నారు. సైబర్ నేరాలపై గత దశాబ్దన్నర కాలం నుంచి నిరంతరం అప్రమత్తం చేస్తున్న ప్రజల్లో మార్పు రాకపోవడం తీవ్ర విస్మయానికి గురిచేస్తోంది. గుర్తు తెలియని వ్యక్తి మాటలకు, ఫోన్, వాట్సాప్ లో పలకరింపులకు, సోషల్ మీడియా వేదికల మీద పరిచయాలకు, ఓటీపీ, పాస్ వర్డ్‌లు ఎవరికీ చెప్పొద్దు వంటి చిన్న చిన్న చిట్కాలు మిమ్మల్ని, మీ డబ్బును, మీ పరువును కాపుడుతుంది. నిర్లక్ష్యం చేస్తే మీరు రోడ్డున పడడం ఖాయం అంటూ సైబర్ క్రైమ్ పోలీసు లు హెచ్చరిస్తున్నారు. అనుమానాస్పద లావాదేవీలపై 24 గంటలలోపు 1930 కు ఫిర్యాదు చేయాలని అధికారులు కోరుతున్నారు.

Next Story