మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డిపై కేసు నమోదు!

by Disha Web Desk 2 |
మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డిపై కేసు నమోదు!
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డిపై కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. నాగర్ కర్నూల్ పాఠశాల ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ ఉల్లంఘించారని స్థానిక పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. గత ప్రభుత్వ హయాంలో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యేగా ఉన్న మర్రి జనార్థన్ రెడ్డి తన సొంత ట్రస్ట్ ఎంజేఆర్ నిధులతో సిర్సవాడ గ్రామంలో ఉన్నత పాఠశాలను నిర్మించారు. పాఠశాల భవనం నిర్మాణం ఇటీవలే పూర్తికావడంతో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విద్యాశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్ రెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. అయితే ఎమ్మెల్యే రాకముందే స్కూల్ భవనాన్ని మాజీ ఎమ్మెల్యే, ఎంజేఆర్ ట్రస్ట్ చైర్మన్ మర్రి జనార్థన్ రెడ్డి, తన అనుచరులతో కలసి ప్రారంభించారు. గతేడాది శంఖుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకంతోనే పాఠశాల భవనాన్ని ఆవిష్కరించారు. అనంతరం తరగతి గదులు, కార్యలయాలను సందర్శించి వెళ్లిపోయారు.

అనంతరం అక్కడకు చేరుకున్న ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఆహ్వానించి రాకముందే.. ఎలా ప్రారంభిస్తారని మండిపడ్డారు. ఇదిలా ఉండగా.. మర్రి జనార్ధన్ రెడ్డిపై ఆగ్రహంతో ప్రభుత్వ అధికారి డీఈఓ మీద కాంగ్రెస్ నాయకులు దాడికి యత్నించారు. నా తప్పేం లేదు అంటూ డీఈవో దండం పెట్టి బతిమాలుకోవడంతో పోలీసులు ఆయనకు ప్రొటెక్షన్ ఇచ్చి పంపించారు. పాఠశాల ప్రారంభోత్సవం కోసం ఎమ్మెల్యే పేరిట ఒకటి, మర్రి జనార్ధన్ రెడ్డి పేరిట రెండు శిలాఫలకాలు ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని రాజేష్ రెడ్డి అనుచరులు విరగ్గొట్టారు.



Next Story

Most Viewed