6800కోట్లు.. 800 మెగావాట్ల విద్యుత్!

by Disha Web Desk 11 |
6800కోట్లు.. 800 మెగావాట్ల విద్యుత్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సింగరేణి సంస్థ నిర్మించ తలపెట్టిన మరో 800 మెగావాట్ల థ‌ర్మల్ విద్యుత్ ప్లాంటు టెండర్ ప్రక్రియను త్వరిత‌గ‌తిన‌ పూర్తి చేసి నిర్మాణ పనులు మార్చి నుంచి ప్రారంభించాలని సింగరేణి సంస్థ చైర్మన్, ఎండీ ఎన్‌.శ్రీధర్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ సింగరేణి భవన్ లో మంగళవారం సింగరేణి థ‌ర్మల్‌, సోలార్ విద్యుత్‌ శాఖలపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు రూ.6,800 కోట్ల అంచనాతో మరో 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థ‌ర్మల్ ప్లాంట్ నిర్మాణం కోసం నవంబర్ లో దేశ‌వ్యాప్త టెండ‌ర్లకు ఆహ్వానం పలికిందన్నారు. ఈ ప్రక్రియను త్వరిత‌గ‌తిన‌ పూర్తి చేయాలని, జనవరి నుంచి నిర్మాణ పనులు ప్రారంభించాలని, కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని ఆదేశించారు. ఈ కొత్త ప్లాంట్ ను ప్రస్తుతం మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద గల 1200 మెగావాట్ల ప్లాంటు ఆవరణలోనే నెలకొల్పబోతున్నామన్నాని తెలిపారు. ప్రస్తుత ప్లాంట్‌కు గ‌ల బొగ్గు ర‌వాణా, నీటి వ‌స‌తుల‌ను ఈ కొత్త ప్లాంట్ కు కూడా వినియోగించుకునే అవ‌కాశం ఉన్నందున కొత్త ప్లాంట్‌కు అద‌నంగా ఈ రెండింటి విష‌యంలో నిర్మాణ వ్యయం త‌గ్గుతుంద‌న్నారు. ఈ నెలలో ఐదు మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ మూడో ద‌శ సోలార్ ప్లాంట్ల నిర్మాణంపై సమీక్షించారు. సింగ‌రేణి థ‌ర్మల్ విద్యుత్ కేంద్రం వాట‌ర్ రిజ‌ర్వాయ‌ర్ లో నిర్మాణంలో ఉన్న 15 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లను వ‌చ్చే మార్చి నాటికి ప్రారంభించాల‌ని చైర్మన్ ఆదేశించారు. వీటిలో తొలి ఐదు మెగావాట్ల ఫ్లోటింగ్‌ ప్లాంట్‌ను ఈ నెలాఖ‌రుక‌ల్లా ప్రారంభించాల‌ని చెప్పారు. మూడో ద‌శ‌లోని మిగిలిన 66 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను వ‌చ్చే ఏడాది జూన్ క‌ల్లా పూర్తి చేయాల‌న్నారు. రామ‌గుండం 3 ఏరియాలోని ఓపెన్ కాస్టు 1 ఓవ‌ర్ బ‌ర్డెన్ డంప్ పైన తొలిసారిగా నిర్మిస్తున్న 22 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఉందని, మిగిలిన వాటిలో చెన్నూరు ప్రాంతంలో 11 మెగావాట్లు, కొత్తగూడెంలో 33 మెగావాట్ల ప్లాంట్లు ఉన్నాయన్నారు. టెండ‌ర్ ప్రక్రియ పూర్తయినందున ప‌నుల‌ను వేగ‌వంతం చేయాల‌ని ఆదేశించారు. రూ.700 కోట్లతో నిర్మించ‌నున్న ఫ్లు గ్యాస్ డీస‌ల్ఫరైజేష‌న్ యూనిట్ నిర్మాణం ప‌నుల‌ను స‌కాలంలో పూర్తి చేయాల‌ని ఆదేశించారు. ఈ సమావేశంలో డైరెక్టర్ డి.సత్యనారాయణరావు, చీఫ్ టెక్నిక‌ల్ క‌న్సల్టెంట్ సంజ‌య్ కుమార్ సుర్‌, చీఫ్ ఆఫ్ ఓ అండ్ ఎం జే ఎన్‌ సింగ్‌, ఎస్టీపీపీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ డీవీఎస్‌ఎస్ ఎన్ రాజు, జీఎం(సోలార్‌) ఎస్‌ జాన‌కిరాం, చీఫ్ ఆఫ్ ప‌వ‌ర్ ఎన్‌ వీ కే విశ్వనాథ రాజు, ఏజీఎం(సివిల్‌) కేఎస్ఎన్‌ ప్రసాద్‌, ఏజీఎం(ఫైనాన్స్‌) సుధాక‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed