సింగరేణిలో 26 లక్షల టన్నుల బొగ్గు మిస్సింగ్..? సీబీఐ విచారణ కోరిన మాజీ మంత్రి గంగుల

by Ramesh Naini |

సింగరేణిని ఈ ప్రభుత్వం దోచుకుంటున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆరోపించారు.

సింగరేణిలో 26 లక్షల టన్నుల బొగ్గు మిస్సింగ్..? సీబీఐ విచారణ కోరిన మాజీ మంత్రి గంగుల
X

దిశ, తెలంగాణ బ్యూరో: సింగరేణిని ఈ ప్రభుత్వం దోచుకుంటున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆరోపించారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. సింగరేణితో కరీంనగర్ జిల్లాకు అనుబంధం ఎక్కువ అని.. హరీశ్‌రావు, తాము ఆర్జీ 1కు వెళ్తే తమను పోలీసులు అడ్డుకున్నారని అన్నారు. తెలంగాణలో 11 సింగరేణి ఏరియాలు ఉన్నాయని.. ఆర్జీ 1లో 3 లక్షల 90 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు ప్రభుత్వం చెప్పిందని.. బుధవారం ఉదయం 11 గంటల వరకు మంత్రి శ్రీధర్‌బాబు ఫోన్ కోసం వెయిట్ చేస్తానని తెలిపారు. ఆ లోపు ఆర్జీ 1 లో ఉన్న బొగ్గు నిల్వలు చూపించాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు ఈ అంశంపై డిప్యూటీ సీఎం భట్టి నోరు మెదపలేదని.. సింగరేణిని దివాళా తీసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. సంవత్సరం నుంచి ఉత్పత్తి లేని అడ్రియాలలో లక్షా 80 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉన్నట్లు చెబుతున్నారని అన్నారు. సింగరేణి గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని.. సింగరేణిలో ఎప్పుడూ సీఎం జోక్యం చేసుకోలేదని తెలిపారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టి బంధువులకు కాంట్రాక్టులు ఇస్తున్నారని ఆరోపించారు. సింగరేణి సంస్థ 4వేల కోట్ల ఓవర్ డ్రాఫ్ట్ తీసుకున్నదని.. 26 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు ఏమైందో భట్టి, శ్రీధర్‌బాబు చెప్పాలని డిమాండ్ చేశారు. బొగ్గు మిస్సింగ్‌పై సీబీఐ విచారణ జరిపించాలన్నారు. కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఏం చేస్తున్నారని నిలదీశారు. సింగరేణిలో కేంద్రం వాటా 49 శాతం ఉండడంతో కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ స్పందించాలని డిమాండ్ చేశారు. టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజి రెడ్డి మాట్లాడుతూ.. సింగరేణిలో మెడికల్ బోర్డు ఎప్పుడు పెడతారో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పాలన్నారు. సింగరేణిలో చంద్రబాబునాయుడు ఆలోచనలకు అనుగుణంగా శిష్యుడు రేవంత్‌రెడ్డి నడుస్తున్నారని ఆరోపించారు. ప్రెస్‌మీట్‌లో బీఆర్ఎస్ నేతలు చిరుమళ్ల రాకేశ్‌కుమార్, కౌశిక్‌హరి, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Next Story