కార్డియాక్​ అరెస్ట్‌తో తెలంగాణలో ఏటా 24 వేల మంది మృతి: మంత్రి హరీష్ రావు

by Disha Web Desk 19 |
కార్డియాక్​ అరెస్ట్‌తో తెలంగాణలో ఏటా 24 వేల మంది మృతి: మంత్రి హరీష్ రావు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఏటా కార్డియాక్ అరెస్ట్‌తో 24 వేల మంది చనిపోతున్నారు అనే అంచనా ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే కార్డియో పల్మనరీ రిససిటేషన్ (సీపీఆర్) శిక్షణా కార్యక్రమాన్ని బుధవారం మేడ్చల్‌లోని జీవీకే, ఈఎంఆర్ఐ వేదికగా మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కార్డియాక్‌ అరెస్ట్‌ వల్ల మన దేశంలో ప్రతి ఏటా 15 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని, సగటున రోజుకి 4వేల మంది చనిపోతున్నట్లు అంచనా ఉందన్నారు. సకాలంలో సీపీఆర్‌ చేయడం వల్ల మరణాల సంఖ్య తగ్గించే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ఓ వంటి సంస్థలు చెబుతున్నాయన్నారు. కరోనా తర్వాత కార్డియాక్ అరెస్టులు పెరిగాయని అధ్యయనాలు చెబుతున్నాయన్నారు.

భవిష్యత్‌లో రాష్ట్రమంతటా గేటెడ్​కమ్యూనిటీ, పంచాయితీ, మున్సిపాలిటీల్లోనూ సీపీఆర్ శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. సీపీఆర్ చేసినా గుండె స్పందించకపోతే ఏఈడీ అనే వైద్య పరికరం ద్వారా ఛాతి నుంచి గుండెకు స్వల్ప మోతాదులో ఎలక్ట్రిక్‌ షాక్‌ ఇవ్వడం ద్వారా గుండె తిరిగి పని చేసేలా చేయవచ్చని.. ఈ పరికరాలను సైతం త్వరలో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయబోతోందన్నారు. మొదటి దశలో 18 కోట్లతో 12వేల ఏఈడీ మిషన్లు కొనుగోలు చేసి అన్ని పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు, బస్తీ దవాఖానల్లో నెల రోజుల్లో ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఇటీవల తన మామ కూడా గుండె పోటుతో మరణించారని.. దీనిపై మంత్రి హరీష్ రావుతో ఓ సందర్భంలో మాట్లాడుకుని సంయుక్తంగా అవగాహన కార్యక్రమాలు చేద్దామని అనుకున్నట్టు తెలిపారు. సీపీఆర్‌పై వివిధ శాఖలలోని సిబ్బందికి శిక్షణ ఇప్పించేందుకు కృషి చేస్తున్న హరీష్ రావుకు ధన్యవాదాలు తెలిపారు. మన దేశం డయాబెటిస్ హబ్‌గా మారిందని.. గుండెపోట్లు పెరగడానికి జీవన శైలి మారడమే కారణం అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డెఫిబ్రిలేటర్స్‌ను ఏర్పాటు చేయాలని మంత్రి హరీష్ రావు‌ను కోరుతన్నానన్నారు. ఈ విషయంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో తెలంగాణ వైద్య రంగం అద్భుతంగా ముందుకు సాగుతోందని చెప్పారు.

ఆ ఘనత కేసీఆర్‌దే: మల్లారెడ్డి

తెలంగాణ ప్రభుత్వం వచ్చాక సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఆరోగ్య రంగం ఎంతో మెరుగుపడిందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఈ ప్రభుత్వం 4 టిమ్స్, వరంగల్ హెల్త్ సిటీ నిర్మిస్తోందని.. పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ దేనన్నారు. సీపీఆర్ కార్యక్రమం అందరం కలిసి కట్టుగా విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు.

Next Story

Most Viewed