బూతుపురాణం మొదలుపెట్టిన రాజకీయ నేతలు.. ఓట్లు రాలుతాయా..?

by  |
బూతుపురాణం మొదలుపెట్టిన రాజకీయ నేతలు.. ఓట్లు రాలుతాయా..?
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రజా ప్రతినిధులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. వారి మాటలు చైతన్యం, స్ఫూర్తి నివ్వాలి. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకపార్టీ నేతలు మరో పార్టీ నేతలపై తిట్ల పురాణం మొదలు పెట్టారు. సన్నాసి అని ఒకరు… లోఫర్, జోకర్, బ్రోకర్లు అని.. నువ్వెంత అంటే నువ్వెంత అనడంతో పాటు ప్రగతి భవన్‎ను, ఫాంహౌజ్‎ను బద్దలు కొడతామని ఇలా పౌరుష పదజాలంతో తీవ్ర స్థాయిలో దూషించుకుంటున్నారు. హుందాగా మాట్లాడాల్సిన ప్రజాప్రతినిధులు, నేతలే రాజకీయాల కోసం నోటి దురుసుతో ప్రవర్తిస్తూ సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారో వారికే తెలియాలి.

నేడు ప్రజాప్రతినిధులు కట్టుదాటుతున్నారు. వారు పరిమితులు దాటి దూకుడు స్వభావంతో నోటిదురుసుగా వ్యవహరిస్తున్నారు. రాజకీయాల్లో దూకుడు సహజమే కానీ హద్దులు ఉంటాయి. కానీ వాటిని మరిచిన నేతలు ఎదుటివారి హోదాను సైతం చూడకుండా మాటల తూటాలు వదులుతున్నారు. మారుతున్నది రాజకీయ పరిణామాలే కాదు వ్యక్తుల వ్యవహారశైలి, మాట తీరు కూడా. ప్రజాప్రతినిధులు అంటే సమాజానికే ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉన్నది. ఆయన మాటకు పార్టీ శ్రేణులే కాదు ప్రజలు సైతం కట్టుబడి ఉండాల్సి ఉండేది. కానీ లోఫర్, లుచ్ఛ, లఫంగి, తొక్కుతా, దమ్ముంటే చూసుకుందామని బహిరంగంగా సభల్లో, యాత్రల్లో, సమావేశాల్లో ఒకరిపై ఒకరు సవాల్ విసురుకుంటున్నారు. ఏదో ఒకటి రెండు పార్టీలు అని అనుకుంటే పొరపాటే అన్ని పార్టీల్లోనూ ఇదే తీరు. ఈ పార్టీలు ఏం సందేశం ఇస్తున్నాయో తెలియక ప్రజలకు అయోమయ పరిస్థితి నెలకొన్నది.

పీసీసీ అధ్యక్షుడిగా నియామకం అయిన తర్వాత రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. టీఆర్ఎస్‌ను టార్గెట్ చేస్తూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగా దళిత, గిరిజన దండోరా పేరుతో సభలు నిర్వహిస్తున్నారు. ఆదిలాబాద్ ఇంద్రవెల్లిలో, రెండో సభ రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో నిర్వహించారు. ఈ సభల్లో దళితబంధు పేరుతో మీ అయ్య జాగీర్ ఇస్తలేవ్.. అది మా హక్కు అని.. మొదటి అడుగు ఇంద్రవెల్లిలో, రెండో అడుగు రావిర్యాలలో వేశాం.. మూడో అడుగు కేసీఆర్ నెత్తిన పెట్టి టీఆర్ఎస్‌ను తొక్కుతాం అని.. కేసీఆర్ ఓ సన్నాసి అని పౌరుష పదాలతో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అంతేకాదు జోకుడు రామన్న , గుడులను మింగే ఇంద్రకరణ్ రెడ్డి, బానిస బతుకు బతికే బాల్క సుమన్ అని, టీఆర్ఎస్ నాయకులను సన్నాసులు అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రజలను, యువతను రెచ్చగొట్టేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రేవంత్ వ్యాఖ్యలకు ధీటుగా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు సైతం దాడికి దిగారు. రేవంత్ ఓ పిచ్చి కుక్క, వెదవ, నువ్వెవ్వడ్రా, దమ్ముందా, లంగ, లఫంగి అని, తొక్కుడు తొక్కుతాం, కంచరగాడిద, బుడ్డరఖాన్, బట్టేబాజ్, లుచ్చాలు, లంగాలు, మగాడివా అని ఎదురుదాడికి దిగారు. ఒక పార్టీకి చెందిన నేతలు స్థాయి మరిచి మాట్లాడితే మరో పార్టీ నేతలు సైతం అదే తీరును వ్యవహరిస్తున్నారు. ప్రజలకు సరైన మార్గం చూపాల్సిన నేతలే తమదారిని మార్చుకుంటున్నారు. ప్రజాసమస్యలను మరిచి వ్యక్తిగత దూషణలకే పరిమితం అవుతున్నారు. ప్రతిపక్షాల విమర్శలకు సద్విమర్శలు చేయకుండా అధికార పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం నోటికి పదును పెట్టి తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఘాటు వ్యాఖ్యలు ఒకరిపై ఒకరు చేసుకుంటుండడంతో ప్రజలు విస్తుపోతున్నారు.

ఇదిలా ఉంటే బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు ఆ పార్టీ నేతలు సైతం టీఆర్ఎస్‌ను టార్గెట్ చేస్తూ దూషణలకు దిగుతున్నారు. కేసీఆర్‌ను నియంత అని, గడీల పాలన, అవినీతి, అరాచక, రాక్షస పాలన చేస్తున్నాడని, మూర్ఖత్వపు సీఎం అని, ఫేకుడు మాటలు, ద్రోహి, దద్దమ్మ, తుగ్లక్ పాలన అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఇలా ప్రతిపక్షాలు సైతం ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టకుండా వ్యక్తిగత దూషణలకే పరిమితం అవుతున్నాయి. సమాజానికి రాజకీయపార్టీల నేతలు ఏం సందేశం ఇస్తున్నారో అర్ధం కాని పరిస్థితి. యువతకు, ప్రజలకు మార్గదర్శిగా ఉండాల్సిన నేతలే నోటి దురుసుగా, పౌరుష పదజాలంలో ఒకరిపై ఒకరు వ్యాఖ్యలు చేసుకోవడం చర్చనీయాంశంగా మారాయి. సమాజాన్ని బ్రష్టు పట్టించేలా రాజకీయ నేతలు మాటలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా నేతలు వ్యవహారశైలిని మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇవి కూడా చదవండి:

ప్రగతిభవన్ సాక్షిగా ‘పవర్’ వార్.. కేటీఆర్, కవిత మధ్య క్లాష్.!


Next Story