ఈ రాత్రికే తెలంగాణ PCC చీఫ్ ప్రకటన..?

by  |
ఈ రాత్రికే తెలంగాణ PCC చీఫ్ ప్రకటన..?
X

దిశ, వెబ్‌డెస్క్ :తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ పార్టీ గడ్డుకాలం ఎదుర్కొంటూ వచ్చింది. తెలంగాణ సెంటిమెంట్‌ను వాడుకుని టీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టగా, రాష్ట్రం ఇచ్చిన ఘనత తమ పార్టీదేనని ప్రజలను నమ్మించడంలో హస్తం నేతలు ఘోరంగా విఫలమయ్యారు. దీంతో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ క్రమంగా పడిపోతూ వచ్చింది. దీంతో పాటే ఆ పార్టీ నుంచి గెలిచిన పదికి పైగా ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరడంతో హస్తం పార్టీ తన ప్రాబల్యాన్ని కోల్పోతూ వచ్చింది. అంతేకాకుండా 2015లో పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన ఉత్తమ్ పార్టీని జనాల్లోకి తీసుకెళ్లడంలో ఫెయిల్ అయ్యాడని సొంత పార్టీ నేతలే ఆరోపించారు. ఉత్తమ్ పదవీ కాలం ముగియడంతో తామంటే తాము పీసీసీ రేసులో ఉన్నామని అంతర్గతంగా కుమ్ములాటలు ప్రారంభమయ్యాయి. కాగా, 2019 సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీ నుంచి రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించడం, మల్కాజిగిరి ఎంపీగా గెలుపొందడం చకచకా జరిగిపోయాయి.

ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో పెను మార్పులు సంభవించాయి. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కంటే అధికార పార్టీని గట్టిగా ఎదుర్కొనే సత్తా, ప్రశ్నించే నైజం రేవంత్‌కే ఉందని, ఆయన్ను తరువాతి టీపీసీసీ చేస్తేనే పార్టీకి పూర్వ వైభవం వస్తుందని తెలంగాణ సమాజం భావిస్తోందని కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు కొత్త రాగాన్ని తెరమీదకు తెచ్చారు. ఆ తర్వాత గాంధీ భవన్‌లో రేవంత్ వర్గం ఓవైపు, మిగతా నాయకులు మరో వర్గంగా ఏర్పడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ సీనియర్ నాయకులు రేవంత్‌కు పీసీసీ ఇవ్వకూడదని ముక్త కంఠంతో ఇన్నిరోజులు వ్యతిరేకిస్తూ వచ్చారు. ప్రస్తుతం కాంగ్రెస్ అధినాయకత్వం మరోసారి తెలంగాణ పీసీసీ‌ మార్పు గురించి ఆలోచిస్తుందని తెలియగానే సీనియర్లు రంగంలోకి దిగి లాబీయింగ్ ప్రారంభించారు. మధుయాష్కీ, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వంటి నేతలు ఇప్పటికే హస్తినకు చేరుకున్నారు. ఒక్క ఛాన్స్ ఇస్తే తామేంటో ప్రూవ్ చేసుకుంటామని కాంగ్రెస్ అధినాయకత్వాన్ని నమ్మించే పనిలో నిమగ్నమయ్యారు. ఇదిలాఉండగా, తెలంగాణ పీసీసీ చీఫ్ నియామకం తుదిదశకు చేరుకుందని టాక్. ఈ రోజు రాత్రికే కొత్త పీసీసీ చీఫ్ పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్లు గాంధీభవన్ నుంచి లీక్స్ వస్తున్నట్లు తెలుస్తోంది.


Next Story

Most Viewed