కరోనా.. వలస కూలీల లాంగ్ మార్చ్!

by  |
కరోనా.. వలస కూలీల లాంగ్ మార్చ్!
X

దిశ, న్యూస్ బ్యూరో: దేశమంతా లాక్‌డౌన్.. ఎక్కడి వాహనాలు అక్కడ బంద్.. బస్సులు, రైళ్ళు, విమానాలు, ఓడలు.. అన్నీ విశ్రాంతిలో ఉన్నాయి. నిన్నటిదాకా రోడ్లన్నీ వాహనాలతో కిటకిటలాడాయి. కానీ ఇప్పుడు రోడ్లమీద చీమలబారుల్లా మనుషులు కాలి నడకన స్వస్థలాలకు బయలుదేరారు. చైనాలో లాంగ్ మార్చ్ గురించి విన్నాం. వైఎస్సార్ పాదయాత్ర చూశాం. ఆయన కొడుకు వైఎస్ జగన్ పాదయాత్ర చూశాం. ఇప్పుడు నిరుపేదల కరోనా కాలినడకను చూస్తున్నాం. లక్ష్యాలు వేరైనా నడక మాత్రం ఒకటే.

కంటికి కనిపించనంత దూరంలో ఊర్లు. ఒక్క అడుగుతోనే ప్రయాణం మొదలవుందంటారు. ఇప్పుడు అదే జరుగుతోంది. పొట్టకూటి కోసం గ్రామాల నుంచి పట్టణాల బాటపట్టిన రోజువారీ కూలీ కార్మికులు లాక్‌డౌన్ పుణ్యమా అని సొంత ఊర్లకు బయలుదేరారు. గమ్యం చేరుకుంటారో లేదో తెలియదు. కానీ ప్రయాణం మాత్రం ఆగడంలేదు. వీపుకు కిట్ బ్యాగు, చేతిలో సంచీ. నెత్తిమీద చంటిబిడ్డలు. ఉత్తరప్రదేశ్‌లని గోరఖ్‌పూర్, జార్ఖండ్‌లోని పల్లెలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, నర్సీపట్నం, రాజమండ్రి.. ఇలా ఎన్నో ఊర్ల నుంచి వచ్చినవారు బతుకు జీవుడా అంటూ సొంతూరి బాట పట్టారు.

ఎక్కడి మియాపూర్? ఎక్కడి గోరఖ్ పూర్? ఇక్కడి భాష తెలియదు. పరిచయస్తులు లేరు. చేద్దామంటే పని లేదు. ఎన్నిరోజులు పస్తులుండాలో తెలియదు. కలో గంజో కన్న ఊరిలోనే… అనుకుంటూ యాభై మంది యువకులు కాలినడకన బయలుదేరారు. పొద్దున తిన్న రెండు రొట్టెలు సాయంత్రానికి వారిని మేడ్చల్ దాకా నడిపించగలిగింది. రోజుకు రూ. 400 నుంచి రూ. 600 వరకు వేతనం లభించే గ్రానైట్ ప్లోరింగ్ పని చేసే వీరు భవన నిర్మాణం పని ఆగిపోవడంతో ఇంటి బాట పట్టించింది. వారిని ఇక్కడకు తెచ్చిన కాంట్రాక్టర్ పత్తా లేడు. ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. ఎన్ని కిలోమీటర్లు నడవాలో తెలియదు. రెండు మూడు వారాల డబ్బు చేతికి అందడంతో వాటిని పెట్టుకుని ఏది దొరికితే అది తింటూ వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. ఎన్ని చెక్‌పోస్టులు వారిని అడ్డుకుంటాయో కూడా తెలియదు. అయినా స్వంత ఊరిలో బతకొచ్చన్న దీమా వారిని నడిపిస్తోంది.

చీపురుపల్లి నుంచి పొట్ట చేతపట్టుకుని నగరంలో ఏ పని దొరికితే అది చేద్దామని అడ్డాకూలీలుగా వచ్చినవారు మరికొందరు. జనతా కర్ప్యూ వరకు వారి పరిస్థితి ఫర్వాలేదనే అనిపించింది. కానీ ఆ రోజు నుంచి వీరికి చేద్దామన్నా పని దొరకలేదు. నిలువ నీడ లేదు. రాష్ట్ర ప్రభుత్వం నైట్ షెల్టర్లు, అన్నపూర్ణ భోజనం వీరిని నిలువరించలేకపోయాయి. కరోనా అంటే ఏంటో తెలియదు. తుపానులను చూసిన వీరికి అదో రకమైన తుపాను అనుకున్నారు. ఏదో ఉపద్రవం జరగబోతుందనే భయం మాత్రం తెలుసు. నిత్యం సందడిగా ఉండే రోడ్లన్నీ చూసిన వీరికి కర్ప్యూ వాతావరణ చాలా పెద్ద భయాన్నే కలిగించింది. ”మేమిక్కడ… మా పిల్లలు అక్కడ. ఎందుకొచ్చిన గోల ఇది. బతికుంటే మళ్ళీ వస్తాం.. ఇప్పుడైతే మా పిల్లల్ని వదులుకోలేం.. అందుకే వెళ్ళిపోతున్నాం.. రైళ్ళు, బస్సులు లేకపోయినా నడిచే వెళ్తాం.. ఎన్ని రోజులైనా పట్టనీ.. మా పిల్లల్ని కలుసుకుంటే చాలు..” అని ఒక యువతి దీనంగా చెప్పింది. సుమారు పాతిక మంది ఆడా, మగా కలిసి నడుస్తూనే పోతున్నారు. మాట్లాడితే రెండు నిమిషాలు వృధా అవుతుందనుకున్నారో ఏమో నడుస్తూనే వారి కష్టాన్ని ‘దిశ’తో పంచుకున్నారు.

”కొత్తగా బిల్డింగ్ కట్టే కూలీ పనికి వచ్చాం. రెండేళ్ళ కిందటే వచ్చాం. నాలుగైదు అపార్టుమెంట్లు కట్టేశాం. ఇప్పుడు చేస్తున్న అపార్టుమెంటు పని కూడా అయిపోయింది. ఇంకోటి దొరికితే ఇక్కడే ఉండి పనిచేద్దామనుకున్నాం. కానీ అలాంటిది దొరకలేదు. కొత్త అపార్టుమెంట్లయితే అక్కడే షెడ్డులో అందరం కలిసి ఉంటాం. కానీ ఇప్పుడు చేతిలో పనిలేదు గదా! కడుపు నిండాలంటే పని కావాలి గదా. ఇక్కడ చెప్పుకునే మాటలన్నీ విన్నాక భయమేసింది. ఏదో కొంపలంటుకుపోయేది వచ్చేస్తుందని అర్థమైంది. కూడు, గూడు లేకుండా ఏ ధైర్యంతో ఇక్కడ ఉంటాం? ముందు మా ఊళ్ళకు వెళ్ళిపోతే ఆ తర్వాత చూస్తాం” అంటూ దాదాపు ఇరవైమంది మహిళల బృందం రాజమండ్రికి బయలుదేరింది. ‘ఈ రోడ్డెంట వెళ్తే రాజమండ్రి వస్తుందా?’ అనే అమాయకపు ప్రశ్న వేసింది ఈ బృందంలోని ఒక మహిళ. చేతిలో కొన్ని సామాన్లతో ఉన్న ప్లాస్టిక్ బక్కెట్, భుజానికి తగించుకున్న గుడ్డమూట సంచి, నెత్తిమీద ఏ ఆధారం లేకుండా ఉన్న వంటపాత్రల మూటలే ఆమె ఆస్తి.

రెండు రోజుల నుంచి మనం గుజరాత్ నుంచి బీహార్ వెళ్ళేవారిని టీవీల్లో చూశాం. దేశమంతా లాక్‌డౌన్ జరుగుతున్నా ఢిల్లీ శివారులోని ఆనంద్‌విహార్ అంతర్జాతీయ బస్ స్టేషన్ దగ్గర వేలాది మంది ఉత్తరప్రదేశ్‌లోని స్వస్థలాలకు వెళ్లే జనాన్ని చూశాం. ఇంతటి గుంపు హైదరాబాద్‌లో కనిపించకపోయినా చీమలబారుల్లా పగలు, రేయి తేడా లేకుండా నగర శివారు ప్రాంతం నుంచి ప్రయాణాన్ని మొదలుపెట్టి నగర వీధుల గుండా వెళ్తూనే ఉన్నారు. రాష్ట్ర సరిహద్దులు మూశారన్న విషయమూ వారికి తెలియదు. నగరంలో సుమారు నాలుగు లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారని మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో చెప్పి వారిని ఆదుకోడానికి ఆయా కన్‌స్ట్రక్షన్ కంపెనీలు అన్ని చర్యలూ తీసుకున్నాయని ఒకింత గర్వంగా ప్రకటించారు. ఏ ఒక్కరూ పస్తు ఉండాల్సిన పనిలేదు.. సొంత బిడ్డల్లా చూసుకుంటాం.. అని ముఖ్యమంత్రి చెప్పిన మాటలూ వీరికి భరోసా కల్పించలేకపోయాయి.

Tags: Telangana, Migrated Workers, Corona, LockDown, Hyderabad, Construction Workers

Next Story

Most Viewed