షార్జాలో తెలంగాణ యువకుడు అరెస్ట్.. కారణం ఇదే..

by  |
Telangana man arrested in Sharjah
X

దిశ,జగిత్యాల : గల్ఫ్ దేశాలలో ఉద్యోగుల కోసం వెళ్లే భారతీయ యువకులు నానా అగచాట్లు పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో చాలా మంది అన్ని విషయాలు తెలిసి కూడా తప్పులు చేస్తున్నారు. మొదట తాము ఒప్పందం చేసుకుని వెళ్లిన కంపెనీల నుండి బయటకు వచ్చి ఆ దేశాల్లో అక్రమంగా పట్టుపడుతున్న ఉదంతాలు ఇటీవల కాలంలో ఎక్కువ అవుతున్నాయి. వీరు ఆ దేశాల నుండి ఇండియాకు వచ్చేటప్పుడు పట్టుబడి నెలలు, సంవత్సరాల కొద్ది జైళ్లలో మగ్గాల్సి వస్తుంది.

జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలానికి చెందిన శ్రీనివాస్ బతుకుదెరువు కోసం రెండేళ్ల క్రితం లెబారన్ దేశానికి వెళ్లాడు. సెలవులు రావడంతో అక్కడి నుండి ఇండియా వచ్చే క్రమంలో వయా షార్జా టికెట్ తీసుకున్నాడు. దాంతో షార్జాలో దిగడంతో అక్కడి ఇమిగ్రేషన్‌లో షార్జా పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయం అతడి స్నేహితుడి ద్వారా తెలిసింది.

అవగాహన లోపమా..?

శ్రీనివాస్ 2012 లో దుబాయ్ వెళ్లి మొదట ఒప్పందం చేసుకున్న కంపెనీలో ఎనిమిది నెలలు కార్మికుడిగా పనిచేశాడు. అతని స్నేహితులతో కలిసి కంపెనీ నుండి బయటకు వచ్చి 16 నెలలు ఇతర కంపెనీలలో పనిచేస్తూ దుబాయ్ పోలీసులకు చిక్కాడు. అక్కడ శిక్ష అనుభవించి ఇండియాకు వచ్చాడని అతని బంధువులు తెలిపారు. తరువాత గ్రామంలో మూడేళ్లు ఉపాధిహామీ పనులు, కూలి పనులు చేశాడని తెలిపారు. అయితే లెబారన్ లో ఉంటున్న శ్రీనివాస్ స్నేహితుడు ఫ్రీ వీసా పంపించడంతో 2019 లో లెబారన్ వెళ్లారు. అక్కడ రెండు సంవత్సరాలు పనిచేసిన తర్వాత కంపెనీ సెలవులు ఇవ్వడంతో ఇండియాకు వచ్చే క్రమంలో షార్జాలో అరెస్టయ్యాడని బంధువులు తెలిపారు.

శ్రీనివాస్ భార్య ఏమన్నారంటే..

భార్య మమత మాట్లాడుతూ తన భర్త శ్రీనివాస్ బుధవారం ఉదయం తనతో మాట్లాడారని, వయా షార్జా టికెట్ బుక్ అయిందని చెప్పాడని తెలిపింది. అప్పుడు ఫోన్ చేసిన వ్యక్తి ఇప్పటివరకు మళ్లీ ఫోన్ చేయలేదని రోదించింది. శ్రీనివాస్ షార్జాలో దిగిన వెంటనే పోలీసులు అరెస్టు చేశారని, లెబారన్‌లో ఉంటున్న మిత్రునికి వాయిస్ మెసేజ్ ద్వారా తెలిపాడని వాపోయింది. తనను ఎందుకు అరెస్టు చేశారో కూడా అర్థం కావడం లేదని మిత్రుడికి మెసేజ్ ద్వారా తెలిపాడని మమత తెలిపింది. తమది నిరుపేద కుటుంబమని, తను బీడీలు చేస్తూ జీవిస్తున్నానని కన్నీటి పర్యంతం అయింది. తన భర్తను తమతో మాట్లాడించి, ఇండియాకు క్షేమంగా వచ్చే విధంగా ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని కోరింది.

ఇది కూడా చదవండి..

షార్జాలో చిక్కుకున్న తెలంగాణ వాసులు

Next Story

Most Viewed