ఐటీలో మనమే నంబర్ వన్

by  |
ఐటీలో మనమే నంబర్ వన్
X

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా పరిస్థితుల్లోనూ ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ రాష్ట్రం సత్తా చాటిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గత ఏడాది ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ 17.93 శాతం వృద్ధి సాధించిందని అభినందించారు. ఐటీ పరిశ్రమకు తెలంగాణ గమ్యస్థానంగా మారిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఐటీ ఉద్యోగులు కరోనా సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గురువారం సీఎంను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఆ శాఖ అధికారులు కలిసి గడిచిన ఆర్ధిక సంవత్సరంలో తెలంగాణ ఐటీ శాఖకు సంబంధించిన వార్షిక నివేదక అందజేశారు. ఈ సందర్భంగా ఐటీ పరిశ్రమను ఉద్దేశించి సీఎం కేసీఆర్ మాట్లాడారు. గత ఐదేళ్లుగా ఐటీ ఎగుమతుల్లో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందన్నారు. మొత్తం దేశ ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ 11.6 శాతాన్ని తెలంగాణ నుంచే ఎగుమతి చేస్తున్నామని తెలిపారు. ఐటీ వృద్ధి కారణంగా తెలంగాణలో ఉద్యోగాల కల్పనలో వృద్ధి 7.2 శాతంగా ఉందన్నారు. కరోనాను నివారించేందుకు రాష్ట్రంలో ఐటీ కంపెనీలు కృషి చేశాయని, రూ.70 కోట్ల విలువైన పీపీఈ కిట్లు, వెంటిలేటర్లు సమకూర్చాయని సీఎం కొనియాడారు. కరోనా కష్టకాలంలో ఐటీ పరిశ్రమల ఐటీ ఫర్ టీఎస్ కార్యక్రమాన్నిచేపట్టి ఉద్యోగులంతా తమ ఒక రోజు, రెండు రోజుల జీతాలు విరాళంగా ఇచ్చారని ఐటీ మంత్రి కేటీఆర్, రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్ సీఎంకు వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఈటల రాజేందర్, నిరంజన్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ పాల్గొన్నారు.

Next Story

Most Viewed